డయాలసిస్ కేంద్రం
డయాలసిస్ కేంద్రం
డయాలసిస్ కేంద్రం...
బ్రతుకు పోరాటంలో మనిషి చేసే పనుల వల్ల...కర్మల వల్ల..కష్టం వల్ల..వచ్చే శారీరక మానసిక మాయదారి వ్యాధి కిడ్నీ వ్యాధి!!
ఆ క్రమంలో ఊపిరి ఆగకుండా.. ఊపిరితిత్తులకు నీరు పట్టకుండా ప్రత్యామ్నాయ పరిష్కారం డయాలసిస్!!
ఆ ప్రక్రియలో వైద్యాన్ని అందించే కేంద్రమే డయాలసిస్ సెంటర్!!
దేవుడితో పందెం వేసి..కాలంతో పరుగులు పెట్టి..దిన దిన ఆరోగ్యం ప్రసాదించే అభాగ్యుల పుణ్య క్షేత్రం!!
***
అది రోగుల పాలిట స్వర్గధామం..
వ్యాధి గ్రస్తుల పాలిట జీవిత కాల సందర్శనా స్థలం..
ఎటు చూసినా కన్నీళ్లు ఇంకిన కళ్లు...
భయం నిండిన గుండెలు.. భారమైన శరీరాలు..
నీరు నిండిన కాళ్ళు..ఖాళీ జేబులు..
చిరిగిన చొక్కాలు.. అరిగిన చెప్పులు..
ఆహకారాలు.. ఆర్తనాదాలు..
బయట పడని అయోమయాలు..
అది ఒక దేహాల ప్రయోగశాల!!
***
శత్రువుకు కూడా రాకూడని రోగం..
ఊపిరి పోయేవరకు వ్యాధితో పోరాటం..
తోడు తప్పనిసరైన నిజ జీవితం..
రక్తమాంసాల సువాసనతో నిండిన పడక సుఖం..
రోజూ తప్పని ఊపిరి యుద్ధం..
ఎంతకీ విడవని పాడు ప్రాణం!!
***
అక్కడ వైద్యుడు దేవుడు..
వైద్య సహాయక సిబ్బంది మహాత్ములు..
యంత్రాలు ప్రాణాన్ని నిలిపే దాతలు..
రోగులు నిత్య ప్రాణ సంకట యుద్ధ వీరులు..
దిన దిన మృత్యుంజయులు..
రోగులకు తోడు వచ్చే సహాయకులు... దౌర్భాగ్యులు అమాయకులు!!
అది ప్రభుత్వ ఆరోగ్య దాన మందిరం!!
***
అక్కడ..
6 ఏళ్ల పాప కోసం తల్లి తల్లడిల్లుతుంటుంది..
24 ఏళ్ల యుక్త వయసొచ్చిన కొడుకు కోసం తండ్రి ఆరాటపడతాడు..
నడివయసు భార్య కోసం భర్త బోరుమంటాడు..
నలభై అయిదేళ్ల భర్త కోసం భార్య దిగులుపడి దిక్కుతోచనిపరిస్థితిలో ఉంటుంది..
అరవై ఏళ్ల తండ్రి కోసం కొడుకు వేసారతాడు..పరుగులు పెడతాడు..
యనబై ఏళ్ల బామ్మ కోసం మనువడు మసియిపోతాడు..
అది అనుబంధాల కారాగారం!!
***
ఆరోగంట అవగానే
బైకుల మోత
అంబులెన్సుల కూత
ఆటోల అరుపులూ..
ఉరుకులు..పరుగులు..
ఆయాసాలు... అలసటలు..
ప్రాణాలు గాల్లో..రోగులు హాల్లో..
ఆహా... థంబు కోసం పాట్లు... పరుగులు..
నాలుగు గంటల నరక యాతనకు..
ఉదయం నాలుగు గంటల నుంచి నానా అగచాట్లు..
అది కాలప్రయాణ కర్మాగారం!!
***
ఎండైన... వానైన
శరీరానికి పట్టిన నీటిని తోడే యంత్రాలు ఆగవు
యంత్రాంగమూ ఆగదు...
పరుపులు విశ్రాంతిని ఎరుగవు..
రోగులు ప్రశాంతత ఎరుగరు..
మనుషులు విశ్రమించరు..
ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించినా
చాలని వసతులు..తరగని కేసులు..
ఆహా.. అదొక నిత్య రోగ క్షేత్రం...
ప్రజోపకార ఆరోగ్య కేంద్రం!!
అదే డయాలసిస్ సెంటర్!!!
--
హరి
