కవన వీవనలతో సేద తీర్చనా!!
కవన వీవనలతో సేద తీర్చనా!!
వలపు రేయిలో కలలో.. కన్నులలో
వసంత సమీరం మెల్లిగా మెదిలింది..
***
చైత్రం చిగుళ్లు విప్పార్చిన తొలి వైశాఖ ముహూర్తాన
ఆమని పాట పాడుతూ ప్రేమ దేశపు యువరాణియో
నా మదిలోకి అడుగుపెట్టింది!!
***
అవ్విధావ
అడుగిడిన ఆ చరణాలకు
ప్రేమ పారాణిని పూసి..
నాకై కలబడిన ఆ కన్నులకు
నీలిమబ్బులతో కాటుకలద్ది..
ఆ దేవికి దిష్టి తగలకుండా
కృష్ణ తిలకాన్ని బుగ్గన పెట్టి..
పాలపుంతని పాపిట దిద్ది..
నా హృదయ సీమలోకి ఆహ్వానించాను..
***
తానొక ప్రణయ మాధురి..ప్రణవ మంజరి
ప్రవణ వల్లరి..దేవేరి.. కావేరి... ఝవేరి
ప్రవగ ప్రవీణ..నిత్యప్రేమ రసధుని
మహారాణి.. అలివేణి..
***
ఆ ప్రణయ దివి సీమలో..ప్రేమ తరంగిణికి
నిత్యం ప్రేమాభిషేకాలు చేసే ఆ హృదయ దాసుడను నేను!! ఆ దేవతా మూర్తి స్పర్శ చేతన మాత్రమే
ప్రాణ సమీరం అమృతాలు వెదజల్లుతుందని భావించి నమ్మిన మనోజ్ఞానిని నేను!!
***
అట్టి
ప్రణయాఖాతంలో ప్రతీ నిత్యం నను ఓలలాడించే
ఆ అఖండ సృష్టిని..అరుదైన ముత్యాన్ని..ఎలా సేవించను??
తన కొరకు తుమ్మెద ఝంకారాలను
వింజామరలుగా మలిచి
కవన వీవనలతో సేదతీర్చనా??!
***
తనకు కవితావధానం ..ప్రేమ గానం...మైత్రీ వనం ఇష్టమైనదని తెలుసుకుని.. సాహితీలతల సోయగాలను అంతరాత్మ నుంచి వెలికి తెచ్చి
మోకాళ్ళపై ఉండి అందించనా??
***
ప్రకృతిని పూలవనంగా మార్చి...
సూర్యకాంతిని, వెన్నెలను,పక్షులను,
నదుల వంపులను..మాలలుగా కూర్చి
ఆ సువర్ణ కాంతుల పుత్తడిబొమ్మకు...
నా బాహువులలో బంధించి నిత్య
పుష్పాభిషేకం చేయనా??
***
హరివిల్లును వంచి.. చందమామని దించి..
సముద్రాన్ని చుట్టి..భూమిని పైకెత్తి..
ఆకాశాన్ని తుంచి.. ప్రపంచాన్ని..పంచ భూతాల్ని నా వశం చేసుకుని తనకు ప్రేమ కానుకగా ఇవ్వనా??
అయినా తనకు నేనుండగా ప్రకృతి ఎందుకు??
***
లేక....
తన నవ్వులో ప్రతీ నిత్యం యవ్వన వసంత సౌరభాన్ని నింపుతూ..
అలసిన ఆ పాదాలకు సున్నితముగా లేపనానువర్తనం చేస్తూ..
సంపూర్ణమైన ఆ మనసుకి ఈ జన్మని అంకితం ఇస్తానని మాటిస్తూ..
అన్నింటికీ మించి ప్రేమ పోతపోసిన
ఆ అందాన్ని నా కళ్ళలో ధరిస్తూ..
ఆ ప్రణయ బంధాన్ని నా గుండెల్లో బంధించుకుని..
ఒక హృదయస్పర్శ ఇవ్వనా???
***
అది చాలదా..
స్వచ్ఛమైన స్త్రీ కోరేది
స్వేచ్ఛాయుతమైన ప్రేమ హృదయం మాత్రమే కదా!!
--
హరి

