మనసొక అంతరిక్షం
మనసొక అంతరిక్షం
ఎగసిపడే అగ్నిపర్వత లావా
మీద పడుతున్నట్లు రేగే ఆలోచనలు
మిన్నులోంచి ఉల్కలు
వాకిట్లో పడుతున్నట్లు
పెద్ద సాలెగూడులో చిక్కుకున్నట్టు
అంతరిక్ష నౌకల యుద్ధం
కనబడేవి తారలే
కానీ సిగలో తురిమే ధైర్యం లేదు
కవిత్వమెంత చిత్రమైన అనుభూతి ఇచ్చునో కదా
వేటకు పోయి జంతువుకు ఆహారం అయినట్లు
ఎగిరి వచ్చి మరీ
నీ ఆలోచనలను వదిలిపెట్టడం మరచానేమో
ఊపిరి పీలుస్తూ
క్షణాలు లెక్కపెట్టి
వేరే పాలపుంతను ఆశ్రయించి
నువ్వు దూరం పెంచినట్టా
ఇష్టం కరిగినట్టా
కాలం తెలియని అంతరిక్షపు ధూళిలో
గడ్డ కట్టే చలో
చెమట పట్టించే ఎండో
ఏదీ తెలియని శూన్యంలో
దూరమెలా తెలుస్తుంది
మర్మమైన గ్రహాల జాడలు తెలిసినా
మనిషి మనసులోని తలపులు తెలియకున్నాయి
ఇంత చెప్పినా మారని నీ మెదడుకు
నేను చెప్పేది ఒకటే
ఇక్కడా చర్యకు ప్రతిచర్య ఉండొచ్చు
కాకపోతే నీకది తెలిసేలోపు
నే భూమిలోకి చేరవచ్చు
