మన క్రీడలు
మన క్రీడలు
మన క్రీడలు.
కుర్రవాళ్లాడెదరు కోతికొమ్మచ్చులు
జారుడు బండాటలు జలములో నీతలు
బిళ్ళంగోడనుచు పిల్లలందరు చేర
కళ్ళకు గంతలు కట్టి కళ్ళాలలో పాఱ
గోళీలాటలకు గుంతలను త్రవ్వేరు
కోలు కోలంచునట కోలాటమాడేరు
సాము గరిడీలతో 'సై 'యనుచు నెగిరేరు
దొమ్మరాటంచు నిట దొర్లుచూ పొంగేరు
ఆడపిల్లలచ్చోట నచ్చనగిల్లాలను
వేడుకగ నాడంగ వీధులే మురిసెను
వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి?
చేరి దొంగను పట్టి చిందులను వేసెదరు
వామనగుంటలతో వాకిళ్ళు నిండుగ
సామరస్యము పొంగి సావిడిలో పండుగ
చిన్నపిల్లలాటలు చెదిరిపోయెను నేడు
మన్నులో కలిసెనా మంచి దినములు చూడు
చరవాణిలో మునిగి చతికిలపడిపోయి
చిరుబాల్యమిప్పుడు చింతలో జారిపోయె
భావి పౌరులకు బలము పెంచును క్రీడ
జీవితమ్మున వారు చింతలను విడనాడ
దేశీయ క్రీడలను తీరుగా నాడించి
దేశమున బాలలను ధిషణతో పెంచండి!//
