మల్లెమొగ్గ
మల్లెమొగ్గ
ననుచూస్తూ నవ్వుతూనె..ఉండేనా మల్లెమొగ్గ..!
నాఆశల సెలయేఱుగ..మారేనా మల్లెమొగ్గ..!
ఎంతచనువు తనకంటే..ఏంచెప్పను మాటలలో..
తన పాటగ నేమిగలగ..కోరేనా మల్లెమొగ్గ..!
నన్నేలే భావాలను..ప్రకటించగ తోడుండును..
వాడని నవ వసంతాల..ఇల్లేనా మల్లెమొగ్గ..!
కాంతిపూల మధువేదో..వర్షించే కోమలిరో..
నాకోసం దిగివచ్చిన..వధువేనా మల్లెమొగ్గ..!
ఎడబాయని కోకిలమకు..రాగసిరుల వరదాయిని..
త్యాగపూర్ణ గగనమంత..గురువేనా మల్లెమొగ్గ..!
క్రోధియైన ఉగాదితో..చెలిమిచేయు తీరేదో..
వివరించే వేడుకలో..పదమేనా మల్లెమొగ్గ..!

