మహా విస్ఫోటనం
మహా విస్ఫోటనం
ఎన్నివేల సంవత్సరాల
ఎన్నెన్ని యుగాల క్రితమో
చెప్పలేనుగాని
ఒకానొక వసంత వేళ
నా చూపుతో నీ చిరునవ్వు
ఢీకొన్నప్పుడు..
జరిగిన విస్పోటనంలో
పంచరంగులు ప్రజ్వరిల్లి
మరుక్షణంలో మాయమై
ప్రకంపనల స్వరాలలో
నేలీనమై.....
పచ్చిక బయళ్ళలో
పండు వెన్నెల్లో
మలయమారుతంలో
మల్లెల పరిమళంలో
సెలయేటి గలగలలో
కలువ కొలనులో
లేలేత కిరణాలలో
మసక చీకట్లలో
లతల సోయగాలలో
కోయిల కుజితాలలో
అలలు సవ్వడిలో
ఇసుకతిన్నెలలో
ఆమని కదలికలో...
పర్వతసానువుల్లో
నందనవనాల్లో..
నీ నవ్వులువెదజల్లిన
వెన్నెలలను వెదుక్కుంటూ...
ఏరుకుంటూ...
మరులుగొన్న
పురుషుడినై నేను
పరవశించు ప్రకృతివై నీవు
నీ వొడిలో నేను
నా జతలోనీవు
ఎప్పుడూ విడివడక
ఎన్నడో బిగిసిన
ముడిగనక
ఒకరిలో ఒకరం లీనమై
కదిలేకాలానికి ఏలికలమై
ఎప్పటికప్పుడు
ఊహలకు
తేనియలద్దుతూ...
ఎన్నిన్ని ప్రణయ కావ్యాలు
వ్రాసామో...!
ఎన్ని ప్రేమ గీతాలు పాడమో..!
ఇదేకదా నిరంతర సృష్టికార్యం
అనిర్వచనీయానంద రహస్యం
మానవవిస్తృతి మూలబంధం
