ఒక్క క్షణం
ఒక్క క్షణం
ఒక్క క్షణం, ఒకటే ఒక్క క్షణం
జననమైనా, మరణమైనా
జీవితాన్ని మార్చే ఏ క్షణమైనా
ఒకే ఒక్క క్షణం, అదే బతుకు లక్షణం
క్షణమొకటే కావచ్చు, అదే జీవితం
మనిషి మనుగడలో ప్రతి క్షణం
ఊపిరి నిలువడానికి, పోవటానికి
ఈ క్షణమే అణుక్షణం బ్రతకడానికి
గడిచిన క్షణం తిరిగి రాని క్షణం
రాబోయే మరు క్షణం చేతిలో లేని క్షణం
ఉన్న ఈ క్షణమే నీ కావాల్సిన క్షణం
అందుకే పూర్తిగా ఆస్వాదించు, జీవించు
క్షణికావేశాలు, కట్టలు తెగే కోపాలు
బతుకును చిదిమి చిధ్రం చేసే గడియలు
ఒక్క క్షణం ఓపికతో ఒనగూరే ప్రయోజనాలు
కట్టడి చేసిన క్షణమే కడుపయోగాలు
క్షణికమైన దుఃఖం, క్షణికమైన ఆనందం
చిత్రంగా క్షణాల్లో మారే బతుకు చిత్రం
ఏ క్షణానికి ఆ క్షణమే చిత్ర విచిత్రం జీవితం
అలాగే చరిత్రలో నిలిచిపోయే ఆసక్తికర క్షణం
ఒకే ఒక్క క్షణంలో పుట్టిన ప్రేమ
యుగాలుగా అమరమై, అజరామరమై
ప్రేమ కావ్యాలుగా, సినిమాలుగా
మదిని దోచే మత్తైన మధుర క్షణాలుగా
ఒక్క క్షణంలో వెలిసిన మోహం, దాహం
ధన దాహం, ఈర్ష్య, పగలు, కక్షలు
వ్యక్తులు, రాజ్యాలు, రాజరికాలు, వ్యవస్థలు
యుద్ధాలతో కుప్ప కూలిన చరిత్రలనేకం
ఆదమరిచిన క్షణాల్లోనే ఉపద్రవాలు
క్షణాల్లో జరిగే ప్రమాదాలు, విషాదాలు
క్షణాల్లో పుట్టే వివాదాలు, వైపరీత్యాలు
క్షణభంగురమైన ఈ జీవితం ఒక ప్రత్యేకం!
