మంచిదోయి
మంచిదోయి
మాట్లాడే తీరువపై..పట్టుంటే మంచిదోయి..!
ఎంతైనా మౌననిధిగ..మనసుంటే మంచిదోయి..!
నీ తలపుకు కళ్ళెమొకటి..వేయ'లేరు మరి ఎవరో..
నిను కాచే నీ నోటికి..అదుపుంటే మంచిదోయి..!
సూచనలో సలహాలో..ఇవ్వడమది ఎందుకటా..
ఔచిత్యము పాటించే..పదునుంటే మంచిదోయి..!
ఎటు పోతోందీ ప్రపంచమను విచారమే వ్యర్థం..
సమరవాంఛ చల్లార్చే..చదువుంటే మంచిదోయి..!
ఎవ్వరినో ఉద్ధరించు..ప్రయత్నమే వెర్రితనం..
తీర్పులేవి చేయకుండు..నేర్పుంటే మంచిదోయి..!
సమన్వయం చేయగల్గు..సమర్థతను సాధించగ..
స్నేహాభిలాష పెంచే..ఓర్పుంటే మంచిదోయి..
