మార్గళి స్నానం
మార్గళి స్నానం
కలలెంత సుఖమైనవో తెలియదు
అవి నిజం కాకపోతే మాత్రం
వాటిని మోసే కనులకు ఎంత కష్టమో తెలుసునయ్యా
నా కలలో మెలకువలో ఉండే మెళకువలు నీకే తెలుసు
అందుకే నా కలలన్నీ కళలుగా మార్చి
కృష్ణా
నీకోసం వేచాను
ఈ పాశురములు రచియించాను
నీకై పాడి ఆడాను
సఖులతో కలిసి శ్రీ వ్రతము చేశాను
మంచు కురిసే ఈ శీతాకాలాన
తుషార బిందువులు కలిగిన పూలను ఏరి
నీకు మాలలుగా కట్టాము
ఉదయ భానుడి కిరణాల వెచ్చదనం తగలక మునుపే
నిద్రను దూరం చేసి
వేరు ఆలోచన లేకుండా
నీ మందిరము వైపు నడిచాము
తెల్లవారక మునుపే నిన్ను సేవించ వచ్చిన మమ్ము
గొల్ల కన్నియల (గోపికల) కరుణించినట్లు అనుగ్రహించు
నీ ప్రేమను వర్షము వలె కురిపించి
అందు మేము మార్గళి స్నానము చేసి తరించునట్లు చేయి
