కరోనా కాలం
కరోనా కాలం
ఒకప్పుడు ప్రపంచం అంటే
అందమైన పచ్చటి పొలాలు
ఆహ్లాదకరమైన ప్రకృతి
నిర్మలమైన ఆకాశం
నిర్మల మనసు గల మనుషులు
అవధుల్లేని నవ్వులు
హద్దుల్లేని ఆనందాలు
ప్రశాంతాన్నిచ్చే పక్షుల కిలకిలలు
పులకరించే పసినవ్వుల పలుకులు
ఇంతేనా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో...
మరి అటువంటి అందమైన ప్రకృతి ఇపుడు ఏది
అటువంటి అందమైన ఆనందాలు ఇపుడు ఏవి
అటువంటి నిర్మలమైన మనసులు గల మనుషులు ఇపుడు ఏరి
ఈ ప్రపంచం ఎందుకు ఇపుడు ఇలా ఉంది..
అసలు ఈ ప్రపంచం మారిపోవటానికి కారణం ఎవరు
అసలు ఈ కరోనాకు బాధ్యులు ఎవరు?
మనీషా? మృగమా?? ప్రకృతా???
మనిషి నిర్లక్ష్యమో లేక ప్రకృతి వైపరీత్యమోగానీ కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. అయినా, ప్రకృతిలో మార్పులు కలిగితే అందుకు కారణం మనిషే అవుతాడు కనుక ఆ కరోనా వైరస్ పుట్టుకకు కారణం కూడా ముమ్మాటికీ మనిషే. ఆ ఒక చిన్న వైరస్ యావత్తు ప్రపంచాన్నే వణికించింది. ఎంతోమందిని ఆసుపత్రి పాలు చేసింది. వంద కాదు వెయ్యి కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎందరో పొట్టకూటికోసం వలస వెళ్లిన వారు సొంత ఊరు రాలేక అక్కడే ఉండలేక నలిగిపోయారు. ఎంతోమంది ఉద్యోగాలు పోయి తిండిలేక ఇంట్లోనే ఉండిపోయారు. బయటికి వస్తే వైరస్ చంపేస్తుంది. ఇంట్లో ఉంటే తింటానికి తిండి లేక ఆకలి చంపేస్తుంది. అయినా కూడా చాలా మంది బ్రతికుంటే చాలు అన్నట్టుగా ఇంట్లోనే ఉండిపోయారు.
నిజం చెప్పాలంటే మనిషికి మనిషి విలువ తెలిసింది ఈ రోజుల్లోనే. మనిషి మానవత్వం బయిట పడింది కూడా ఈ సమయంలోనే. ఎక్కడో గుండె మూలల్లో ఉండిపోయిన ప్రేమలు, ఆప్యాయతలు, జాలి అనే భావాలు బయటికి వచ్చింది కూడా ఈ వైరస్ వల్లే. ఎందరో డాక్టర్లు కుటుంబాలకు దూరంగా ఉండి పగలనక రాత్రనక ఆసుపత్రిలో ఉండి కష్టపడి పనిచేసి చాలామంది ప్రాణాలు నిలబెట్టారు. మరెందరో సమాజం బాగుండాలని, ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా చేశారు. ఎంతోమంది తమకున్న దానిలోనే పేదలకు మరియు అవసరం ఉన్నవారికి సహాయపడ్డారు. ఎందరో మేమున్నాం అంటూ తోటివారికి ధైర్యానిచ్చారు. మరెందరో జీవితం అంటే తీరిక లేకుండా ఉద్యోగం చేయటం కాదు సొంతవారితో సమయం కేటాయించటం అని అదే నిజమైన జీవితం, అదే నిజమైన ఆనందమని తెలుసుకున్నారు. ఇలా ఒకటా రెండా, మనిషి అంటే ఏమిటో ఎలా ఉండాలో ఆ కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద గుణపాఠం చెప్పింది...
అయినప్పటికీ, ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది
ప్రాణం పోతేకాని మనిషికి మనిషి విలువ తెలీదా? తెలియలేదా??
మనిషీ ఓ మనిషీ...
మన చేతులే కనుక బాగుండి ఉంటే
ఈ చేతులు కడిగే అవసరమే వచ్చేది కాదు కదా
అదే విధంగా మన మనసే బాగుండి ఉంటే ఈ ముఖమును కప్పే అవసరమే వచ్చేది కాదు కదా
నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామని అనుకుంటున్నామా
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ఏమీ ఉపయోగం
స్వార్థము నిలువునా నిండి ప్రకృతి పాడు చేసుకుంటున్నామా
కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తూన్నామా
మనిషిని ప్రేమించి ఎంతో ఇష్టంగా దేవుడు సృష్టిని చేసాడు
మరి అంతే కాకుండా మనిషిని ఏలిక చేసాడు
కానీ,
మనసున గర్వించి మనిషి మార్పులు చేసాడు.. ప్రకృతి వికృతి చేసాడు..
చివరికి గాలిని కాలుష్యం చేసాడు
నీరును కాలుష్యం చేసాడు
భూమిని కాలుష్యం చేసాడు
చివరికి ఏమైంది??
తిండి కాలుష్యం చేసాడు
మందు కాలుష్యం చేసాడు
పొలము కాలుష్యం చేసాడు
ఫలము కాలుష్యం చేసాడు
ఆఖరికి మనిషి కాలుష్యం అయిపోయాడు
మనసు కాలుష్యం అయిపోయింది
చాలా ఆలస్యం అయిపోయింది
ప్రేమ చల్లారిపోయింది
బ్రతుకు పెడదారి పట్టింది.
మనిషి.. ఓ మనిషి
మన నడవడి బాగుండి ఉంటే ఈ విపత్తు వచ్చేది కాదు కదా
మన ఆశకు హద్దులు ఉండి ఉంటే ఇంట్లో బంధీలం అయ్యేవాళ్ళం కాదు కదా
ఒకచోట ధనమే దేవుడని డబ్బును కొలిచాడు
మరి ఇప్పుడు ప్రాణము కొనగలుగుతున్నాడా
మరోచోట ప్రపంచ వేదికపై తానే రాజును అన్నాడు చివరికి క్రిములకు భయపడుతున్నాడు
ఆస్తి ఎంతున్నా ఏమి లాభం ఉంది
కీర్తి ఎంతున్నా ఏమి ఉపయోగం ఉంది
పదవి ఏదైనా ఏమి ప్రయోజనం ఉంది
చివరికి మరణసమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది.
ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు
అనే తేడా లేకుండా వ్యాధి గర్వాన్ని అణిచింది
సాటి మనుషులకు సాయపడమంటూ దైవనియమాన్ని నేర్పింది
మనిషి..ఓ మనిషి ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్తు బాగుండదా?
మన తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా?
ప్రళయజలల్లో మునగక ముందే ఓడలు చేద్దామా
అగ్ని జ్వాలల్లో కాలకముందే ఆలోచిద్దామా
స్వార్థం కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా
ప్రకృతి ఒడిలో దైవం నీడలో ఆనందిద్దామా
అందుకే ఎప్పుడూ కూడా మన చేతలు బాగుండాలి..
మన హృదయం బాగుండాలి..
సాటి మనుషిని ప్రేమించాలి..
ఆ దైవం కరుణిచాలి...
