కాదిది వర్ణన... నాకిది వేదన!
కాదిది వర్ణన... నాకిది వేదన!


గలా పారు వంపుసొంపుల గంగమ్మా!
కిలకిలా పాడు మధుర మాధుర్య కోయిలమ్మా!
టకటకా శబ్దాలు కొలువుదీరిన అరణ్యమా!
గిరగిరా తిరుగు దివ్యమైన భూతలమా!
తమరిని వర్ణించ నేనెంత?
నా వయసెంత?
నిన్నగాక మొన్న మొలకెత్తిన
నా కలమెంత?
వర్ణనాతీతమగు వేదభూమిపై
నా కవితెంత?
కాదిది వర్ణన.
నాకిది వేదన.
మా పాపాలను కడిగే గంగమ్మా...
నికృష్టాల్ని నీలో కలిపేస్తే;
దోషాలతో నింపేస్తే;
నిన్ను కడిగేది ఎవరమ్మా?
మాకోసం గానమాడే కోయిలమ్మా...
మావల్లనే రోధిస్తే;
గిలగిల కొట్టుకు చస్తే;
నీకోసం పాడే నాదుడెవ్వరమ్మా?
మాకు ఊపిరి పోసే అరణ్యమా....
నీ పీకనే కోసేస్తే;
నిలువునా నరికేస్తే;
నీకూపిరి పోసే వృక్షమెవరమ్మా?
మమ్ము మోసే భూతలమా....
నీ గుండెనే తవ్వేస్తే;
జనతను అందు కుక్కేస్తే;
నిన్ను మోసేదెవరమ్మా?