జంతున్యాయము
జంతున్యాయము
:తేటగీతి పద్యములు.
----------------------------------------------------
పూర్వమెప్పుడో మృగముగా పుట్టినాడు
మెల్లమెల్లగా బుద్ధిని మెరుగుపరిచి
సంఘ జీవన మని తాను సాగుచుండి
పెరిగి వెలిగెనీ' మానిసి ' ప్రేమతోడ.
వాల మప్పుడు మాయమై బలముపెరిగె
జంతుతతినుండి దూరమై చదువునేర్చి
విలువ లెన్నియో బోధించి విబుధుడగుచు
మానవత్వము తోడ నా మనిషినడిచె.
జాతి సౌఖ్యము కోసము సంతసముగ
ప్రాణముల్ బలి యిచ్చెడి పౌరుడతడు
ధర్మపరుడైన నాటి యా దార్శనికుడు
కాన రాకుండె నిప్పుడీ కలియుగమున.
క్రోధ లోభముల్ మనిషిలో కొలువుచేయ
స్వార్ధమన్నది నిండిన మనసుతోడ
మనిషి జంతువై మారుచు మసలు చుండ
పూర్వ మున్నట్టి బుద్ధులే పుట్టుచుండు.
వాల మొక్కటి తక్కువై భయము గొలుపు
క్రూర మృగమైన మనిషి తాన్ గుఱ్ఱుమనుచు
బలము లేనట్టి వారిని బాధపెట్టి
జంతు న్యాయము చూపించి చంపుచుండె.
మాయమయినట్టి వాడమ్మ!మనిషి నేడు
బాగు పడకున్నచో మన భవితలేదు
మంచి మార్గము చూపెడి మాన్యులిపుడు
మార్చ వలయునీ మహిలోని మనిషి మనసు.//
---------------------------------------------------------
