ఈ దేహం
ఈ దేహం
జ్ఞాపకాల మధువు మెచ్చు..మనసు కదా ఈ దేహం..!
వేదించే ఆరాధన..ఫలము కదా..ఈ దేహం..!
నిను వేరుగ తలచుటచే..అర్చనలకు పాలుపడితి..
నాలో నిను చూడలేని..గుణము కదా ఈ దేహం..!
అనుమానపు కోవెలలో..వైరాగ్యపు దీపమేల..
మాయతెరల మట్టిప్రమిద..కొలువు కదా ఈ దేహం..!
తెలిసి మరచి మరులుగొనెడు..సంగతియే సంసారము..
కలల అడవి చిత్రాలకు..అరువు కదా ఈ దేహం..!
ప్రేమలోతు అందలేని..అంధత్వము తొలగుటెపుడు..
మంకుపట్టు కులపుమత్తు..తుక్కు కదా ఈ దేహం..!
ఎవరివెంట ఎవరి పరుగు..ఎందులకో మనసా..
చెలిమివిలువ తెలియలేని..మతము కదా ఈ దేహం..!
