దిక్కులు కలిసే చోట !
దిక్కులు కలిసే చోట !
ఏమైందో ఈరోజు , నీ గురించే నాలో తలపు .
చినుకులా వచ్చి మెరుపులా మాయమైపోయావ్ !
మళ్ళీమళ్ళీ ఎక్కడ చూసినా ,
ఊహల్లో స్వర్గలోకపు ఊర్వశిలా ఊరిస్తూ ,
కలలోనైతే ఓ కల్పనలా కవ్విస్తూ
నా మనసును ఇంకా ఇంకా ఆకర్షిస్తున్నావ్ !
గ్రహాంతరవాసివేమోననే
ఆసక్తినీ నాలో విశేషంగా రేకెత్తిస్తున్నావ్ !
ఎక్కడ ఉంటావో చెప్పవా ప్రియా !
ఎస్సెమ్మెస్సైనా క్లూ తెలిసేలా ఇవ్వవా ?
వివరంగా చాట్ చేస్తే వద్దంటానా ?
వీడియో కాలే నా గుండెను గంటలా తట్టేస్తే
మస్క్ కే మస్కా కొట్టేసి ,
రోదసీబండే ఎక్కేసి రయ్ రయ్యంటూ వచ్చేయనా ,
నీ ముందే ప్రత్యక్షం అయిపోనా !
తూరుపు దిక్కున గార్డెన్ లో
రంగురంగుల గులాబీలను పూయిస్తున్నావా ?
పడమరలో సంధ్యాకాంతులను తిలకిస్తూ ,
ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నావా !
లేక , దక్షిణాన చెన్నై నగరంలో
ఇడ్లీ సాంబారునే రుచి చూడాలని విచ్చేస్తున్నావా ?
అహహ్హ యనుచు ఉత్తరాది హిమనీనదాల్లో
జలకన్యవై నాబోటి యాత్రికులనే అలరిస్తున్నావా !
ఏమో ! ఏమేమో !
నాకైతే రంపపుకోతనే మిగులుస్తున్నావు !
కనుల ఎదుటకు రారమ్మన్నా
కిమ్మనక ఆరని మంటనే నాలో రగిలిస్తున్నావు !
పల్స్ రేటును అధికం చేసేస్తున్నావ్ !
బయలుదేరాలనే ఆతృతను అమాంతం పెంచేసి ,
అత్తకూతురిలా సమ్మోహన పరచేసి
నాలో నన్నే నెమ్మది నెమ్మదిగా తుంచేస్తున్నావ్ !
నాలో నిను ఎప్పటికీ దాసుడిలా దాచేయక ,
వచ్చేస్తున్నా ఆలస్యం ఇక చేయక !
దిక్కులు కలిసేచోటే తొలుతగా నిలుచుని
నా చూపుల చుక్కానీతో నలువైపులా చూసేస్తా !
నాలుగు నిమిషాల్లో నీ ఆచూకీ ఇట్టే పట్టేస్తా !
కొరియా భామే స్ట్రీమింగ్ చేస్తూ
ఆంధ్రా వచ్చిందా , నాతో పండుగలో విందు చేస్తోందా ,
సింహాసనంలోని తేనెకళ్ళ మందారమే ఏకంగా
మరల సినిమా షూటింగ్ జరుపుతోందా
మిల్కీ బోయ్కే పోటీ ఇచ్చేస్తోందా అనిపించేస్తా !
దిగ్గజ దర్శకులతో ఔరాయని పలికించేస్తా !
