వెన్నెల్లో తియ్యని బాధలు
వెన్నెల్లో తియ్యని బాధలు
అంతులేని నా మనసు ఆకాశంలో
ఊహలతో నీ రూపం రూపు దిద్దుకుంటున్నది
లోతైన నా హృదయం తెల్లగా పొంగి పొర్లుతున్నది
నీవో కొలంబస్ లాగా, వలపు వల వేసి లాగు....
నీ దోసిల్లలో నా చిరునవ్వులు దొరుకుతాయి
ఊహల ఆల్చిప్పలని అన్వేషించు
గులక రాళ్ళ రాగా సరిగమలని విను
నా ప్రేమ ముత్యాలు ,గుప్త భాగ్యరాసులు
రహస్య ప్రదేశాలలో అలరారుతున్నవి
మెత్తని ఇసుకలో నా ప్రేమను కొత్తగా ప్రకటీంచానుగా
ఉద్వేగంతో ఉబికివస్తున్న నీటి బుడగలను చూడు
రగులుతున్న కొరికల కుంపటి సెగల ఆవిర్లకు
వెన్నెల్లో నా తియ్యని
బాధలు నీకు తెలుస్తాయి
వేడిగా తన్నుకొస్తున్న ఊట చెలిమెని చూడు
ఎంత దాహంతో అల్లాడుతున్నానో నీకు తెలుస్తుంది
పిడికెడు హృదయంలో విరిసిన ఇంద్రధనస్సుని చూడు
నీపై ఎన్ని భావాల రంగుల పొంగులు
పులుముకున్నానో నీకూ కనపడతాయి
నీవో నదిలా నా జీవ మర్మపు సంద్రంలోకి ప్రవహించు
నాలో నీవు, నీలో నేను అంతర్వాహినిల సంగమిద్దాం
దాహంతో ఉన్న ఈ తనువు సముద్ర తపనను
పౌర్ణమి రేయి అలలతో ఆటుపోట్లను సృష్టిద్దాం
మదిని సౌఖ్యాలతో పరవసింప జేస్తూ
బాహ్య ప్రపంచన్నీ మరచిపోదాం.....