STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

రంగుల రాత్రిలో మా సంగమం

రంగుల రాత్రిలో మా సంగమం

1 min
443

నా నిశీధి నవ్వులకి పూసిన పువ్వులే 

ఆ మెరిసే నక్షత్రాలు .......

నా స్వేదబిందువులతో తడిసి ముద్దయినదే 

ఆ ఆకాశ పాలపుంత.....

నా కనుల కాంతికి వెలుగులతో కోక కట్టింది 

ఆ జాబిలి......

నా ఆశలకు రెక్కలు తొడిగేతే 

రాత్రి మిల మిల మెరిసేది ఆ మిణుగురులు

నా కోరికలకు రైకలు వేస్తే 

పగలు విరుల తోటలో విహరించేదే 

ఆ సీతాకోక చిలుకలు.....


తన స్వరాలకు నా నృత్య రూపమే ఆ మయూరి...

తన పల్లవిలను నేను స్వరపరిచిన గానమే 

ఆ కోయిల.....

తన మనసుతో నా దేహాన్ని కడిగితే 

పగలు పుట్టింది.......

నా కన్నులకు కాటుక అద్దితే 

చీకటి పులుముకుంది........

మబ్బుల దుప్పటిలో చక్కిలిగింతల్లోని 

చిన్ని చిన్ని సరసాల రూపమే 

ఆ ఉరుములు, మెరుపులు........

నా నడుము వంపుల మడతల అందమే 

ఆ ఏడూ రంగుల ఇంద్ర ధనస్సు......

ఎదలోతులో తెలియని వింత భావాలకు 

ఉచ్వాస, నిశ్వాసల ప్రకంపనాలే

ఆ సముద్రంలో ఎగిసిపడే అలలు ......


మా ప్రేమకోసం ఆవేదనతో రగిలే 

హృదయాల నివేదనే ఆ ఎండకాలం......

జ్వలించే ఆధరాలను జుర్రుకున్నప్పుడే 

జారిన బిందువే ఆ వర్షకాలం......

విరహ ముంగిళ్ళ కౌగిళ్లలో వెచ్చధనమే 

ఆ చలికాలం.....


ఆకాశం,భూమిని ముద్దాడాని అందం 

వ్యర్థమే కదా?

కాంక్షించే కన్నుల్లో జనించిన స్వప్నాలతో 

సొగసిరి పుడమిపైన పువ్వుల కోమలత్వాన్ని

మొగలి రేకుల పరిమళ్లాన్ని పులుముకొన్న 

ప్రియ సఖిని నేను!


రంగుల పూవ్వులతో రాత్రి మా సంగమం 

రంగు రంగుల సూర్యుడిని ఉదయింప జేసింది

రాత్రి అమృతం తాగి అమరులయ్యాము

ఇప్పుడు నా మనసు యుద్ధం......

చరణాలు లేని పల్లవిలతో ముగిసింది

తీవ్ర దుఃఖం లేని, తీరని వేదన లేని, 

తీరని కోరికలు తీర్చుకొని, 

అలను విసిరిన సముద్రమంత ప్రశాంతంగా ఉంది.... 

అందుకే......

మేమిద్దరం రెండు ఆకాశాలం, కాదు కాదు

మేమిద్దరం రెండు సముద్రాలం, కాదు కాదు

మేమిద్దరం రెండు ఆకాశం, సముద్రం 

ఒకటిగా కలిపేసిన నింగి అంచు, కాదు కాదు

మేమిద్దరం ఒకటే వేదన, దుఃఖం లేని, శూన్యం......





Rate this content
Log in

Similar telugu poem from Romance