అలా రంగుల కలలా !
అలా రంగుల కలలా !
నే చూసిన ఆమె ఓ కన్నెకాష్మీరం .
ఆ రాశిలో నేను పుట్టడమో , అది యాదృశ్చికమో
నన్ను చేరిన
చైత్రమాసపు సంధ్యాసమయ సమీరం .
ఉమ్మడిరాష్ట్రంలో ఎదిగి ఒదిగిన
ఇరవైనాలుగేళ్ళ తెలుగు బంగారం .
ఒక్కమాటలో చెప్పాలంటే ,
చూడగానే కనుబొమ్మలు ఎగరేయించే సింగారం .
అందంగా నడిచే అజంతా శిల్పమే .
తెరపై నటించే
తారక తానంటే ఆ పొగడ్త అల్పమే .
పిలుపు పిలుపులో
ఆ వధువు అధరాలలో కమ్మని మధువు .
లాలన పాలన వేళ
హృదయలోగిలిలో నిండురంగుల ఇంద్రధనువు .
ఏమైనా ,
స్వప్నం సాకారమైన అనుభూతి .
కాదు కాదు , ఏకంగా
అదో ఆనందభాష్పాలను తెచ్చే ఖ్యాతి .
నా ప్రశ్నకు ఇన్నాళ్ళకు ఆమెలో సరైన జవాబు .
గడచిన రోజులకు శుభఫలితమై
నా ముందు వెలిగింది అలా దీపావళి మతాబు .
నేనైపోయా అలనాటి ఆగ్రా నవాబు .
రాబోయేతరాల ప్రతిరూపం
మా ఇంట చిరునవ్వుతో అడుగిడగా ,
గుండెగోల ఈలవేసినట్లుగా !
సంభ్రమాశ్చర్యాలలో అందరు , చప్పట్లు మ్రోగగా !!
