ఓ మనసా ! నీకు తెలుసా !
ఓ మనసా ! నీకు తెలుసా !
ఓ మనసా ! నీకిది తెలుసా !
నన్నెవరో పిలిచారని ,
నేనాసంగతే తలుస్తూ , నిన్ను నేను మరచానని !
ఆ పిలుపులో మధువులే ఒలికాయని ,
ప్రియరాగాలే నా గుండెలో పలికాయని !
భూమిపై రంగులన్నీ
ఆమెలో తమను చూసుకున్నాయని ,
ఒక్కనిమిషం
సీతాకోకచిలుకలన్నీ ఆశ్చర్యచకితులై
తమలోతాము గుసగుసలాడాయని !
నవ్వులో గువ్వలు రివ్వున ఎగిరాయని ,
గవ్వలు గలగలా సవ్వడి చేశాయని !
తుమ్మెదలు ఝుమ్ ఝుమ్మని వాలాయని ,
' నేనెక్కడ నేనెక్కడ '
అని నిన్ను నేను ఆతృతగా అడిగానని !!
చెప్పవే మనసా ! నేనామెకు ముందే తెలుసా ?
నన్ను గెలవాలనే అలా చేసిందా !
నాతో జాబిలిలా ఆటలాడిందంటే ,
నీతో స్నేహం అంత విలువైందా !
నన్ను నీకందనివ్వక హాస్యమాడిందే !
మందహాసంతో ప్రేమపూలు కురిపించి
చలికాలంలో వేసవివేడినే నాలో పుట్టించిందే !!
