దాగని దుఃఖం
దాగని దుఃఖం
ముందు నుయ్యి వెనుక గొయ్యి
మధ్యతరగతి మనిషి బతుకు
ఆశల కొక్కాలకు ఊగుతూ
దాగిన దుఃఖపు బడబాగ్నిని
పంటిబిగువున నొక్కి పట్టి
మింగుడు పడని వాస్తవాలను
జీర్ణించుకోలేని లోకపు పోకడలను
గుండె కుహరంలో అదిమిపెట్టి
బరువైన బతుకును సాగదీస్తూ
రాజీ సమరంతో సాగిపోతాడు
ఆటుపోట్ల తాకిడికి అలవాటు పడి
గెలుపోటములను ఆలోచించక
పూటగడవని జీవితాన్ని
బాధ్యతల బంధనాలతో
సంతోషపు తలుపు చాటున
అందని ద్రాక్ష లకై చావని కోరికతో
రోజులు వెళ్ళదీస్తాడు