అంతరాష్ట్ర జీవశ్చవాలు
అంతరాష్ట్ర జీవశ్చవాలు
తల్లిదండ్రులు పంచిన అనురాగం తుంచి
పెనవేసుకున్న ప్రేమలను తెంచి
మమతలను ముంచి
రక్త సంబంధాలను ఆర్థికం చేసి
అంతరాత్మను ఆత్మహత్య చేసుకుని
బతుకుతున్న అంతరాష్ట్ర ఉద్యోగి!
నీ విజయాలు నిన్ను అవహేళన చేస్తున్నా వేళా
నీ డిగ్రీలు నీకు థర్డ్ డిగ్రీ లు ఇస్తున్న వేళా
నీ ఆర్ధిక గణంకాలు అంతర్గత సమస్యలయ్యే వేళా
నీవే ఒక గొప్ప నటుడువి
ఆస్కార్ అవార్డ్ పొందే గలిగే వారసుడువి
బయటికి కనపడేలా నవ్వు!......
లోపల గుండె ఆగిపోయేలా ఏడ్చు!.....
బంగారు భవిశ్యత్ కావాలని ఆశించావుగా
బాధ్యతగా ఉంటానని అమ్మానాన్నలకు
మాట ఇచ్చావుగా
తోడై ఉంటానని తోబుట్టువులకు చెప్పావుగా
నీడై నీతోనే అని మూడు ముళ్లు వేశావుగా
మూడు వేళల్లో ఈ ఆలోచనల వలయంలో
చిక్కుకున్న చిరు ఉద్యోగి!
అంతరాష్ట్ర బదిలీలు అంటే
ఆగిపోయిన ఫైల్ మాత్రమే కాదు
ఆగిపోయే గుండెలు,
ఛిద్రమైన కుటుంబాలు
చెదిరిన ప్రేమలు
కోల్పోయిన ఉనికి
దుప్పటి పరిచిన నిరాశ, నీస్పృహలు
ముదిరిన వైరాగ్యం
ముంచుకొస్తున్న మరణం
అందుకే ఈ అంతరాష్ట్ర ఉద్యోగులు
నవ్యాంధ్ర, తెలంగాణ లో
నడయాడే నూతన జీవచ్ఛవాలు.....
