M.V. SWAMY

Fantasy

4  

M.V. SWAMY

Fantasy

సకల లోకాల యాత్ర

సకల లోకాల యాత్ర

2 mins
434



     



     సోంబాబు చిట్టినాయుడుకి కథలన్నా, కలలన్నా చాలా ఇష్టం. రాత్రి నిద్రపోయేముందు అమ్మమ్మ మంచి మంచి కథలు చెబుతుంటే ఊ కొడుతూ నిద్రలోకి జారుకోవడం చిట్టినాయుడుకి అలవాటు. ఒకరోజు అమ్మమ్మ స్వర్గలోకం, చందమామ,చుక్కలు,వెన్నెల, సూర్యోదయం వింతలు విశేషాలుతో చిట్టి పొట్టి కథలను చక్కగా చెప్పింది.జోకొట్టి జోలపాట పాడింది చిట్టినాయుడుకి.


         చిట్టినాయుడు తెల తెలవారగానే హంసమీద కూర్చొని అన్ని లోకాలూ తిరిగాడు. ఇంద్రలోకం,చంద్రలోకం, గంధర్వకం, బ్రహ్మలోకం, వైకుంఠం,కైలాసం,నాగలోకం, చివరకు ఒక్కసారి చూసివెళ్దామని యమలోకం కూడా వెళ్ళాడు. ఎక్కడకు వెళ్లినా చిట్టినాయుడుని సరదా పలరించి, అతనితో చిట్టి పొట్టి ఆటలు,బుజ్జిబుజ్జి మాటలు ఆడి అతన్ని సరదా సందడిగా ఉంచారు దేవతలు. చిట్టినాయుడు సాహసించి సూర్యుడుని కూడా కలిసి అతనికి హాయ్ బాయ్ చెప్పి వచ్చాడు. "నీకు చూసే ఓపిక ఉండాలి, కోరిక, ఉత్సాహం వుండాలిగాని ఇంకా ఎన్నో లోకాలు వింతలు, విశేషాలు, అద్భుతాలు, చూపిస్తాను, ముల్లోకాలూ తిప్పి, కిన్నెర, కింపుర్స,మొదలుకొని సకల దేవతలనూ నీకు పరిచయం చేస్తాను, ఇక్కడ బడి, గుడి, మడి, ఇంటిపని, చదువు, సంధ్యలు ఉండవు. హాయిగా కాలం గడిపేయవచ్చు.దేవతలు ఇచ్చే అమృతం త్రాగి కలకాలం నిశ్చింతగా బ్రతికేయవచ్చు, చావు అన్నది ఉండదు, నిత్యం నువ్వు కోరుకునే రూపంలోనే నువ్వు ఉండవచ్చు" అని చెప్పింది హంస. సాయింత్రం అయ్యింది, నక్షత్ర లోకంలో చంద్రుడుని దగ్గరగా చూసి వెన్నెల వెలుగులు చూసాడు చిట్టినాయుడు,ఆ రోజంతా సంతోషంగా గడిపేసాడు.పొద్దు పోయింది. బాగా చీకటయ్యింది.


       అమ్మ , నాన్న, చెల్లి, అమ్మమ్మ, నాన్నమ్మ తాతయ్యలు గుర్తుకొచ్చారు. బడిలో మేరీ టీచర్, బేగం టీచర్, రాము మాస్టర్ గుర్తుకొచ్చారు. మిత్రులు అచ్చిగాడు, బుచ్చిగాడు, అమ్మలు, అమృత గుర్తుకొచ్చారు.మామయ్యతో పాటలు, బాబాయితో మాటలు గుర్తుకొచ్చాయి. ఇంటిలో పిల్లి కూన వీధిలో ఆవుదూడ. పెరటిలో ఉడతపిల్ల, చెట్టు మీద పిల్ల పిచ్చుక ఇలా అన్నీ గుర్తుకొచ్చి, వెంటనే హంసకు ముందుకు పోయి,"నాకు అమ్మ కావాలి , నేను ఇంటికెళ్లాలి"అని ఏడ్చేశాడు చిట్టినాయుడు."అమ్మ ఇక్కడ ఉండదు,నీకు ఈలోకాల్లో వినోదాలూ, విహారాలూ, విశ్రాంతులూ కావాలా!? లేక అమ్మ కావాలా!?"అని ఆడిగింది హంస. "నాకు అమ్మ కావాలి, నాకు నా కుటుంబం, మిత్రులు, బంధువులు, టీచర్లు కావాలి, నాకు ఈలోకాలూ, వింతలు, వినోదాలు, విశ్రాంతులు వద్దు"అని గట్టిగా అరిచాడు చిట్టినాయుడు. హంస" తదాస్తు "ఆని మాయమయ్యింది. చిట్టినాయుడు కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మ ఎదురుగా నవ్వుతూ కనిపించింది.చిట్టినాయుడు అమ్మను అమాంతం కౌగలించుకొని గట్టిగా పట్టుకున్నాడు.వాడు హంస వాహనం ఎక్కి చూసిన వింతలు, విశేషాలూ చెప్పి "అమ్మా ఆ లోకాల్లో నువ్వు కనిపించలేదు అందుకే భయమేసింది"అని అన్నాడు. "అమ్మమ్మ చెప్పినచందమామ కథలు విన్నావు కదా అందుకే నీకు వింత వింత లోకాల కలలు వచ్చి ఉంటాయి, భయం లేదు, నేను ఇక్కడ ఎప్పుడూ నీతోనే ఉంటాను"అని బుజ్జగించింది, చిట్టినాయుడు కలను మర్చిపోయి బుద్దిగా బడికి వెళ్ళడానికి సిద్ధం అయిపోయాడు.



            ........ఆజాద్ (కలం పేరు)









Rate this content
Log in

Similar telugu story from Fantasy