VENKATALAKSHMI N

Comedy Action Others

3.6  

VENKATALAKSHMI N

Comedy Action Others

మౌనమేలనోయి..

మౌనమేలనోయి..

4 mins
376


రేయ్! లక్ష్మణ్ .. లక్ష్మణ్... నిన్నే రా బాబూ! ఇటు ఇటు..నీ ఎడమ వైపు తిరిగి తిన్నగా చూడరా.. మామా కనిపించానా ,చెయ్యెత్తి వున్నా చూడు రా..అరే నీ యంకమ్మ కదలకుండా అక్కడే నిలబడురా,నేనే వస్తున్నా నీ దగ్గరకు అంటూ హడావుడిగా జనం మధ్య నుండి పద్మవ్యూహం లోంచి అభిమన్యుడు దూసుకొస్తున్నట్టు వచ్చాడు శివ.

   అరే మామా అంటూ ఆలింగనం తో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు లక్ష్మణ్.నువ్వేంట్రా ఇక్కడ అంటూ శివ భుజం మీద చెయ్యి వేసాడు లక్ష్మణ్.ఆ ప్రశ్న నాదిరా మామ,మా ఊరికొచ్చి నన్నే ఇక్కడేంటని అడుగుతున్నావా?అసలిన్నాళ్ళు ఎక్కడున్నావు,ఏం చేస్తున్నావు, ఎవరికీ దొరకకుండా ఎక్కడ దాగుతున్నావు రా వెధవా! అంటూ తిట్ల దండకం చదివాడు శివ.

  అయ్యో, నాకెలా తెలుస్తుంది రా నువ్విక్కడున్నావని.మనవాళ్ళు ఎక్కెడెక్కడ వున్నారో నీకు తెలుసా మామ.అసలు విషయం మరచేపోయానురా, ఇదుగో నా భార్య మీనా అంటూ పరిచయం చేశాడు లక్ష్మణ్.

   మీనా అంటే మన క్లాస్ మేట్ మీనాక్షి కదూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శివ.

  హా...మరే ఆ మీనాక్షే మామ.

 మొత్తానికి నువ్వొక్కడివే అనుకున్న విధంగా క్లాస్ మేట్ ను చేసుకుని హీరో అయ్యావురా.నీ ప్రేమ అజరామరం మామా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు శివ.

   ఏదోలేరా అలా జరిగి పోయిందంతే.తలరాతను తప్పించుకోలేక పోయాను మరి అంటూ మీనాక్షి వైపు చూస్తూ నాలుక కరిచాడు, మీనాక్షి ని ఉడికించడానికి.

   ఒక్క చూపు చూసింది లక్ష్మణ్ ను ,అది గమనించిన శివ అబ్బో మీనాక్షి కి కోపం కూడా వస్తుందా అన్నాడు.

  ఏం శివ నేనూ మనిషినే కదా,సరే కానీ మనవాళ్ళందరూ ఎలా వున్నారంటూ అడుగుతుండగా శివ అందుకుని ఇక్కడే అన్నీ మాట్లాడేస్తారా? పదండి మా ఇంటికి అంటూ శివ కారు దగ్గరికి తీసుకెళ్ళి డోరు తీస్తూ ఎక్కండి హీరో గారూ అన్నాడు లక్ష్మణ్ ను ఉద్దేశించి.నవ్వుకుంటూ ముగ్గురు కారు ఎక్కి వెళ్ళారు శివ ఇంటికి.

   శివ భార్య ఎదురొచ్చి ఆహ్వానించింది.శివ ఫోన్ చేసి చెప్పాడని మీనాక్షి వాళ్ళకు అర్థమయింది.ఇల్లంతా చూపిస్తూ,మర్యాదలన్నీ అయ్యాక సరదాగా కబుర్లు చెప్పుకోవడానికని తోటలోకి వెళ్ళారు.నాలుగు కుర్చీలు మధ్యలో టీపాయ్ మీద రోజ్ ప్లాంట్ ఆహ్లాద వాతావరణం ను కలిగిస్తుంది.మాటల్లో శివ భార్య లాస్య కు లక్ష్మణ్ హీరోయిజం గురించి చెబుతూ ఇరువురి ప్రేమ కహాని గురించి చెబుతూ వుంటే మీనాక్షి తల వంచుకుని ముసి ముసి నవ్వులు రువ్వుతోంది.మొత్తానికి ప్రేమలో నిజాయితీ చాటి మీనాక్షి ని సొంతం చేసుకున్న లక్ష్మణ్ అన్నయ్యా మీరు నిజంగా నే హీరో అంటూ కితాబు ఇచ్చింది లాస్య.

    ఆ మాటకొస్తే శివ కూడా హీరోనే లెండి లాస్య గారు అంటూ మాట కలిపింది మీనాక్షి.

   అయ్యో! నేనేం చేశానని నన్ను హీరోను చేశావు మీనా.నేనేదో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా కామ్ గా వుండే వాణ్ణి కదా! ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శివ.

  అదేమలా అంటావు శివ.హాస్టల్లో నువు చేసిన మంచి పనికి నిన్ను హీరోను చేశారందరూ మా లేడీస్ , తెలుసా! చెప్పింది మీనాక్షి.

  నేనా?అంటూ తలగోక్కుంటూ శివ,మంచి పనా ,అదేంటబ్బా?నాకే గుర్తు లేని ఆ మంచి పని అంటూ ఆలోచనలో పడ్డాడు శివ.

   అదేంటి?అంత మంచి పని చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావంటే నువు నిజంగా హీరోవే శివా అంటూ పొగిడింది మీనాక్షి.

   ఒట్టు ,నిజంగా నిజమే చెబుతున్నా నేను.అంత మంచి పనులు చేయడం నా వల్ల కాదు.వుంటే కామ్ గా వుంటానంతే.ఒకవేళ నిజంగా చేసుంటే మాత్రం తప్పకుండా నా జీవిత పుస్తక ముఖచిత్రంగా గుర్తుండిపోతుంది.పైగా లాస్య కు చెప్పకుండా వుండలేను కూడా.ఏం లాస్య నీకేమైనా గుర్తుందా నే చేసిన అలాంటి గొప్ప ఘనకార్యం అంటూ నాలుక కరిచాడు శివ.

  నటించింది చాలులే శివ ఇంక.చేసిన మంచి పనులు చెప్పుకుంటే ఫలితముండదని కదా చెప్పట్లేదు తమరు.సరే నేనే చెబుతాను.వినండి అంటూ చెప్పడం మొదలు పెట్టింది మీనాక్షి.

   అవి హాస్టల్లో గడుపుతున్న గడ్డు రోజులు.ఆర్థికపరిస్థితి బాలేదని హాస్టల్లో టిఫిన్స్ పెట్టకుండా మూడు పూటలా భోజనమే పెట్టేవారు.అలాంటి సమయంలో మీ ఫ్రెండ్ అదే రూం మేట్ రంగ కు కడుపు నొప్పి వచ్చింది.రోజూ మూడు పూటలా లావుపాటి బియ్యం తో వండిన అన్నం తిని అరగక ఆరోగ్యం దెబ్బతినిందన్న విషయమైనా గుర్తు వుందా శివా నీకు ప్రశ్నించింది. 

   అవునా? మూడు పూటలా భోజనం సంగతి గుర్తు వుంది కానీ రంగ విషయమే కాస్త అనుమానం గా వుంది.ఏరా మామ నీకేమైనా గుర్తుందా ఈ విషయం తల తిప్పి అడిగాడు లక్ష్మణ్ ను శివ.

   అదేరా నేనూ ఇందాకటి నుండి చించుతున్నాను , కానీ తోచట్లేదు సమాధానమిచ్చాడు లక్ష్మణ్.

   హా...అంతే కదా !నావల్ల కాదు కానీ మీనా నువ్వు అసలు విషయం చెప్పలేదనుకో ఇప్పుడే ఈ క్షణమే నా బుర్ర బద్దలై పోతుంది.ప్లీజ్ త్వరగా చెప్పమ్మా చెల్లెమ్మా అంటూ బతిమాలుకున్నాడు శివ మీనాక్షి ని.

   అయ్యెయ్యో !ఇదేం చిత్రం శివా?సరే సరే నేనే చెప్పేస్తాను.అదే రంగకు బాలేదని నువ్వు ఓ పేపర్ పట్టుకుని మా లేడీస్ హాస్టల్ కు వచ్చావే.అదైనా గూర్తుందా సర్ తమరికి వెటకారంగా పలికింది మీనాక్షి.

   ఆ....ఆ... ఎస్ ఎస్.. ఇప్పుడిప్పుడే లీలగా గుర్తొస్తుంది మీనా.చెప్పు చెప్పు,ఆ తర్వాత...అంటు ఆపేశాడు.

  దేవుడా... ఇదెక్కడి చోద్యం.చెప్పక చేస్తానా?అందులో ఆ తెల్ల పేపర్ లో రంగకు 

బాలేదని తోచినంత సహాయం చేయమంటూ ఆ పేపర్ కథాకమీషు.ఆల్రెడీగా బాయ్స్ హాస్టల్లో వసూలు చేసినట్టు, మొత్తం 2000 చిల్లర పోగయినట్టు అందులో వుందని చెబుతూ వుంటే మధ్యలో పగలబడి నవ్వుతున్న ఇద్దరు మిత్రులను చూసి లాస్య మీనాక్షి లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

   హ్హ..హ్హహ్హ.....కానీ కానీ... తర్వాత...అంటూ వ్యంగ్యంగా అనేసరికి మీనాక్షి కి చిర్రెత్తుకొచ్చింది.ఎందుకలా నవ్వుతున్నారో అర్థం కాక విచిత్రంగా తోచింది.మిగిలింది మమ్మల్ని చెప్పమంటావా మీనాక్షీ కూడబలికారు మిత్రులు.

  అంటే మీకు గుర్తుందన్నమాట, ఇంతసేపు తెలీనట్టు నటించడం దేనికో మరి? కోపంగా అడిగింది మీనాక్షీ.

  హా...అంత మంచి పని మేమేందుకు మర్చిపోతాం ముక్తకంఠంతో పలికారు ఇద్దరూ.

  మరింతసేపు తెలీదు తెలీదు అని, ఇప్పుడేమో అదా అంటూ దీర్ఘం తీస్తున్నారే అని గట్టిగా అరిచేసరికి శాంతి శాంతి!అంటూ శివ,ఆ మంచి పని గురించి చెబితే నువ్వింకెంత కోపం తెచ్చుకుంటావోనని తలుచుకుంటే భయం వేస్తుంది మీనా.

  భయమా!ఓం వైపు మంచి పనంటూనే మరో వైపు భయమంటున్నారే.ఇదేదో గూడు పుఠాణిలా వుంది.మర్యాదగా చెప్తారా లేక అని గుడ్లురుమి చూసేసరికి లక్ష్మణ్ అందుకున్నాడు.చెప్పాక ఫీలవడాలు,మామీద రాళ్ళు రువ్వడాలూ గట్రా చేయకూడదంటేనే చెబుతాం.

  ఆ సరే సరే.. ముందు చెప్పండి, తర్వాత ఏం విసరాలో ఏం విసరకూడదో మేం చెబుతాం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది మీనాక్షీ.

  అమ్మో!ఎంత కోపం? రేయ్ మామా జాగ్రత్తరా.ఆనక నీ ఇష్టం.నువ్వే చెప్పవోయ్,నావల్ల కాదబ్బ తప్పుకున్నాడు లక్ష్మణ్.నావల్ల కాదంటూ చేతులెత్తేశాడు శివ.

  మీ యవ్వారం చూస్తుంటే చాలానే వున్నట్టుందే.మర్యాదగా నాన్చ కుండా విషయం చెబుతారా సరేసరి కుర్చీ ఎత్తేసరికి శివ చెబుతా చెబుతా అమ్మవారి అవతారం చాలిస్తే చెప్పేస్తా అన్నాడు.

   ఓకే...ఓకే..అంది మీనాక్షీ.

  మరీ...ఆ రోజు..ఆ పేపర్ కథ నమ్మి మీరు కూడా డబ్బు వసూలు చేశారు కదా,ఎంతగనో గుర్తుందా అమ్మోరు తల్లీ.

  ఆ..బాగా... సుమారుగా 3వేల చిల్లర.ఆడవాళ్ళం కదా,పైగా జాలి గుణం.పోటి పడి మరీ ఇచ్చాం అంది మీనాక్షీ.

   కదా! మొత్తం 5వేల చిల్లర.ఆ డబ్బు తో మేము....మేమూ....ఊ...ఊ...

  ఏంటి మళ్ళీ..ఊ ఊ అంటూ పాటనా గర్జించింది మీనాక్షి.

 ఆగు..ఆగు...అక్కడికే వస్తున్నా.ఆ డబ్బు వసూలు చేసింది రంగ కోసం కాదు.

  మరీ...

  మా కోసమే..

మీకోసమా.. ఎందుకు...?

మరే...మరే.... పార్టీ కి గబుక్కున పలికి తల తిప్పి వీపు చూపుతూ నిలబడ్డారు.వీపు విమానం మోతవుతుందేమోనని.

  హమ్మో..ఎంత మోసం.. అన్యాయం.. పార్టీ కి డబ్బులు లేవని..ఇలా ఉపాయం పన్నారన్నమాట.వామ్మో !కాలాంతకులు మీరు.మిమ్మల్నీ...హ్యాండ్ బ్యాగ్ తో కొట్టబోయింది.పరుగందుకూన్నారిద్దరూ.

  అమ్మా! అమ్మోరు తల్లీ!ఆ సమయానికి అలా తోచింది .అంతే.ఆ వయసు లో అలానే ఐడియాలు వస్తాయమ్మా.అర్థం చేసుకుని మన్నించవా తల్లి.

 సరిపోయారిద్దరూ..ఎంత తెలివి.దేశముదుర్లు...సరదాగా చిలిపి గా అనిపించి మీనాక్షి కూడా తాను తమతో పాటే తన ఫ్రెండ్స్ కూడా మోసపోయిన తీరును ,ఎలా ఫూల్ అయ్యారో తల్చుకుని పకపక నవ్వింది.


Rate this content
Log in

Similar telugu story from Comedy