VENKATALAKSHMI N

Tragedy Action Others

4.3  

VENKATALAKSHMI N

Tragedy Action Others

పరివర్తన

పరివర్తన

6 mins
639


ప్లాట్ ఫాం అంతా సందడిగా వుంది.జనమంతా ఎవరికీ ఎవరూ పట్టనట్టు వారివారి పనుల్లో ఆత్రంగా కొందరు,హడావుడిగా కొందరు , ప్రేమికుల కోసం ఎదురుచూస్తున్నట్టుగా కొందరు,ఏమీ తోచనట్టుగా కొందరు ...ఇలా నాలుగు దిక్కులు కోలాహలంగా సాగుతున్నాయి.

ఇంతలో కొబ్బరి బూరను ఊదుతూ పరుగులు పెడుతున్న పిల్లాడి జోరులా కూత పెడుతూ వచ్చింది పొడవాటి పొగబండి.సందడిగా వున్న ప్లాట్ ఫాం ఒక్కసారిగా మూకుమ్మడిగా రైలు గోడలకు అతుక్కుపోయారు.బోగీలను మార్చి మార్చి చూస్తున్నారు.పదిహేను నిమిషాల్లో ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కేసి తక్కినవాళ్ళు మళ్ళీ తమ కాళ్ళకు ,కళ్ళకు పని పెట్టారు మరో కూత కోసం.ఆ కాసేపు సునామీ వచ్చి ఆగిపోయిన పనయ్యిందనుకుంటూ తన సీట్లో కూర్చున్నాడు మురళి.నీళ్ళ బాటిల్ తీసి గొంతు తడుపుకున్నాడు.ఎదురుచూపులతో విసిగివేసారిన మనసు కాస్త కుదుట పడి అలసట తీర్చుకున్నట్టనిపించింది మురళికి.

గమ్యస్థానానికి చేర్చాలన్న ఆత్రంతో పట్టాలపై వేగంగా పరుగులు పెడుతున్న రైలును చూసి తన మనసు కూడా రైలు కంటే వేగంగా సొంతూరికి చేరాలన్న తపన గుర్తొచ్చి తనలో తనే నవ్వుకున్నాడు.ఎదురుగా ఐస్ క్రీం కోసం మారాం చేస్తున్న పిల్లాడిని చూసి తన జ్ఞాపకాల పూతోటలోకి విహరించసాగింది మనసు.

******************

అదొక ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిన చిన్న ఊరు.అందమైన బంధాలను పెనవేసుకున్న ఆనందాల పొదరిల్లు.బంధువులు కాకపోయినా వరసలు కలుపుకుంటూ కలుపుగోలుగా కలిగివుండే మనసున్న హరివిల్లు.నేలమ్మను నమ్ముకుని బతికే మట్టిమనుషులున్న ఊరు.తొలకరికి పులకించి వెదజల్లిన మట్టివాసనంత స్వచ్ఛమైన మనసు గలోళ్ళున్న ఊరు.కాని ఒక్క దొర అని పిలిచే భూస్వామి మాత్రం ఆ ఊళ్ళో గంజాయి మొక్కలా బలంగా పాతుకుపోయాడు.అసలే దాదాపు అందరూ నిరక్ష్యరాసులే.దొర చెప్పినంత చేసినంత అన్న చందాన సాగేది ఆ ఊరు.దొర మాటకు ఎదురుపోతే నిలువ నీడ లేకుండా చేసే నీచమైనోడని తెలిసి ఎవ్వరూ మారు మాటాడే ధైర్యం చేసేవారు కారు.కాకపోతే అవసరానికి కాదనకుండా లేదనకుండా అప్పులిచ్చి ఆదుకుంటాడని అతని జోలికి వెళ్ళరు.ఆ ఊరికంతా ధనమున్న గొప్పోడు మరి.

ఆ ఊరిలో ప్రాథమిక పాఠశాల వుంది.రాఘవయ్య మాష్టారొక్కడే రారాజులా నడిపేవాడు.మరో మాష్టారు కోసం నానా తంటాలు పడ్డాడు.కాని దొర దెబ్బకు వచ్చిన అదనపు పోస్టు వచ్చినట్టే వెనక్కి పోయేది.పిల్లలొస్తేగా బడికి.ఇంటింటికి తిరిగి వేడుకున్నా పట్టుమని పది మంది కూడా వచ్చేవారు కాదు బడికి.ఆ పది మందిలో నేనూ ఒక్కణ్ణి .మాష్టారి కష్టం చూసిన దొర "బతకలేక బడి పంతులయ్యావు.ఊళ్ళో వుండాలని లేదా"కన్నెర్ర జేసే సరికి దొరికినోడికి దొరికినంత అన్నట్టు వచ్చిన పది మందికే తన అనుభవాలసారాన్నంతా జోడించి పాఠాలు చెప్పేవాడు.ఏకసంథాగ్రాహిలా అన్నీ అప్పజెప్పే వాడినని నన్ను ఎప్పుడూ మెచ్చుకునేవాడు.రకరకాల కథల పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి లోకజ్ఞానం బోధించిన రాఘవయ్య మాష్టారుని మరచిపోవడం అంత సులభం కాదనిపించింది నాకు.ఐదో తరగతి వరకే చదివి ఆ తరువాత చదవడానికి బడి లేక,మైళ్ళ దూరం నడిచి పక్కూరికి పోయి చదివించే స్థోమత లేక పొలం పనులకు వెళ్ళక తప్పేది కాదు అందరికీ.వెళ్తామన్నా దొర అడ్డుకునే సరికి చదువుకోవాలన్న ఆశను చంపుకునేవాళ్ళం.

నా అదృష్టమో లేక విధిరాతనో తెలీదు కానీ నేను మాత్రం పైచదువులకు పట్నం వచ్చాను.అయితే దొరకు తెలీదు చదువుకోసమే పట్నం పోయిన సంగతి.ఒక్క పురుగు కూడా ఊరు దాటి పోరాదు దొర అనుమతి లేకుండా.చీమ చిటుక్కుమన్న తెలిసేది దొరకు.మరి నన్నొదులుతాడా.దొరింటి నుండి పిలుపొచ్చింది మా అయ్యకు.అంతే క్షణాల్లో నేను అయ్య చేతులు కట్టుకుని మరీ హాజరయ్యాం దొర ఎదురుగా.

ఏం బలిసినాదా?దొరున్న సంగతి మరసినారా?ఎవర్నడిగి ఊరు దాటించాలనుకున్నావు పాలేగా.చేసిన అప్పు ఎగ్గొడదామనా?ఎవడు గట్టాలనుకున్నార్రా మీ అప్పు?ఐదో తరగతి చదివేసరికి ఐ ఏ ఎస్సు అయిపోయిందనుకున్నార్రా?నా కన్నుగప్పి నీ కొడుకుని,మెల్లిగా నీవు ను కుటుంబమంతా ఊరు దాటాలనా?బతకాలని వుంటే వుండండి.లేదంటే తెలుసు కదా నా సంగతి.నీయా...పళ్ళు నూరేసరికి బెదిరిపోయినా మాఅయ్య కూసంత ధైర్యం కూడబెట్టుకుని తలెత్తాడు నెమ్మదిగా.

ఎంత మాట దొర.నీ సంగతి తెల్వదా ఏం మాకు.నేనెప్పుడన్నా నీ మాట మీరినానా దొరా.మాష్టారి దూరపు బంధువు ఒకాయనకి పనికి కుదిరిచ్చినాను మురళిగాడిని.నీ అప్పు తీర్సనీకి నాకు సాయమైనట్టుంటాదని మాష్టారు మాట కాదనలేక ఒప్పేసుకున్నా దొర..అబద్ధాన్ని అన్నం నమిలినంత తేలికగా చెప్పేశాడు మా అయ్య.అంతే ఏడుపందుకున్నానింక మా అయ్య కాళ్ళను చుట్టుకుని.చదువుకు కాదని తెలిసేసరికి.

అంతా విన్న దొర మాష్టారిని పిలిపించి సంగతి ఆరా తీశాడు.సూక్ష్మం గ్రహించిన మాష్టారు అవునని తలూపాడు.కాస్తోకూస్తో మాష్టారి మీద నమ్మకం దొరకు.సరే పోండింక.సదువుగిదువు అన్నారో తెలుసు కదా నా సంగతి కొడకల్లారా సావండింక గదమాయించేసరికి అరక్షణంలో మాయమయ్యామక్కడి నుండి.

మరుసటి రోజు నన్ను తీసుకెళ్ళడానికి ఓ మనిషొచ్చాడు పట్నం నుండి.మాష్టారు ఆ మనిషితో ఏదో మాట్లాడ్డం నేను గమనించాను.మాష్టారు మనిషని అర్థమయింది నాకు.మాఅయ్య అమ్మలు నాకు జాగ్రత్తలు చెప్పొచ్చారు.మా పరిమళక్క నన్ను గట్టిగ పట్టుకుంది విడువకుండా.ఆ పెద్దోళ్ళు సెప్పినట్టు నడుసుకో బిడ్డా ,మారుమాట్లాడగాకు అంటూ బస్సెక్కించారు తడిసిన గుండెతో.

పట్నంలో నన్ను ఓ హాస్టల్ లో చేర్చాకనే నాకు నిజం తెలిసింది.నన్ను పనికి కాదు చదువు కోసమే పట్నం పంపారని.ఇదంతా మాష్టారు మాయ అని తెలిసి మనసులోనే గుడి కట్టి దేవుడిలా మాష్టారు ప్రతిమను నిలుపుకున్నాను.ఇక నా చదువంతా నిరాటంకంగా మాష్టారి దయ వల్ల సాగాపోతూ వుంది.అలా పదిహేనేళ్ళు గడిచాయి.నాకు మంచి కొలువు కూడా వచ్చింది.జీతం మరీ ఎక్కువ కాదు,తక్కువ కాదు.ఏదో నా ఖర్చులకు సరిపోయేలా కుదిరింది.ఇంటిక్కూడా అప్పుడప్పుడు మాష్టారి మనిషితో తోచిన సాయమందించేవాడిని.అలా హాయిగా సాగుతున్న నా జీవితంలో అనుకోకుండా అందిన కబురు "వెంటనే ఊరికి రమ్మని".ఏమయిందో ఎందుకు రమ్మన్నారో అయోమయంలో ఇదుగో ఇలా బయలు దేరాను రైలులో.

**********************

ఉన్నట్టుండి వినబడిన రణగొణధ్వనులకు ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చి చూడగా దిగవలసిన గమ్యం వచ్చిందనీ అర్థమయింది.గట్టిగా ఓ నిట్టూర్పు.లగేజీతో దిగి నడక సాగించాడు బస్టాండుకు.తన ఊరికి వూన్న ఒక్కగానొక్క పల్లె బస్సు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు.తనవారు ఎలా వున్నారో,తనను గుర్తు పడతారో లేదోనని,చూశాక వాళ్ళ స్పందనెలా వుంటుందోనని పరిపరివిధాలుగా పరితపిస్తున్న మది ఆలోచనలకు బస్సు హారన్ మోతతో బ్రేక్ వేశాడు.బస్సు డ్రైవరు ను చూసి సంతోషం ఆపుకోలేక బాగున్నావా అన్నా అంటూ మాట కలిపాడు మురళి.

ఎవరు బాబు నీవు?ఊరికి కొత్తా?నిన్నెప్పుడూ చూసినట్టు లేదే?ఎవరి తాలూకు?యక్ష ప్రశ్నలు వేశాడు డ్రైవరన్న.

అన్నా!నేను చిన్నప్పుడు ఈ ఊరొదిలి వెళ్ళిన మురళిని.అదే ఎల్లన్న కొడుకుని.నీవు గుర్తు పట్టలేక పోయినా నాకు నీవు గుర్తున్నావన్నా.ఇంకా రిటైర్ కాలేదన్నా నువ్వు.

ఏమో బాబూ.మాట్లాడించివు అంతే చాలు.ఈ ఏడింకా నా సర్వీస్ అయిపోతాది నాయనా.ఈ ఊరికి నాకి ఋణం తీరిపోతాది.నా సొంతూరి మల్లే నన్ను చూసుకుంది ఈ ఊరు.పేరుకు పల్లె అయినా పేమకు పట్నమంత విశాలమైన మనసున్న ఊరిది.ఇదుగో నీలక్కే అందరూ మనసునిండా పలకరిస్తా వుంటారు నన్ను.మనిషికి ఇంతకంటే ఏం కావాలయ్యా?సచ్చేముందు ఆ నలుగురిని సంపాదించుకుంటే సాలు అంటుండగానే ఊరొచ్చింది.

తను నడిచిన నేల మీద అడుగిడిన వెంటనే పిల్ల గాలులు సన్నాయి రాగంతో స్వాగతం పలికినట్టు పులకించిపోయాడు.తన ఆకలిని తీర్చిన ఆ మట్టి వాసన సోకగానే తనువెల్ల తన్మయత్వం పొందాడు.అణువంతైనా మార్పు లేని ఆ ఊరి పరిసరాలను చూసుకుంటూ ఇంటికి నడక సాగించాడు మురళి.

చాలా రోజుల తరువాత చూస్తున్న తను గడిపిన ఇల్లు నిశ్శబ్ధంగా ,జనసంచారం లేని అడవిలా అగుపడింది మురళికి.మనసేదో కీడును శంకించింది .నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ లోపలికి అడుగుపెట్టాడు.చీకటిమయమైన ఆ గదిలో ఓ పక్కగా మంచంపైన అయ్య,తలపట్టుకుని ఓ గోడను ఆసరాగా కూర్చున్న అమ్మ కనిపించారు.ఎండిన కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వారి ముఖాలలో.తను వచ్చి నిలబడినా గమనించనంత పరధ్యానంలో మునిగి వున్నారని అర్థమయింది తనకి.ఇన్నేళ్ళ తరువాత వచ్చిన తనకి ఊహించని ఈ పరిణామానికి నిశ్చేష్ఠుడై నిలబడిపోయాడు.ఏం మాట్లాడాలో ,ఎలా మొదలు పెట్టాలో తోచక శిలా ప్రతిమలా వుండిపోయాడు.అప్పుడు వున్నట్టుండి తన కళ్ళు ఇల్లంతా పరికించసాగాయి దేనికోసమో అన్నట్టు.తనకి కావలసింది దొరకలేదు. భయం మొదలయి మురళి గుండెలో వణుకు పుట్టసాగింది.ఇక తట్టుకోలేక అమ్మ దగ్గరికి వెళ్ళి భుజం తట్టాడు.కదిలే ఓపిక కూడా లేని ఆమె మెల్లిగా" ఎవరూ "అంటూ తల పైకెత్తి చూసింది.

మురళీ అంటూ గుండెలకత్తుకుని భోరుమని విలపించసాగింది.అంతా అయిపోయింది బాబూ !ఏదో వున్నంతలో తలో గంజీ తాగి బతుకీడుస్తున్న మన బతుకుల నిండా చీకటె ఇంక.వున్న భూమి,నిలుపుకున్న పరువు గంగలో కలిసిపాయెరా.కూటికి పేదోళ్ళయినా రెక్కల కట్టం నమ్ముకుని సాగుతుండామనుకుంటే ఇట్టా జరిగిపాయేంటిరా?అంటుంటే ఒక్క ముక్క అర్థంకాక బిక్క మొహమేసిన మురళిని మంచం మీదుండే అయ్య వచ్చి హత్తుకున్నాడు.మురళి కళ్ళు కాలవలై పారాయి తన ప్రమేయం లేకుండానే.

పరిమళక్క ఎక్కడుంది అయ్యా?కనిపించడం లేదేమి?అనుకుంటూ ఇంటి వెనకాల వున్న వసారా వైపు వెళ్ళాడు.జీవచ్ఛవంలా పడుకున్నదెవరా అని దగ్గరికెళ్ళి చూశాడు.నిండు గర్భిణిగా కనిపించిన అక్కను చూసి షాకై పోయాడు.అ..అక్కా..నీవేనా..?పిలుపు విన్న పరిమళ కళ్ళలో గంగాదేవి కట్టలు తెంచుకుని పొంగి పొర్లింది.ఏంటక్కా ఇలా ఎలా...తడబడుతు..ఏమయింది?ఎలా జరిగింది అన్నాడు.

నన్నడుగు బాబు ఆ విషయం.వాళ్ళకేమి తెలాయదు.అమాయకులు అంటూ పట్నం మనిషి ప్రత్యక్షమయ్యాడు. షాకుల మీద షాకులకు దిమ్మ దిరిగింది మురళికి.నోరెళ్ళబెట్టి కళ్ళతోనే ఏంటిదంతా అంటూ ప్రశ్నించాడు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం బాబు!దొర గారి నిర్వాకం. రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు దుర్మార్గుడు బదులిచ్చాడు పట్నం మనిషి.

మౌనంగా ఏమీ అర్థం కాలేదని వివరంగా చెప్పమన్నాడు మురళి.

నీకు నిజం తెలిసే సమయమొచ్చింది.తప్పక చెబుతాను బాబు.నీ భవిష్యత్తు కోసమే కాదు ఈ ఊరిలో కొంతైనా మార్పు తేవాలన్న ఆశయంతో ఆశతో చదువులో ముందున్నావని నిన్ను పట్నం పంపాడు మాష్టారు గారు.దొర సంగతి తెలిసి కూడా ధైర్యం చేశారు.ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకునే రకం కాదు మాష్టారు.ఆ ఎవరో ఒకరు తనే ఎందుకు కాకూడదన్న సంకల్పంతో ముందడుగు వేశాడు.అన్ని సక్రమంగా జరుగుతున్నాయని సంబరపడ్డారు.

మాష్టారు గారు నిజంగా మన పాలిట దేవుడు.శ్రీశ్రీ గారి అడుగుజాడల్లో నడుస్తూ గొప్ప ఆదర్శభావాలున్న వ్యక్తి.మంచికి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.ఎంతో పుణ్యం చేసుకునుంటే నన్ను ఆయన ఇలా తీర్చిదిద్దాలనుకున్నారు.నేనీరోజు ఇలా అక్షరాస్యుడిగా మారి నాకాళ్ళపై నన్ను నిలబడేలా చేశారు.నేనారోజే అనుకున్నా ఈ మాష్టారే మన ఊరికి మంచి చేసే శక్తి అని.

అవును మురళి బాబు.నిన్ను అలా శక్తిగా మార్చాలని కలలు గన్నాడు.ఈ ఊరిపై దౌర్జన్యం సాగిస్తున్న దొరల పెత్తనం అంతం చేయాలని కంకణం కట్టుకున్నాడు.కూలీల దగ్గర అప్పనంగా దోచుకుంటున్న దొరతనానికి మంగళం పాడాలనుకున్నాడు.అప్పిచ్చినట్టే ఇచ్చి వడ్డీలకు వడ్డీలు వసూలు చేసి, భూములను కాజేసి ,వారిని సొంత పొలంలోనే కూలీలుగా మారుస్తున్న పీడిత భూస్వామ్యవాదులకు స్వస్తి చెప్పాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు.దానికి నన్ను ఉడతాసాయంగా వుండమంటేను ఆరోజు నిన్ను ఊరు దాటించగలిగాను .

నిజమా !మాష్టారు నాకోసం ఇంత చేశారా?ఏమీ తెలియనట్టే అంత సౌమ్యంగా ఎలా వుండగలిగారు.అదే ఆయన గొప్పతనం చెమరింతలతో అన్నాడు మురళి.

గొప్పవాళ్ళు అలాగే వుంటారు బాబు.నువ్వెళ్ళిన తరువాత మీ నాయన అప్పులకు వడ్డీలు పెరిగాయి.నీ చదువు కోసం చేసిన అప్పులకు చక్రవడ్డీ,బారువడ్డీ లని వసూలు చేశాడు దొర.అనుమానమొచ్చి ఓ రోజు మీ అయ్యను దబాయించి అడిగాడు.ఇంత అప్పు ఎందుకు చేస్తున్నావని.పొలంలో బావికని,మందులకని అబద్దాలు చెబుతూ వచ్చాడు.కాని నమ్మకం కలగలేదు సరికదా నీ కొడుకు గాసం చేసి సంపాదిత్తున్నాడు కదా!ఇంకా సరిపోవడం లేదంటే నమ్మడానికి యెధవలా వూన్నానా నేను.సెప్పరా పాలెగా అని గదమాయించెసరికి నీ చదువు గురించి చెప్పాడు మీ అయ్య.అంతే బాబు కన్నెర్ర జేసి నామాటంటే లెక్కలేదా నీకు అని బలవంతంగా మీ అక్కను దొరింట్లో పనికి పెట్టుకున్నాడు.అప్పు తీరేదాక నీ బిడ్డ నా ఇంట్లోనే వుంటాదని సెప్పాడు.చేసేదేమీ లేక మీఅయ్య పరిమళమ్మను అక్కడే వదిలేసి వచ్చాడు.

కోపంతో ఊగిపోతూ " ఎంత పని చేశావు నాన్న.మాటమాత్రమైనా నాకు చెప్పకపోయావా.నేనే వచ్చి దొరింట్లో పనికి కుదిరేవాన్ని కదా"విలపించసాగాడు.

ఉన్నట్టుండి ఓ రోజు మీఅయ్యను రమ్మని దేర నుండి కబురు.తీరా పోయి చూస్తే నీ బిడ్డను

తోలుకోపో అనేసరికి ఆనందంతో అలాగే దొరా అని ఇంటికొచ్చాడు బిడ్డతో.కాలం గడిసే కొద్దీ నిజం బయట పడింది.దొర చేసిన నీచపనికి ఎదురించలేక సచ్చిన శవాల్లా గడుపుతున్నారు.

అదివిన్న మురళి రక్తం మరిగింది.దొరైతేనేం జంతువు కన్నా హినమైన బతుకు వాడిది.మనిషన్న కనీస స్పృహ కూడా మరచిపోయాడా?ఇలా ఎన్ని రోజులు భయపడుతూ బతకడం అయ్యా?పద నిలదీసి అడుగుదాం అంటూ వెళ్ళబోతున్న మురళిని చేయి పట్టుకుని ఆపాడు తండ్రి.

వద్దురా,వాడి సావు వాడే పాడైపోతాడు.నీవక్కడికి పోతే నిన్ను కూడా ఏదైనా చేస్తాడు.జంతువని నువ్వే అన్నావుగా!జాలి దయలు చూపడు.నిన్ను నరికినా నరుకుతాడు.నువ్వు సదవనీకి పోయినావని నీమీద కోపంతో రగిలిపోతా వుండాడు.నువ్ పోతే బోనులో సిక్కినట్టె వాడికి.జరిగింది సాలయ్యా,నిన్ను కూడా దూరం సేసుకుని బతకలేం మేమింక.దేవుడనే వాడుంటే వాడికి తగిన సిచ్చేస్తాడు రా అంటూ వేడుకున్నాడు.

అది కాదయ్యా!నామాటిను.పోయి ....అనబోతుంటే అమ్మ అడ్డుకుని "రేయ్ !ఆదొరకి రోజులు దగ్గర పడ్డాయి.ఆడి పాపం ఆడే అనుభవిత్తాడు.అందుకేనేమో పిల్లా జల్లా లేని గొడ్డుబోతయ్యాడు.ఆడి సరిత్ర ఆడితోనే అంతమయిపోతాది.మనకెందుకు ఆ పాపం నాయనా! అంటుండగానే పరిమళ పురిటి నొప్పులు పడసాగింది.చుట్టుపక్కల అమ్మలందరూ వచ్చి పురుడు పోశారు.కాని పుట్టిన కొద్ది సేపటికే పసికందు కన్ను మూసింది.అభం శుభమెరుగనీ పరిమళకు మాత్రం మాతృత్వపు చారికలు గాయాన్ని గుర్తు చేస్తూనే వున్నాయి.


పరివర్తన



   


Rate this content
Log in

Similar telugu story from Tragedy