VENKATALAKSHMI N

Tragedy Crime Others

3  

VENKATALAKSHMI N

Tragedy Crime Others

స్వప్న లోకం

స్వప్న లోకం

8 mins
235


తూరుపు సింధూరపు బొట్టుతో, లేలేత కిరణాలతో సింగారించుకుంటుండగా సుప్రభాత గీతాలాపనతో మేలుకొన్న ఆ పల్లె మంచు దుప్పట్లను తొలగించి,దినచర్యలో తలమునకలవుతున్న తీరు ప్రతి మదిని పరవశింపజేయక మానదు.

   కుంకుమ రంగు ఓణీతో,తలకు టవల్ చుట్టి ,గుమ్మంకు పసుపు రాసి,ముంగిట ముగ్గులు పెడుతున్న మీనా ను చూసిన ప్రతీవారు "తెలుగింటి ఆడపడచు"అంటూ పొగడగా,వారినీ కూడా వరసలు కలిపి చిరునగవుతో మాటలు కలుపుతూ కలుపుగోలుగా గోల చేసే అల్లరి పిల్ల .పల్లెలో పుట్టినా చదువులో ముందుంటూ విలువలు తెలిసిన పల్లె పడుచు మీనా అంటే అందరికీ అమితమైన ప్రేమ.అమ్మానాన్నలతో అప్పుడప్పుడూ పొలం పనులకు సైతం వెళుతు సాయంగా వుండేది.

     రామయ్య,జానకమ్మల నోముల పంట మీనా.పెళ్ళైన పన్నెండేళ్ళకు కలిగిన సంతానమని మీనాను అల్లారు ముద్దుగా పెంచారు.రామయ్య రైతు.తనకున్న ఎకరా భూమిలోనే పంటలు పండించి కుటుంబాన్ని పోషించేవాడు.జానకమ్మ చాలా నెమ్మదస్తురాలు.పేరులోనే కాదు గుణంలో కూడా సాక్షాత్తు ఆ సీతాదేవినే పుణికి పుచ్చుకుందని చుట్టు పక్కల వారందరూ అనుకునేవారు.చుట్టు పక్కలిండ్లలో ఏదైనా శుభకార్యం జరిగితే జానకమ్మనే చిన్న చిన్న పనులకు సాయంగా పిలుచుకునేవారు.జానకమ్మ పెద్దరికంగా వుంటూ దగ్గరుండి శుభకార్యాలను పద్ధతిగా నడిపించేది.ఆ సమయంలో మీనా అందరినీ తన అల్లరితో ఆటపట్టిస్తూ సందడి చేసేది.మీనా పదో తరగతి వరకు చదివింది.పై చదువులకు పక్క ఊరికి పంపించడం ఇష్టం లేక ఇంటి పట్టునే పనులన్నీ నేర్చుకుంటూ వుండేది.తల్లిదండ్రులన్న ఆ ఊరి పెద్దలన్నా మీనాకు ఎనలేని గౌరవం.ఎవరేమి అడిగినా కాదనకుండా చేసి పెట్టేది.పెద్దల మాటకు ఎదురు చెప్పేది కాదు.పద్ధతిగా నడుచుకునేది.అలా సాఫీగా సాగిపోతుంది వారి కుటుంబం.

   మీనా పెళ్ళీడుకొచ్చిందని జానకమ్మ భర్తతో చెబుతూ"మీనాకు పెళ్ళి వయసు వచ్చింది.మంచి సంబంధం చూడాలి.పట్నంలో ఉద్యోగస్తుడైన బుద్ధిమంతుడినీ చూసి పెళ్ళి చేద్దామయ్యా.ఏమంటావు?"పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ మాట కలిపింది.

   అవునే!నేనూ అదే అనుకుంటుండాను.ఇంతలో నీవే నా మనసులో మాటను బయట పెట్టినావు.మీనాను కూడా ఓమారు అడుగుదామే.పిల్ల మనసు తెలుసుకుందాం.టనకిట్టమైతేనే సేద్దాం.సందర్భం సూసి నీవే ఓపారి అడిగిసూడరాదా బదులాచ్చాడు రామయ్య.

   సరేనయ్యా!అదీ నిజమేలే .అట్టాగే అడిగి సూత్తాను.

    మరుసటి రోజు ఉదయం మీనా పక్కింటి తాతయ్యతో మాట కలుపుతూ"ఏం తాతా!ఏం వండి పెట్టింది అవ్వ?ఇంత పొద్దుగాలే సుప్రభాతం పెట్టావు?అవ్వతో గిల్లిగజ్జాలాడకపోతే నీకు పూట గడవదు కదా!"ఆట పట్టించసాగింది.

   అవునే మనవరాలా!మీ అవ్వతో గిట్టా సరసాలాడకుండా వడలేను మరి?నీ ముక్కుకు తాడేసేటోడు వచ్చినప్పుడు గీ ఇసయాలన్నీ ఎరకైతదిలే నీక్కూడా ఏడిపించసాగాడు ముసలోడు.

   లోపలున్న ముసలమ్మ మధ్యలో అందుకుంటూ"ఏం జానకమ్మా!మీనమ్మకి పెళ్ళీడొచ్చిన సంగతి ఎరకనా?పెళ్ళి సేయాలన్న ధ్యాసుండాదా అనడుగుతుండాను"

   ఒసేయ్ ముసలీ!పెట్టావా ఫిట్టింగు.తాతా!ఇందాకిచ్చిన కోటింగు సరిపోలేదనుకుంటాను నీ ముసల్దానికి.నాతో పెట్టుకుందామనుకుంటుంది.నిన్నూ..నీకు చేయాలే ఇంకో పెండ్లి ఈ సలాకితో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది మీనా.

    జానకమ్మ మాట్లాడుతూ"మీ గారాభమే సూడండి పెద్దయ్యా!మిమ్మల్నే ఆట పట్టిస్తుండాది.ఏమనుకోకు పెద్దమ్మ .ఆ పిల్ల సంగతి మీకెరుకనే కదా!మీరన్నట్టు పెళ్ళి సేయాలనే అనుకుంటుండాం.పట్నంలో మంచి సంబంధముంటే సూడండి మరి.వచ్చే యేడుకంతా సేసేస్తే మా బాధ్యత తీరతాది"అసలు విషయం వెల్లడించింది.

   అట్టా అయితే మా మీనమ్మ పెండ్లి కూతురయితాదన్నమాట.ఓ మీనమ్మో ఇంటుండావా ఈ మాట.తొందర్లో పప్పన్నం పెడతావన్నమాట ఆనందం ఆపుకోలేని ముసలోళ్ళు మీనాను ఉడికించబోయారు.

    అది విన్న మీనా బయటకొచ్చి"ఊ..పెడతానే.తిందురుగానీ.నాక్కూడా మీతో యేగలేక సాలయిపోయింది.సాగనంపండింక పోతాను గానీ"మూతి తిప్పుతూ లోపలికి పరుగెత్తింది తన ఇష్టాన్ని కోపంగా వెలిబుచ్చుతూ.

    జానకమ్మ విషయం భర్తతో చెప్పింది మీనా పెళ్ళికి ఒప్పుకుందని.సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కార్తీక్ జగన్నాథం సావిత్రమ్మల ఏకైక సంతానం.మంచి ఆస్థిపరులు.చదువుకున్న పిల్లయి,ఇంటి పట్టున వుంటూ కుటుంబాన్ని చూసుకునే అమ్మాయినిచ్చి పెళ్ళి చేయాలని సావిత్రమ్మ కోరిక.అనుకున్నట్టుగానే మీనా సంబంధం కుదిరింది.

   రామయ్య జానకమ్మలు కూడా కార్తీక్ రూపురేఖలు ,ఉద్యోగం చూసి ఒక్కడే కొడుకని ,పిల్ల సుఖపడుతుందనీ పెళ్ళికి ఒప్పుకున్నారు.నెల ముందు నుంచే పెళ్ళి పనులన్నీ చక్కబెట్టారు.ఇఫుగుపొరుగు వారు పెళ్ళి పనులను పంచుకుని ఏ లోటు లేకుండా పెళ్ళిని ఘనంగా జరిపించారు.పుట్టింటి నుండి అత్తారింటికీ సాగనంపుతూ ఊరంతా మీనా ఇంటి ముందు గుంపులుగా నిలబడ్డారు.చీర సారె సద్ది ఎవరికి తోచింది వారు మీనా చేతిలో పెడుతూ కన్నీరు మున్నీరయ్యారు.పక్కింటి ముసలోళ్ళను చూసి మీనా గట్టిగా హత్తుకుని పోయొస్తానే ముసలీ అనగానే అందరూ ఒక్కసారిగ నవ్వారు.మీనా కార్తీక్ చేయి పట్టుకుని వెళుతున్న దారి వెంటే అందరి చూపులు సాగాయి.

    కాలచక్రం గిర్రున తిరుగుతోంది.మీనాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.కార్తీక్ మీనాల కాపురం చూడముచ్చటగా సాగిపోతుందని అందరూ సంబరపడ్డారు.కానీ కాలం ఒకేలా సాగదుగా.ఉన్నట్టుండి కార్తీక్ ఓ రోజు పిడుగు లాంటీ వార్తను మీనాతో చెప్పాడు.అది విన్న మీనా షాక్ కు గురైంది.

"నీకేం తక్కువ చేశాననీ ఇంత ఘోరం చేశావు.నేను నా పిల్లలు ఏమయిపోవాలి.ఎందుకింత అన్యాయం చేశావు"గావుకేకలు పెట్టసాగింది.

   అది విన్న సావిత్రమ్మ"ఏమయింది మీనా?ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు?వాడేమైనా కొట్టాడా?"పరుగుపరుగున వచ్చింది.

   అత్తయ్యా!కొట్టినా బాగుండేది.గాయమైతే కొన్నాళ్ళకు మానిపోతుంది.కాని మీ అబ్బాయి మనసు మీద కొట్టాడు.మీరే అడగండి.నాకెందుకింత అన్యాయం చేశాడోనని నిలదీయండి అంటూ భోరున విలపించసాగింది.

    గాభరా పడ్డ సావిత్రమ్మ "అసలేమయిందో చెప్పండి.ఏరా కార్తీక్ !ఏం చేశావురా?కోడలు పిల్ల అలా ఎందుకు ఏడుస్తుంది?"గద్దిస్తూ అడిగింది.

   అదేం లేదమ్మా!ఈ ఫోటో చూపించాను సెల్ లో అంటూ తల్లి చేతిలో సెల్లు పెట్టాడు కార్తీక్ .

   అది చూసి నిర్ఘాంతపోయింది సావిత్రమ్మ.కోపం ఆపుకోలేక "ఎందుకు చేశావురా ఈ పని.మాతో ఒక్క మాటైనా చెప్పరాదా?మేమంతా గుర్తులేమా?పసిపిల్లలు గుర్తు రాలేదా నీకు.అయినా ఇప్పుడేం లోటు వుందని మళ్ళీ పెళ్ళి చేసుకున్నావురా?వేధవా?నిన్ను ఏం చేసినా పాపం లేదు కదరా!అంటూ చెడిమడా తిడుతుండగా తండ్రి జగన్నాథం వచ్చాడు.

   విషయమంతా వివరించింది సావిత్రమ్మ.ఆశ్చర్యపోయాడు.ఎందుకు చేశావురా అంటూ చెంప దెబ్బ వేశాడు.అంతే!మీనా భయపడి అడ్డుకుంది.

 ఇంతకీ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనెందుకు వచ్చింది అనడిగాడు.

    చావు కబురు చల్లగా విన్నవించాడు కార్తీక్ .మరేం లేదు నాన్న!ఫేస్ బుక్ ఫ్రెండ్ తను.మాటమాట కలిసి మనసులు కూడా ఒకటయ్యాయి.నేను లేకుండా బ్రతకలేనంటుంది స్వప్న.తనకే సమస్య వచ్చినా నాతోనే చెప్పుకుంటుంది.నేను తప్ప తనకెవరూ లేరు నాన్న.నాక్కూడా తనంటే ఇష్టం కలిగింది.పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టసాగింది.అందుకే గుళ్ళో ఫ్రెండ్స్ ద్వారా చేసుకున్నాం.

   ఓహో!ఇది మీ ఫ్రెండ్స్ నిర్వాకమా!వాళ్ళను కూడా ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోలేదో అడగరాదా?నీకు మాత్రమే ఎందుకు చేసినట్టో?నిలదీసాడు జగన్నాథం.

   అదీ..అదీ..ఏమో నాన్న.నాకవన్నీ అనవసరం.నాకు స్వప్నంటే ప్రేమ.వదలి వుండలేను.

  మరి నేనేం కావాలి?ప్రశ్నించింది మీనా.

  నీవు కూడా నాతోనే ఇక్కడే వుండు.స్వప్న నేను ఇంకో చోట వుంటాం.

  ఆహా!నీకేమో ఇద్దరు భార్యలూ కావాలంటావు.నేను బతికుండగానే ఇంకో పెళ్ళి చేసుకోవడం నేరమని మీకు తెలుసనుకుంటాను.మరి కలిసుండమని ఎలా అడుగుతున్నారండి ఆవేశంగా అరిచింది మీనా .

   ఏంటీ?లా మాట్లాడుతున్నావా?నన్ను చేసుకున్నప్పటి నుండి నీకు తెలివి పెరిగింది.నోరు లేస్తుంది.పల్లెటూరి పిల్లవైనా చేసుకున్నాను.నిన్ను బాగా చూసుకున్నాను.ఈ మాత్రం దానికే ఇంత రాద్దాంతం అవసరమా మీనా.. దబాయించాడు కార్తీక్ .

  మీనా ఏడుస్తూ ఇద్దరి పిల్లలను

తీసుకుని పుట్టింటికీ బయలుదేరింది అత్తామామలకు చెప్పి.  

   మీనా రాక రామయ్య జానకమ్మలకు కలవరాన్ని కలిగించింది.విషయం తెలిసి హతాశులయ్యారు.ఏం చేయాలో తోచక పాలుపోవడం లేదు.వీరి దీనస్థితిని గమనించిన పక్కింటీ ముసలోళ్ళు విషయమేమిటని ఆరా తీశారు.ఇలాంటి సమస్యలకు కాలమే సమాధానం చెబుతుంది జానకమ్మ.దిగులు పడకు.మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది అంటూ భరోసానిచ్చారు.

    రోజులు భారంగా గడవసాగాయి మీనాకు.వున్నట్టుండి ఓ రోజు జగన్నాథం కోడలు ఇంటికి విచ్చేశాడు.మామయ్య రాకతో మీనాకు కాసింత ఊరటనిచ్చింది.ఆయనెలా వున్నారు మామయ్య అంటూ అడిగింది.

  బంగారం లాంటి భార్యను కాదనుకున్న వాడి గతి ఎలా వుండాలో అలానే వుందమ్మ వాడి పరిస్థితి.నిన్నే కలవరిస్తున్నాడు.మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయమ్మ.పద మనింటికి 

పోదాం అన్నాడు జగన్నాథం.

    అదేంటి మామయ్య!అన్నీ తెలిసి రమ్మనడం భావ్యమా?మీ కూతురినైతే ఆలానే చేస్తారా?అని నిలదీసింది మీనా.

  అది కాదమ్మా!వాడి పరిస్థితి చూస్తే నువ్విలా మాట్లాడవు.పైగా అహోరాత్రులుఋనిన్ను పిల్లలను కలవరిస్తున్నాడు.తప్పులు అందరూ చేస్తారు.కాని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారు చాలా అరుదు.పైగా మళ్ళీ అలాంటి తప్పుల జోలికి వెళ్ళరు.దెబ్బతిన్న జీవికి గుణపాఠం నేర్పిన గతం గాయాలు ఎప్పటికీ హెచ్చరిస్తూనే వుంటాయి.ఇప్పుడు కార్తక్ స్వచ్ఛతలో ముంచిన ముత్యమంటి వాడు.వంద తప్పులుఋచేసినోడికైనా ఆఖరి కోరిక తీరుస్తారంట.మరి ఒకే ఒక తప్పు చేసిన కార్తీక్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూడరాదా మ్మా.పెద్దవాడినైనా వేడుకుంటున్నానమ్మా!వెళదాం పదా!అర్థించాడు జగన్నాథం.

   రామయ్య మాట్లాడుతూ"మీనా!తండ్రి లాంటి మామయ్య మాటలు వినకపోవడం మర్యాద అనిపించదు.నీ జీవితం బాగు పడే అవకాశమేమో అనుకో.గాడి తప్పిన నీ జీవన గమనాన్ని దారిలో పెట్టే బాధ్యత నీది కాదా?కాదనకుండా బయలుదేరమ్మ తల్లి.నా బిడ్డవు కదూ "అంటూ బతిమాలాడు.

   "అవునమ్మా!మీ నాయన మాటలినుకో బిడ్డా.ఆడపిల్లకు సహనం వుండాలంటారు.కాని దానికి తగ్గ నేర్పు కూడా అవసరం.చిన్నపిల్లాడు నిప్పులో చేయి పెట్టబోతుంటే చూస్తూ వూరుకూంటామా?రెండు దెబ్బలేసైనా పక్కకు తీసుకోస్తాం కదా తల్లీ.అలానే దారి తప్పుతున్న నీ పెనిమిటిని నీవే నయానో, భయానో ,తెలివితోనో దారికీ తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే కదమ్మా"అర్థించిందిఋతల్లి జానకమ్మ.

  అన్నీ గమనిస్తున్న పక్కింటి ముసలోళ్ళు కూడా "మీనమ్మ నీ తెలివితేటలతో నీ మొగుణ్ణి దార్లోకి తెచ్చుకో.ఎంత కాలమని ఇక్కడే వుంటావు దిగులు పడుకుంటూ?ఇది కాదు నీ సమస్యకు పరిష్కారం.మీ అత్తగారింట్లోనే వుంటూ నీ పెనిమిటిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ,నిగ్గదీస్తూ కడిగిపడేయాలి నాలాగ.మీ తాతను నేను,నన్ను మీ తాత ఎలా పోట్లాడుకుంటాం అలాగన్నమాట.మనసులో దాచుకుంటే అది చెదపురుగై మణల్నే తినేత్తది తల్లి.నిప్పులాగ దహించక ముందే చెదపురుగును ఏరిపారేయమూ?అలాగన్న మాట.ఇంత మంది పెద్దోళ్ళం నీ మంచికే కదమ్మా సెబుతుండాం.ఆ పిల్లల మొగం సూసైనా వెళ్ళు తల్లి!"హితవు పలికారిద్దరూ.

   హా!అందరికీ నేనేమో బరువైపోయినట్టు నన్ను పంపించాలని కుట్ర పన్నుతుంటే ఏ మొఖం పెట్టుకుని ఇక్కడే వుండాలింక.పోతానులే!తాడో పేడో తేల్చుకుంటాను.సావైనా బతుకైనా ఆడనే ఇంక.మీ అందరికీ శతకోటి దండాలు.పదండే మీరొకటి నా ప్రాణానికి అంటూ పిల్లలిద్దరినీ బరాబరా లాక్కుంటూ లగేజీని "ఇదుగో మామయ్య ఇందా "అంటు చేతిలో పెట్టి గుమ్మం దాటింది మీనా.

   జగన్నాథం అక్కడున్న వారందరికీ రెండు చేతులతో వినమ్రంగా నమస్కరించి మౌనంగా కృతజ్ఞతలు తెలిపి మీనాను అనుసరించాడు.

  హమ్మయ్య!వచ్చావామ్మా!రా మీనా.నీవు పిల్లలు లేని ఇల్లు చూడు ఎంత కళ తప్పి బోసిపోయిందో!ఆనందంతో ఎదురొచ్చి పిల్లలను ముద్దాడింది సావిత్రమ్మ.

   నా ఇంటికి నేను రాకుండా పోతానా అత్తయ్యా.ఏం,నే రాకపోతే కొత్త కోడల్ని తెచ్చుకోవాలనుకున్నారా?ఆ పప్పులేం నాతానా ఉడకవు.అమాయకురాలిననుకున్నారేమో?నాకూ లౌక్యం తెలుసత్తా!మీ అబ్బాయిని నా గడుసుతనంతో ఎలా మార్చుకుంటానో చూస్తారుగా మీరే అని విసురుగి వంటింట్లోకెళ్ళింది మీనా.

   ఈవిడగారు మళ్ళీ ఎందుకొచ్చినట్టో ఇక్కడికీ?ఈవిడ లేకపోతే ఇక్కడ పనులన్నీ నిలిచిపోయినట్టు?ఎవరెళ్ళమన్నారు?ఎందుకొచ్చినట్టో మళ్ళీ?అంటున్న కార్తీక్ వ్యంగ్య మాటలు విన్న మీనా కొంగు దోపుకుంటూ చేయి తిప్పుకుంటూ"ఆహా!వెళ్ళింది మళ్ళీ ఎందుకొచ్చిందా అని బాధ పడుతున్నట్టున్నారు మీ మాటలు బట్టి చూస్తుంటే.ఏకంగా ఇంటికే తెచ్చేయాలనుకున్నారేమో మీ దుకాణాన్ని.అత్తమామలూరుకున్నా నేనూరుకునేది లేదు.వాలుజడను వెనక్కి విదిలిస్తూ దోపిన చెంగును జాడిస్తూ కటువుగా మాట్లాడింది మీనా.

    మీనా ప్రవర్తనలో,మాట తీరులో వచ్చిన మార్పుకు ఆశ్చర్య పోయారు భర్త అత్తమామలు.అమాయకంగా వుండే మా మీనానేనా అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.

   రాత్రి భోజనాలయ్యాక గదిలో పిల్లలను నిద్రపుచ్చుతున్న మీనా పక్కన నెమ్మదిగా పిల్లిలా చేరుకున్నాడు.ఉలిక్కిపడ్డ మీనా తన కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చింది.బెదురుకున్న కార్తీక్ తేరుకుని"మీనా!ఎందుకే అంత కోపం?అంత కాని పనీ నేనేం చేశాను.నీకు ఏ లోటు రానివ్వనని ఒట్టేసి చెబుతున్నాగా.నాకు నీవంటే చాలా ఇష్టం.నీవు లేకపోయే సరికి నాకు తోచలేదు తెలుసా.పిల్లలే గుర్తొస్తున్నారు ఇంట్లో ఎక్కడ చూసినా.అందుకే నాన్నను పంపాను నిన్ను తీసుకురమ్మని"తన చేతిని మీనా చేతిలో పెడుతూ అన్నాడు కార్తీక్ .

  ఈ మాటలకేం లెండి ఎన్నయినా చెబుతారు.అబ్బో ప్రేమ కారిపోతుంది భార్యాపిల్లల మీద.అందుకేగా బయట దుకాణం తెరిచింది కొత్తగా అనుకుంటూ మూడంకె వేసింది మీనా.

  అది కాదు మీనా!నా మాట విను.ఏదో జరిగిపోయింది.ఇప్పుడెన్ననుకుని ఏం లాభం.అంతా మన మంచికే అనుకో -కార్తీక్ 

  ఏంటీ?మంచికా!ఏంటి మంచి?చేసిందంతా చేసి కల్లిబొల్లి కాకమ్మ కబుర్లు చెబుతున్నావా.మీకసలు చీము నెత్తురు లేవా?అంటూ చెడామడా తిట్టేసింది మీనా.

    అయ్యో!నా మాటలు పూర్తిగా విను.మనకిద్దరు అమ్మాయిలే కదా!అందుకే మనకు ఒక వారసుడు కావాలి కదా!నా ఇంటి పేరు నిలబెట్టే వారసుడు లేకపోతే మా వంశం ఇంతటితో ఆగిపోతుంది.పైగా నీ అనారోగ్య రీత్యా నీకు కుటుంబనియంత్రణ చేసుకున్నావు.అందుకే స్వప్నను ఆహ్వానించాను నా జీవితంలోకి.

    అంటే మీ ఉద్దేశ్యం నేను కొడుకును కనలేదని ఇంకో భార్యను తెచ్చుకున్నారా?అసలు నాకో విషయం తేల్చండిప్పుడు.కొడుకు కోసమా లేక ప్రేమ కోసమా మరో పెళ్ళి చేసుకుంది అంటూ నిలదీసింది మీనా.

     ఆవులించినంత సులభంగా అబద్ధమాడానే కాని పేగులు లేక్కబెడుతుందేంటబ్బ మీనా?ఇంతలా తెలివితేటలెక్కడివి ?అస్తమానం ఇల్లు పిల్లలతో నాలుగ్గోడల నడుమ గడిపే మీనా కు ఇన్ని మాటలెలా వస్తున్నాయబ్బా నాలుక్కరుచుకున్నాడు కార్తీక్ .

      ఉలకరేంటండి?నా ప్రశ్నకు సమాధానం మౌనమంటే సరిపోదు.తేల్చాల్సిందే దబాయించింది.

     ఏంటి భయపెడుతున్నావా నన్ను?నాఇష్టం వచ్చినట్లు వుంటాను,మగాణ్ణి నాకే ఎదురు చెబుతావా అంటూ చేయెత్తబోతుండగా వెంటనే మీనా చెయ్ పైకి లేచేసరికి షాక్ తో వెనుకడుగేశాడు కార్తీక్ .అదే చెయ్ చెంపను తడిమింటే పరువేంకానూ అనుకున్నాడు.

      పరువు మాటను పక్కన పెట్టానంటే నేను కూడా మీలాగే ప్రవర్తించాల్సా వస్తుందండి.ఆడాళ్ళు చేతగాక గాదు పడుండేది.భర్తగా పైచేయే వుండాలని,మీ అహం దేబ్బతినకూడదని.అంతేకానీ ధైర్యం లేక గాదు,తెగించిందంటే మీ కంటే రౌద్రాన్ని చూపించగలదు అని హెచ్చరించేసరికి నోరెళ్ళబెట్టాడు కార్తీక్ .

     అదీ..అదీ...ప్రేమించాను.ఎలాగో కొడుకుల్లేరని చేసుకుంటే తప్పేమీ కాదని అనిపించింది అందుకే.....కార్తీక్ చెప్పబోతుండగానే మీనా అందుకుని

"కొడుకు పుట్టక పోతే నా తప్పా?నేనేం కావాలని కూతుర్లను కన్నానా?మీ పాత్ర ఏమీ లేదంటారా?"గట్టిగా నిగ్గదీసి అడిగింది.

   

నేనలా అనలేదే?కొడుకు కావాలని అంటున్నాను.


మరయితే నాకూ కొడుకు కావాలండి.నేనూ మరో పెళ్ళి చేసుకోనా?అంటూండగానే చెళ్ళుమన్న శబ్ధం.కార్తీక్ చేయి మీనా చెంపపై వుంది.

   మీనా ఏడుస్తూ"?మాటకే రోషం పోడుచుకొచ్చిందేం?మరి మీరు చేస్తున్నదేంటి?నాకెంత కోపం రావాలో ఒక్కసారి నా స్థానంలో నిలుచుని ఆలోచించండి.మీరు మరో అమ్మాయితో వుంటున్నారని తెలిసి నేనెంత నరకం అనుభవిస్తున్నానో అర్థం చేసుకోండి.మీకో న్యాయం నాకో న్యాయమా?

     

   మగాళ్ళు ఏం చేసినా లోకం పట్టించుకోదు.ఆడది తుమ్మినా దగ్గినా తప్పు పట్టే లోకమిది.అలాంటిది భర్త వుండగా.....ఛీఛీ నా నోటితో అనలేను మీనా.


  మరి నేనుండగ మీరు ...అలా చేయడం న్యాయమా!లోకం ఒప్పుతుందా?నరంలేని నాలుకలు ఎన్నైనా అంటాయి.మీకు నేను నాకు మీరు ముఖ్యమండి.మనమే శాశ్వతం.

  

అదంతా నాకు తెలీక కాదు మీనా.నా ఇంటి పేరును వంశాన్ని నిలబెట్టె వారసుడు కావాలంతే.నాతోనే వంశం అంతం కాకూడదని నా తపన.


మీరింత మూర్ఖులని అనుకోలేదండి నేను.చదువుకున్న మూర్ఖులని తేటతెల్లమైంది.మీ చదువు నేర్పించింది ఇదేనా?మారుతున్న కాలంలో కూడా కొడుకు,వారసుడు అనడమేంటి?ఎందులో తక్కువ ఆడవాళ్ళు?మిమ్మల్ని కన్నది ఆడదే,మీతో జీవితాన్ని పంచుకునేది ఆడదే,మీకు వారసులనిచ్చేది ఆడదే.అంతేనా ఆడది అడుగు పెట్టని చొటంటూ వుందా?మీకు కొడుకు పుట్టలేదంటే కారణం నేనా?ఇదేనా మీరు నేర్చుకున్నది!మీ చదువు నేర్పిన సంస్కారం ఇంతేనా?మిమ్మల్ని చూస్తుంటే "చదువుకున్నోడి కంటే చాకలోడు మేల"నే సామెత గుర్తొస్తుందండి.మీ అజ్ఞానానికి నవ్వొస్తుందండి.మీరు చేసిన పనికి అసహ్యం వేస్తుంది కూడా అంటూ తన గదిలోకెళ్ళి తలుపేసుకుంటుంది మీనా.

   

   కొన్ని నెలలకు స్వప్న నెల తప్పిందని కార్తీక్ కంటికి రెప్పలా చూసుకుంటాడు.తనకు వారరుడే కావాలని స్వప్నకు పదే పదే గుర్తు చేస్తూ గది నిండా అబ్బాయిల ఫోటోలతో నింపేస్తాడు.రోజూ వాటినే చూస్తూ గడిపితే అబ్బాయే పుడతారని ఎవరో ఫ్రెండ్ చెప్పాడట.పిచ్చి ముదిరి పాకాన పడ్డట్టుంది కార్తీక్ కు అని మీనా మనసులో అనుకుంటుంది.కాలమే తనకు సమాధానం చెబుతుందని వేచి చూస్తుంది మీనా.

  

  స్వప్నకు పురిటి నొప్పులొచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్ళి నానా హంగామా చేస్తాడు కార్తీక్ .తనకు వారసుడే వస్తాడని ,మీనాకు వారసుడిని కనడం చేతకాదని నిందలు వేస్తూ బాధకు గురిచేస్తాడు.కొంత సమయానికి ణర్సు బయటకు వచ్చి మీకు ఆ....అనబోతుండగ మగపిల్లాడే కదా అన్నాడు కార్తీక్ .కాదండి ఆడపిల్ల అని చెబుతుంది.అంత వరకున్న హుషారంతా హుష్ కాకైపోతుంది కార్తీక్ కి.స్వప్నను కూడా చూడకుండాఎటో వెళ్ళిపోతాడు.

  

  కార్తీక్ జాడ లేదని స్వప్న మీనా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది.తన భర్తను పంపించమని,లేదంటే పోలీసు కేసు పేడతానని బెదిరించింది.

  

  మీనా ,జగన్నాథం,సావిత్రమ్మలు కంగారు పడుతుండగ రానే వచ్చారు పోలీసులు.స్వప్న భర్త కార్తీక్ ఎక్కడంటూ బెదిరిస్తారు.సరిగ్గా అప్పుడే మాసిన గడ్డంతో ,నీరసించిన శరీరంతో వచ్చిన కార్తీక్ ను చూసి స్వప్న గొడవ చేస్తుంది.మీనా అడ్డుకుని కార్తీక్ నా భర్తంటూ,స్వప్న కు నా భర్తకు ఎలాంటి సంబంధం లేదంటు పోలీసులతో చెబుతుంది.పోలీసులు నమ్మలేకపోతారు.వీధిలో వాళ్ళంతా మూకుమ్మడిగా మీనాయే కార్తీక్ భార్య అని,ఈ స్వప్న ఎవరో తెలీదని అంటారు.


    నిజం గ్రహించిన పోలీసులు స్వప్న ను నిలదీస్తారు.సిగ్గుతో తల దించుకుని మౌనంగా నిలబడుతుంది.తన బిడ్డను కూడా మీనా చేతిలో పెడుతూ"నన్ను క్షమించు మీనా.నీ భర్తను వలలో వేసుకుని నీకు అన్యాయం చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది.ఈ బిడ్డను కూడా నీవే తీసుకో"అంటూ పోలీసు జీపు ఎక్కి వెళ్ళిపోయింది.

  

  కార్తీక్ తేరుకుని వీధిలో తన వైపు నిలబడి తనకనుకూలంగా మాట్లాడిన అందరికీ నమస్కరిస్తూ"మీకందరికీ నేను జన్మజన్మలా ఋణపడి వుంటాను"అని మీనా దగ్గరగా వచ్చి "మీనా క్షమించగలవా?వారసుడు వారసుడు అని మూర్ఖంగా ఆలోచించాను.నిన్ను నిర్లక్ష్యం చేశాను.కాని నీవు అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను పోలీసీల నుండి రక్షించావు.ఎంత పెద్ద మనసు మీనా నీది.అందుకే స్త్రీలకు సహనమెక్కువంటారు.భూమాత ఓర్పు వుందంటారు.నీవది నిరూపించావు"అంటూ హత్తుకున్నాడు.


   తనలో వచ్చిన మార్పుకు అంబరమంత సంబరంతో తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది మీనా.

   

  

    



Rate this content
Log in

Similar telugu story from Tragedy