VENKATALAKSHMI N

Tragedy Inspirational Children

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Children

మనసు పుట

మనసు పుట

9 mins
638


"రేయ్ సచ్చినోడా!ఎందుకురా మమ్మల్నిట్టా ఏపుకు తింటున్నావు?నీ చావు నీవు సావక మమ్మల్ని కూడా సంపేదాకా యిడసవా?నువ్వు మనిసి పుట్టుకే పుట్టింటే ,సీము నెత్తురు వుంటే నీ బతుకు నీవు బతుకుపో.మాకెప్పుడూ కానరాకింక" పారే కన్నీటి కాల్వను చెంగుతో తుడుచుకుంటూ చెడామడా వాంచి పారేసింది నూకాలమ్మ.


   ఇదంతా నేను పని చేసే పాఠశాల వెనుక వున్న ఇంట్లో జరుగుతున్న తతంగం నా చెవిన పడింది.వున్నట్టుండి వినిపించిన గొడవతో నేను చెప్పే పాఠంకు బ్రేక్ పడింది.ఎంత మనసు మరల్చుకుందామన్నా ఆ గొడవ తాలూకు మాటలే నా చెవిని తాకుతుంటే ఇక పుస్తకం టేబుల్ మీద పెట్టేశాను.

   ఇంతలో నా క్లాస్ లో వున్న రాకేష్ గబాల్న లేచి "టీచర్ ఓ పారి ఇంటికి పోయొత్తాను.మాయమ్మని,మా అవ్వని కొట్టినా కొడతాడింక మా నాయన.నేను మా తమ్ముడు పోయి అడ్డం నిలబడల్లా " అనుకుంటూ పరుగెత్తాడు.ఆ గొడవ జరుగుతున్న ఇల్లు వాడిదే మరి.ఇలా గొడవ జరగడం ,వాడు ఆపడానికి పారిపోవడం మామూలు విషయమే నాకు.ఇలా అప్పుడప్పుడు జరుగూతుంటుంది మరి.కాకపోతే ఈ సారి రాకేష్ వెళ్ళాక కూడా ఆగలేదు గొడవ.ఇంకా పెరుగుతూనే వుంది.అదే ఆశ్చర్యమేసింది నాకు.

  చాలా సార్లు మా స్టాఫ్ ఈ గొడవ గురించి విని పల్లెల్లో మామూలేనని ,పట్టించుకోరాదని నాతో అంటుండేవాళ్ళు.కానీ నాకెందుకో ఆ గొడవ గురించి తెలుసుకోవాలని కుతూహలం.ఆడవారికిది సహజ లక్షణం కదా మరి!రాకేష్ నే అడిగాను ఓ రోజు.తాగినప్పుడంతా ఇలా జరుగూతాదని చాలా మామూలుగా చెప్పాడు.అయితే నాకెందుకో నమ్మశక్యం కాలేదు.తాగినోళ్ళ గొడవలు మందు దిగేదాక వరకేనని ,తరువాత మళ్ళీ మామూలేనని ఆనోట ఈ నోట విన్నాను.సరే అవకాశం కోసం ఎదురు చూశాను ,ఎప్పటికైనా తెలియక పోదులే అని.

    బళ్ళో ఓ రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టాము పేరెంట్స్ కమిటీ ఏర్పాటుకని.అబ్బ పేరెంట్స్ ను బడికి రప్పించాలంటే మా పాట్లు ఎన్నో ఇంక చెప్పనలవి కాదు.వారం ముందు నుంచే పిల్లల చెవుల్లో సీసం పోసినట్టు పదే పదే చెప్తూ ,వారి ఇళ్ళలో విషయం తెలిసే వరకూ పారాయణం చేసినట్టే వుంటుంది మాకు.తీరా ఏ పది మందో తీరిగ్గా వారికి వీలయిన సమయానికి బడి వదిలేదాక వస్తూనే వుంటారనుకోండి.తీరా వచ్చారని సంబర పడితే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దిమ్మదిరిగి ఓ ఫ్లాస్క్ కాఫీ గుటకాయ స్వాహా అనిపించేస్తాం.

   పేరెంట్స్ మీటింగ్ కు రాకేష్ వాళ్ళమ్మ ను కూడా పిలిపిస్తే విషయం తెలుసుకోవచ్చేమోనని నా చిన్ని బుర్రకు తట్టింది.అంతే రాకేష్ ను పిలిచి విషయం చెప్పి ఇంటికి పంపించాను.వాడు ఆనందంతో పరుగో పరుగని వెళ్ళిపోయాడు.ఏం చెప్పాడో తెలీదు కాని ఎప్పుడూ రాని వాళ్ళమ్మ మీటింగ్ కు వచ్చింది.అబ్బ నా ఐడియా పారినందుకు లోలోపల ఏదో ఆనందం నాకు.ఎలాగైనా వాళ్ళమ్మతో పర్సనల్ గా మాట్లాడాలని ,అవకాశం ఎప్పుడొస్తుందా అని గోతికాడి నక్కలా కాచుకుని వున్నాను. అంత అత్యుత్సాహమెందుకో ఈ పంతులమ్మకని అనుకుంటున్నారా?మీ మనసులో మాట నేనెలా పసిగట్టానని నాలుక్కరుచుకోకండి.లోకం తీరు ,మనిషి నైజం ఇట్టే పసిగట్టగలను మరి.నాకూ కొన్ని నైపుణ్యాలుజన్మతః అబ్బాయేమో! నా గొప్పలెందుకులేండి.అక్కడ మీటింగ్ అయిపోవచ్చింది.ఒక్కొక్కరూ వెళుతున్నారు సంతకాలు చేసి.ఈసారి నా బుర్రను కాస్త సాన పెట్టి రాకేష్ ను పిలిచి"ఒరేయ్ మీ అమ్మేం రా అలాగే వెళ్ళిపోతుంది.నీ క్లాస్ టీచర్ ను నేను.నాతో మాట్లాడదా?నాకు పరిచయం చేయవా వెధవా!"అంటుండగానే పరుగు లంకించాడు బిత్తరోడు.నేనలాగే పిలుస్తుంటాను వాణ్ణి ప్రేమ ఎక్కువైనప్పుడు.వాడికదే సంతోషం.నిక్ నేంలతో పిల్లలను పిలుస్తుంటే నాకేదో తెలియని ఆనందం మరి.పిల్లలైతే అరే టీచర్ కి నేను భలే నోటెడ్ అయ్యానురా అని కొందరు,నేనంటే స్పెషల్ రా అని కొందరు ఇలా సరదాలు జరుగుతుంటాయిలెండి నాకు మా పిల్లలకు మధ్య.


   నమస్తేమ్మా!పిలుపుతో పక్కకు చూస్తేను రాకేష్ వాళ్ళమ్మతో ముసిముసిగా నవ్వుతూ టీచర్ర్ మాయమ్మ!ఎంత సంబరమో వాడికి.రేయ్ మీ అమ్మకో కుర్చీ వెయ్ మరి అనేలోపే వాడు తేవడం ఆమె కూర్చోవడం జరిగీపోయాయి.

  ఆ...మీ పేరు అనేలోపే రూప పలికింది ఆమె.రూప గారూ చాలా రోజులకు మా బడీకొచ్చారు.సంతోషంగా వుందండి నాకు.ఇలా అప్పుడప్పుడూ వస్తూ వుండండి.మీ అబ్బాయి గురించి,వాడి చదువు గురించి తెలుసుకొంటూ వుండడం మీ బాధ్యత అంటూ లెక్చర్ ఇచ్చాను.

 స్పందనగా ఆమె"ఇంత వరకూ ఎవరూ నన్ను రమ్మని పిలవలేదింత వరకు.మొట్టమొదటి సారి మీరే మేడం రమ్మని పిలిచింది"అనేసరికీ ఆశ్చర్య పోయాను.ఓహో ఇలా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి పిలవాలన్న కొత్త విషయం తెలుసుకున్నాను నేను.సరే నేను పిలుస్తుంటాను ,వస్తూ వుండు రూప అన్నాను.గొడవ గురించి ఆరా తీసే ధైర్యం చేయలేకపోయాను.పరిచయమయిందిగా,ఇక చనువు పెరిగాక కూపీ లాగొచ్చని.

    అలా అపుడపుడు ఆమె ఇంటి బయట కనీపిస్తే ఒక స్మైల్ ఇవ్వడం లేదా చేయి ఊపడం లాంటివి చేయడంతో ఆమెకు నా పట్ల ఇష్టం ఏర్పడేలా చేశాను.ఎంతైనా టీచర్ ను కదా,పిల్లలను నా వైపుతిప్పుకునే విద్య అదే సైకాలజీ తెలిసిన దాన్ని కదా!అందుకే రూప ను నా పట్ల ఆకర్షితురాలయ్యేలా చేయడం సులువయింది.రాను రాను చేయి ఊపితే మాట కలపడం,రాకేష్ ను అడ్డం పెట్టుకుని దగ్గరకొచ్చి తన ఇంటి పనుల బిజీ గురించి చెప్పడం మొదలు పెట్టింది.ఇదే అదునుగా భావించి గొడవెందుకని అడిగేశాను.పాలలో నీళ్ళు కలిపినంత ఈజీగా మాటల్లో గొడవను కలిపేశాను.అంతే ఏ మాత్రం జంకకుండా వీలు చూసుకుని చెప్తాలే మేడం టూ నవ్వింది.నాకైతే ఏదో ఘనకార్ సాధించినట్టు లోపల ఒకింత గర్వం.అల్ప సంతోషులు కదా మా ఆడవాళ్ళు.

   అనుకోకుండా స్ట్రైక్ చేయడానికి స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు బడికి వచ్చారు .చిన్న సాకు దొరికితే చాలు ఠపీమని స్టూడెంట్ ప్రతాపం చూపిచ్చేస్తారు కదా!చేసేదేమీ లేక పిల్లలనొదిలేశాం ఇళ్ళకు.మేముండాల్సిందే కదా అని మా స్టాఫ్ అంతా పెండింగ్ రికార్డ్స్ ముందేసుకుని పిచ్చాపాటి బాతాఖానీలో మునిగిపోయాం.సరిగ్గా అప్పుడే ఇంటికెళ్ళిన వెధవ రాకేష్ గాడు పరుగెత్తుకొచ్చి టీచర్ !మాయమ్మ వస్తాదంట నీతోన మాట్లాడనీకి .భాడి యాసలో ఆయాస పడుతూ చెప్పాడు.ఏరా!మీ నాయన లేడా ఇంట్లో అన్నాను.మా ఇంట్లో లేడు,మాయవ్వింట్లో వుంటాడు టీచర్ అనేసరికి ఓహో అందుకే వస్తానందా అనుకున్నాం మా స్టాఫంతా.

  కాసేపట్లో ఓ చిన్నబకెట్ పట్టుకుని నమస్తే మేడమోళ్ళందరికీ అంటూ వచ్చింది రూప హుషారుగా.

 ఏం రూపా చాలా జోరుమీదున్నావు,ఏంటి విషయం అన్నాను మరత ఉత్సాహపరచాలని.

 అదేంలేదు మేడం,మీతోన మాట్లాడినకాడి నుంచి బాధ ను కొంచెం మరచిపోగలుగుతున్నాను మేడం.నవ్వడం కూడా నేర్చుకున్నాను.మా పిల్లలతోన గూడా సంబరంగా గడుపుతుండాను.నా మొగుడు బొంబాయి పోయినాడు.నేల వరకు రాడు మేడం.అందుకే సూడు ఈ ఉసారంతా.ఇందా మే మీకోసరం వేడివేడి టీ కాచినాను.తాగండి మేడం అంటూ నా చేతికిచ్చింబి టీ బకెట్ ను.

  ఓహో !అదన్నమాట అసలు విషయం.నీ మొగుడు ఊళ్ళో లేడనా ఈ ఆనందం.అబ్బో చానా మార్పు వచ్చింది రూపా నీలో.చూడు అలా నవ్వుతా వుంటే ఎంత బాగున్నావో!నీ మొహం ఎంత కళగా వుందో చూడు.పిల్లలు కూడా చురుకుగా వుంటారు .నీవు మూడీగా వుంటే పిల్లలు కూడా డల్ గా తయారవుతారు తెలుసా! అంటూ హితోక్తులు మొదలు పెట్టాను నేను.


నిజమే సూడు మేడం,నాకెవరూ ఇట్లా సెప్పలేదు.నాకే కొత్తగా వుందిపుడు.మరచిపోయిన ఆనందం మళ్ళీ నా మొగంలో కానొస్తుందని మాయమ్మ కూడా మీలాగే అనింది సూడు మేడం.అనవసరంగా బాధ పడుకుంటూ కుళ్ళిపోయినాను ఇన్ని రోజులు.మీరు నవ్వుకుంటూ మాట్లాడుతుంటే నాక్కూడా నవ్వుతా మాట్లాడాలనిపించింది మేడం.నిన్ను మాత్రం మా ఇంట్లో అందరం భలే తలుస్తాం సూడు మేడం చేతులూపుకుంటూ చెప్పుకొచ్చింది .


 మీ అమ్మంటే నూకాలమ్మ కదా!మీ ఇంట్లో గొడవ జరిగినపుడు ఆమె గొంతే ఎక్కువ వినిపిస్తుంది.అత్తా అల్లుళ్ళ గొడవ మా బడి గోడలు దాటి రోడ్డున పడేవి.ఎందుకంత ఆవేశం రూపా వాళ్ళకు.అంతలా గొడవ పడే సీరియస్ మ్యాటరేముంటుంది.పిల్లలు భయపడరా?వీధిలో వాళ్ళకు అలుసవుతారు కదా! అంటుండగానే రూప కళ్ళలో కాలువలు పారాయి.మా స్టాఫ్ అయ్యో పర్సనల్ విషయాలడిగి ఎందుకేడిపించడమని నన్ను దండించారు.రూప నేను లేచి నా క్లాస్ రూంకు వెళ్ళాం.రూప తన బాధను స్వేచ్ఛగా చెప్పాలంటే ఎవరూ వుండకూడదనీ లేచి వచ్చాము.

   రూపా!ఇప్పుడు చెప్పు.నీ మనసులో బాధను బయటికి కక్కేసెయ్ .భారాన్ని దించుకో.నేనేమైనా నీ విషయంలో సహాయం చేయగలనేమోనని ఇంతలా అడుగుతున్నాను.నమ్మకమనీపిస్తేనే నాతో నీ గుండెలోని గాధను చెప్పుకో సరేనా రూపా! బల్ల మీదున్న తన రెండు చేతులను నా చేతుల్లోకి తీసుకుంటూ అడిగాను.స్పర్శ మనిషికి చాలా ఓదార్పునిస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ .

  వెంటనే రూప నా చేతులను గట్టిగా అదిమి పడుతూ"మేడం నాలాంటి నరకం ఎవరికీ రాకూడదు.దేవుడు నన్ను నా పిల్లలను సిన్న సూపు సూసినాడెందుకో సూడు మేడం" అంటూ భోరున విలపించసాగింది.ఆపడం నా తరం కాలేదనుకోండి.కాసేపు ఏడవనిచ్చాను. ఏడిస్తే సగం భారం తగ్గుతుందని నాకు అనుభవం.

 కాసేపటికి తనే తమాయించుకుని "ఏమనుకోకు మేడం.నాకు ఏడుపాగలేదు.నామొగుడు సేసిన పనికి దేవుడు మాకు సిచ్చేసినాడు.నేనంటే పెళ్ళాన్ని కదా,సరేననీ భరిస్తాను.కానీ అన్నెంపున్నెమెరుగని నా పిల్లలక్కూడా సిచ్చేసినాడు మేడం.అదే నా బాధంతా.పిల్లలను సూసి నేను,నన్ను సూసి మాయమ్మ గొల్లుమంటాము.ఆ దొంగ సచ్చినోడు నాకు మేనమామ అవుతాడు.మా నాయనకు మా మామంట సానా ఇట్టముండేది మేడం.ఇద్దరూ తాగుబోతోళ్ళు కదా!జత బాగా కుదిరిందని నాకిచ్చికట్టబెట్టాడు.తాగీతాగి మానాయన సచ్చిపాయ మేడం.ఈ సచ్చినోడు నాపాలికి పడి నన్ను యేపుకు తింటున్నాడు.ఎప్పుడు సావొత్తాదా అని ఎదురు సూత్తున్నా "వలవల ఏడ్చేసింది.

  అదేం మాట రూపా!చావనేది మనం కోరుకుంటే రాదు.అదొచ్చినప్పుడే మనం పోవాలంతే.మన అవసరం ఇంకా వుంది కనుకనే మనమింకా భూమ్మీదున్నాము.ఇంకెప్పుడూ అలా మాట్లాడకు అంటూ ఓదార్చాను.


 అవును మేడం,అదీ నిజమేనేమో.లేకపోతే ఈ మాయదారి రొగమొచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా బతికున్నానంటే నా పిల్లలకు నా అవసరమున్నాదనేనేమో?కాస్త స్థిమితంగా చెప్పింది రూప.

  రూపా!రోగమేంటి?నాకేమీ అర్థం కాలేదు.వివరంగా చెప్తావా అనేసరికి కాస్త బెరుకుగా చూసింది.అహా.. అది కూడా నీకభ్యంతరం లేదంటేనే చెప్పు భుజం తట్టి చెప్పాను.

  మేడం మీతో చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను.ఆ సచ్చినోడు ఇంటిని నడపడానికి దొరికిన పని ఏదో ఒకటి చేసేవాడు.కానీ వచ్చిన కూలీనంతా ఇంటికీ వచ్చే ముందు ఫుల్లుగా తాగి డబ్బులన్నీ తాగుడుకే తగలెట్టెటోడు.ఇక్కడుంటే తాగుబోతులోల్ల జత పట్టి ఇల్లంతా గుల్ల చేసేవాడని మా బంధువులు గుంటూరుకు సుగ్గికి పోతుంటే వాళ్ళెంట నా మొగుడు కూడా పోయోటోడు.బాగానే కూలీ వచ్చేది.రెండు నెలలు వుండి బాగానే డబ్బు తెచ్చేటోడు.పర్లేదులే మారాడని సంబర పడ్డామందరం. కానీ ఆ దేవుడికి కన్ను కుట్టిందో ఏమో, ఆ సంబరమంతా నాశనం చేసినాడు దొంగ సచ్చినోడు.అక్కడ చేసిన యవ్వారాలకు మాయదారి రోగం అంటించుకున్నాడు.నా ఖర్మ కాలి అది నాకు అంటించాడు మేడం తన రెండు చేతులలో తలను దాచుకుంది.

  రూపా!రూపా! కంట్రోల్ చేసుకోమ్మా.ఇలాంటప్పుడే కదా మనం ధైర్యంగా వుండాలి.నువ్వుండగలవు.నీ శక్తి నీకు తెలియదు రూపా!నువ్వు మానసికంగా బలవంతురాలివి అని ఓదార్చసాగాను నేను.


  అవును మేడం,అందుకేనేమో దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అంటూ గట్టిగా రోదించసాగింది రూప.

  అయ్యో!రూప ప్లీజ్ నిన్ను నీవు నిభాళించుకో.

ఇంతకీ నీవన్న రోగమేంటో నాకిప్పటికీ అర్థం కాలేదు.బహుషా నేను ఊహించుకుంటున్నది కాదు కదా!


 అదేదో అంటారు కద మేడం!ఊరిడిసిన బసివినిల దగ్గరకు పండనీకి పోతే వస్తాదంటారు సూడు!ఆ రోగమే !అదొస్తే పోదంట కదా మేడం.ఏకంగా పైకేనంట కద మేడం ఇంక చీర కొంగుతో వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకుంది రూప.

  అది విన్న నాకే గంగాదేవి ఆగమంటూ రెప్పల గట్లు తెంచుకుని పొర్లింది.ఎంత అమానుషం.తప్పు చేసినోడికి వచ్చింటే చెడు తిరుగుళ్ళు తిరిగాడు,తెచ్చుకున్నాడులే అని సరిపెట్టుకోవచ్చు.కానీ అన్యాయంగా భార్యకు అంటగట్టడం ఎంత ఘోరమైన విషయం.ఇప్పుడు రూప పరిస్తితేంటి మరి?తలచుకుంటేనే గుండెలదిరి పడుతున్నాయి.ఇలాంటి వెధవతో గొడవెందుకు పడుతున్నారో ఇప్పుడర్థమయింది.రూపను ఓదార్చే ప్రయత్నం చేస్తూ "దేవుడున్నాడు రూప!నీ కోసం ,నీ పిల్లల కోసం నువు ధైర్యంగా బతకాలి.వారికి మంచి భవిష్యత్తునివ్వడానికైనా తట్టుకుని నిలబడగలగాలి"అంటుండగనే నా మాటలకు అడ్డుపడింది.

  నేనూ అట్టాగే అనుకుని తమాయించుకున్నాను మేడం.మాయమ్మ బాధనైతే సూడలేకున్నా మేడం.నేనంటే పెళ్ళాన్ని ,సేసుకున్న పాపానికి అనుభవిస్తాను.కానీ...కానీ...అంటూ నీళ్ళు నములసాగింది రూప. 

   ఆ..కానీ..చెప్పు రూప అన్నాను ఆత్రంగా.

  అభం శుభమెరుగని పసిపిల్లలక్కూడా పాకింది మేడం ఆ రోగం తల బాదుకుంది.

  ఆ మాటలకు షాక్ తో "హా"అని నోరెళ్ళబెట్టడం నా వంతయ్యింది.ఏమంటున్నావు రూప!నీ పిల్లలకా!అదెలా!ఛా...నమ్మలేకున్నా.నువ్వు జోక్ చేయడం లేదు కదా!అయినా ఇలాంటి విషయాల్లో జోక్ లేయడమా!అహా..నేనే పొరపాటుగ విన్నానా?నాలో నేనే గొణిగాను.


అది విన్న రూప!నాజమే మేడం మీరు కరెక్ట్ గానే విన్నారు.మొదట్లో మేము కూడా అబద్దమయితే బాగుండునని అనుకున్నాము.తీరా మెడికల్ చెకప్ లో తేలింది. ఆరా తీస్తే తీరా తేలిందేంటంటే ఆ దొంగ సచ్చినోడికి పెండ్లికి ముందే ఈ మాయదారి రోగముందని తెలిసింది.అన్నాయంగా నా గొంతు కోసార మేడం మా నాయనోళ్ళు లబోదిబోమంది రూప.


ఎంత ఘోరం.పెద్ద మనుషులేనా వాళ్ళసలు.ఒక ఆడపిల్ల అందులోను కూతురి విషయంలో ఇంత నిర్లక్ష్యమా?తిడుతూ వుంటే మధ్యలో అందుకుంది రుప.


ఆళ్ళక్కూడా ఈ రోగం గురించి ఈ మధ్యనే తెలిసింది మేడం.అసలిసయం సెప్పనా మీకు.ఈ రోగముందని ,అది వచ్చిందని నా మొగుడిక్కూడా తెలియదంటే నమ్ముతారా మొడం మీరు కళ్ళు తుడుచుకుంటూ మొగుడి బాగోతం బయట పెట్టింది.


 అవునా!ఇదేంటి రూప?రోగముందని తెలీకపోవడమేంటి?నేను నమ్మను అని ఘంటాపథంగా చెప్పాను.

 నిజమేలే మేడం తెలీదంట ఆడికి.నాతోన గూడా ఇదే అన్నాడు.అమాయకంగా మొగుణ్ణి వెనకేసుకొచ్చింది.నాకొళ్ళు మండింది.

 ఆహా!ఆయన గారు చెప్పడమూ,తమరు నమ్మడమూనా!అమ్మాయిల దగ్గరకెళ్ళినపుడు అదే నీ భాషలో ఆ పాడు పనులకెళ్ళినప్పుడు లేదంటనా ఈ అమాయకత్వం.అమాయకుడే అయితే అంత ఘనకార్యమెలా చేశాడంటావ్ ?ఇదంతా తప్పు కప్పిపుచ్చుకునేందుకు మగాడు ఆడే నాటకాలు.ఆడికేం బాగానే వున్నాడుగా,మీరే నాశనమయ్యేదిప్పుడు.రూప నే చెప్పొచ్చేదేంటంటే ఇప్పుడైనా మేల్కో.స్వార్థంగా ఆలోచించు.నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకూడదంటే నే చెప్పినట్టు వింటావా? సీరియస్ గా చెప్పాను .

 ఖచ్చితంగా మేడం.అందుకే కదా నా గోడంతా మీకు సెప్పింది.మీరే ఏదన్నా దారి సూపండి.నాకేం చేయాలో తెలియక మాయమ్మ నేను రోజూ దిగులు పడుతూ పిల్లల మొగాలు సూసుకుంటూ కాలమెళ్ళదీస్తున్నాం మేడం. నలుగురి ముందు నవ్వుల పాలయ్యాము. నిన్ను సూసినాక నాకు కొంచం ధైర్యమొచ్చింది.ఎందుకో బతుకు మీద ఆసొచ్చింది.మీరైతే ఏదో ఒక దారి సూపిస్తారని అనిపించింది మేడం నా రెండు చేతులను పట్టుకుని వేడుకుంది.

  సరే ఆలోచిద్దాంలే .చింతించకు.మనోబలమే నీకు రక్ష.రేపు కలుద్దాం.పిల్లలకు తెలుసా రూప వాళ్ళకు ఈ రోగముందని అడగాలనిపించి ఆగిపోయాను.ఎందుకంటే అపుడపుడు నూకాలమ్మ బడి దగ్గరకొచ్చి పిల్లలు మాతరలు ఏస్కోవడం మర్సిపోయారమ్మ.బేగ పంపిత్తాను మళ్ళా.అని అంటుండేది.దీన్ని బట్టి తెలుసనే అనిపించింది.కానీ పసిపిల్లలు కదా అదంటే ఏంటో ఎందుకొచ్చిందో కూడా తెలీదు.ఒక్కసారిగా ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళలో మెదిలారు.తెలీకుండానే మందులు మింగడం,మాయమవని ఆ స్వచ్ఛమైన నవ్వులు అలాగే వందేళ్ళు వుండాలనిపించింది.రాత్రంతా నిదరే రాలేదు.ఏదోలా సాయం చేయాలనిపించింది. ఈ విషయం మా ఇంట్లో చెప్పానా ఇంక ముడో ప్రపంచ యుద్ధమే.బడికి వెళ్ళామా డ్యూటీ చేశామా అన్నట్టుండాలని క్లాస్ పీకుతారు.ఆలోచిస్తూ నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాను.

  పాఠం చెబుదామని పుస్తకం తీస్తే రాకేష్ కనిపించాడు పేజీలో.ఏదైనా ఒకటనుకున్నానంటే అది పూర్తి చేసే వరకు మనసు నిమ్మళంగా వుండదు కదా ఏవరికైనా.సరేనని పిల్లలకు పాఠం చెప్తూ కిటికి వైపు కూడా గమనించసాగాను.రూప కనిపించగానే ఓ సన్ననినవ్వు విసిరాను.ఆమె మొహం బాధకు సంతోషానికి మధ్య వెలిగిపోతుందనిపించింది.సమయం కోసం వేచి చూశాను.

  భోజన విరామ సమయంలో గబగబ తినేసి తిన్నగా రాకేష్ ఇంటి వైపు అడుగులేశాను.చుట్టు వున్న అమ్మలక్కలు నా వైపు వివిధ అర్థాలతొ కూడిన చూపులు విసిరారు .మేడమేంటీ ?ఈ ఇంటివైపు వెళ్ళడమేంటని ఓ చూపు.ఛీఛీ ఇట్లాంటి మచ్చ పడిన మనుషులుండే ఇంటికి ఈమెకేం పని అని ఓ చూపు..ఇలా రకరకాలుగా అన్నమాట.అన్ని చూపుల వైపు నేనూ ఓ చూపు చూశాను అంతే!నేరుగా రూప అనుకుంటూ ఇంట్లోకే సరాసరి వెళ్ళాను.నన్ను చూసిన నూకాలమ్మ గబగబ వచ్చి కుర్చీ చూపిస్తూ రండి మేడమూ,కూర్సోండి రూప వస్తదిప్పుడే అన్నది.

 బయటనుండి వచ్చిన రుప నన్ను చూసి ఆశ్చర్యంతో మేడం నువ్వేంటి,మా ఇంటికీ రావడం..నమ్మలేకున్నా.శానా సంతోషంగుండాది మేడం .నేనే వచ్చేదాన్ని గద పిలిస్తే .సూసినోళ్ళు నిన్నేమన్న అనుకుంటారేమొ గద మేడం,ఏంటికొస్తిరి ?సతమతమవుతున్న రూప బాధ నాకర్థమయింది.

  రూప అలాంటిదేం ఆలోచించకు.అందరికీ నేను సమాధానం చెప్పుకోగలనులే.టీచర్లకు సవాలక్షల పనులుంటాయి ఉర్లలో.సర్వేలని,పేరెంట్స్ మీటింగ్ లని ఊళ్ళలో ఇంటింటికీ తిరిగే పనులే ఎక్కువ.పైగా అందరితొ నవ్వుతూ పలకరిస్తుంటే ఎవ్వరి మనసుల్లోను అపార్థానికి చోటుండదు.అదంతా నేను మేనేజ్ చేసుకోగలనులే.నాగురించి బెంగ పడకు.నాకు సమయం లేదు.బెల్ కొట్టేలోపు వెళ్ళిపోవాలి నేను.


 అసలు విషయానికొస్తే రూప పదవ తరగతి పాసయ్యావని అన్నావు కదా.నేనొక చోట పని ఇప్పిస్తాను చేయగలవా?ఏ పనైనా చేయగలగాలి నువ్విప్పుడు.ముందు సమాజంలో నీకంటు ఒక స్థానముండాలి.అపుడే నీ వైపు జాలిగా,ఏవగింపుగా చూసే వారి దృష్టి మారుతుంది.నువ్వు కూడా పనిలో నిమగ్నమైతే నీకుండే బలహీనతలను మరచిపోగలవు.భవిష్యత్తు మీద ద్యాస వుంచగలవు.నీకొచ్చిన రోగమేమి కొత్తదికాదు.ఆ రోగానికి మందు నీ మనసే.ఆ మనసును మరింత ధృఢంగి మార్చుకోవాలి.నిన్ను అవమానించిన వారికి నువ్వే సమాధానంగా నిలవాలి.అప్పుడే నీకు నీ పిల్లలకు మంచి భవిష్యత్తుంటుంది.నాకు తెలిసిన డాక్టరు వున్నారు.వారితో మాట్లాడాను.మీ ఊళ్ళోనే అంటే ఇదే ఊళ్ళోనే నిన్ను ఆశా వర్కర్ గా చేర్చుకుంటామన్నారు.నువ్వు అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే నిన్నిక ఎవరూ వేలెత్తి చూపరు.నువ్వు నీ పిల్లలు మెడిసన్ తప్పక రెగ్యులర్ గా వాడాలి.కష్టిలొచ్చాయని క్రుంగిపోతూ కూర్చుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.సో థింక్ పాజిటివ్ .బీ స్ట్రాంగ్ .ఒకేనా !మరి వెళ్ళిరానా అన్నాను.సడన్ గా నూకాలమ్మ నా కాళ్ళు మొక్కడానికొచ్చింది.అయ్యయ్యో పెద్దవారు అని తప్పుకున్నాను.అది కృతజ్ఞతాభావమని అర్థం చేసుకుని అడుగు బయట పెట్టాను.అదోలా చూస్తున్న చూపులను గమనించి అమ్మలక్కలను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలుసుగా నాకు.ఏం లక్ష్మి పనయింబా?రంగమ్మ మీ వాడు అల్లరెక్కువయింది ,భయం పెట్టాలనీకున్నాను,మళ్ళీ కంప్లైంట్ తీసుకురాకూడదు బడికాటికి అంటూ అందరినీ పలకరించాను.అంతే మామూలుగా మాట్లాడేశారు.

  అప్పుడప్పుడు బళ్ళో జరిగే హెల్త్ క్యాంపుల వల్ల వచ్చే హెల్త్ డిపార్ట్ మెంట్ భాళ్ళతో పరిచయాలు వుండడం వల్ల ఈ సహాయం చేయగలిగాను .అందుకేనేమో మనుషులతో సత్సంబంధాలు కలిగి వుండాలంటారు.ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు ఎవరితో ఏ అవసరమొస్తుందో కదా!విధాత ఆడే వింత ఆటలో ఎవరికేం అభసరమొస్తుందో మరి.అందుకే నా కలుపుగోలుతనమే ఇలా సహాయం చేయడానికి తోడ్పతూ వుంటుంది మరి.ఈ సారి హెల్త్ వాళ్ళతో కలిసి ఎయిడ్స్ పై అవగాహనా ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాను.సమయం రానే వచ్చింది.పిల్లలతో ప్లేకార్డ్స్ రాయించి నినాదాలు పలికించాను.వీధుల గుండా ర్యాలీ వెళుతుంటే ఇళ్ళళోని వారు చూస్తూ,సందేహాలు సంధిస్తూ ,అనుమాననివృత్తి చేస్తూ సాగిపోయింది.

  రూప తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ,కమ్మినదిగులు మబ్బులను నలుగురితో కలిసి కలుపుగోలుతనంతో కాస్త మరవసాగింది.తన కొత్త జీవితాన్ని ఆనందంగా సాగిపోతుందని కృతజ్ఞతగా అపుడపుడు కాఫీ బకెట్ తో వచ్చి నాతో అనుభవాలను పంచుకోసాగాంది.తనలో వచ్చిన మార్పు చూశాక నా మనసుకు చెప్పలేని ఆనందం.సాయమంటే డబ్బు ఇవ్వడమేనా?నా దృష్టిలో జీవితాన్ని మలుపు తిప్పే మాటసాయం కూడా పెద్ద సహాయమే అనిపించింది.ఇది కూడా ఎన్నో కోట్ల సంపద దానమిచ్చినా దక్కని ఆనందమే అనిపించింది నాకు.బతుకు పుస్తకంలో నలుగురికి చెప్పుకోడానికి నాకంటూ ఇలాంటి పేజీలను రాసుకోవడం అలవాటయిన దాన్ని.ఆ తృప్తి సంతోషం మరెందులోనూ దక్కదనిపించింది.హమ్మయ్య మనశ్శాంతిగా నిద్రపోగలిగాను రూప ను తలుచుకుంటూ.


 ఇలా రోజులు గడుస్తున్నాయి.బడికి వేసవి సెలవులు వచ్చాయి.తిరిగి సెలవులయ్యాక బడికెళ్తే తెలిసింది పిడుగులాంటి వార్త.అదే వున్నట్టుండి రూప ఈ లోకం విడిచి వెళ్ళిందని.నమ్మలేక పోయాను.కాని అదే నిజం.నూకాలమ్మను పరామర్శిద్దామని వెళ్ళాను.ఆమె కళ్ళు ఎడారిని తలపించాయి.మానసికంగా రూప లేని విషయాన్ని నెమ్మదిగా జీర్ణించుకుంటుంది.ఆమెను డిస్టర్బ్ చేయాలనిపించలేదు.వెనక్కి వచ్చేశాను.రుప పక్కింటావిడ లక్ష్మి వచ్చి "సూడు మేడం రోగమొచ్చినోడు బండరాయిలక్క బాగానే వున్నాడు.అన్నాయంగా రూపమ్మేమో బలయిపాయె.ఆ సచ్చినోడు పత్తా లేకుండా పోయేడు పెళ్ళాం సచ్చిందని కూడా సూడనీకి రాకపాయె.ఆడి జిమ్మడిపోను" తిడుతూ చెప్పింది.

  హెల్త్ క్యాంప్ వాళ్ళు వచ్చినపుడు డాక్టర్ ను అడిగాను రూప చావు గురించి .అదెలా ?రోగమున్న పేషెంట్ రూప భర్త బాగున్నపుడు రూప చావడమెలా సాధ్యమని. రోగ నిరోదక శక్తి తక్కువగా వున్నందున రూప కు అలా జరిగిందని చెప్పింది.ఎంత అన్యాయమిది అనిపించింది నాకు.బాధ పడడం తప్ప ఏం చేయగలను .రాకేష్ ను ఒకసారి తదేకంగా చూశాను.రూప నవ్వు మొహం కళ్ళ ముందు సాక్షాత్కరించింది.

మనసు పుట కథ 4 pl


Rate this content
Log in

Similar telugu story from Tragedy