Parimala Pari

Comedy

4.4  

Parimala Pari

Comedy

బామ్మ బాల్చీ తన్నేసింది

బామ్మ బాల్చీ తన్నేసింది

3 mins
511


బామ్మ బాల్చీ తన్నేసింది


ఓ సారి మా సుబ్బారావు మావయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సుబ్బారావు మావయ్య స్వయాన మా అమ్మకి తమ్ముడే. మావయ్యకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి 22 ఏళ్లు రాగానే పెళ్ళి చేయాలని నిశ్చయించాడు మావయ్య.


అనుకున్నదే తడవుగా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ మధ్యే ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ అట. అబ్బాయి ఒడ్డు, పొడవు బాగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, ఆస్తి పాస్తులు కూడా బాగానే ఉన్నాయి అని అనుకున్నారు.


సరే ఒకసారి అమ్మాయి, అబ్బాయి చూసుకుని నచ్చితే మిగతా మాటలు మాట్లాడుకోవచ్చు అనుకున్నారు.  రెండు రోజుల్లో వస్తామని చెప్పారట అబ్బాయి వాళ్ళు,

అందుకే ఆయనకి హడావిడిలో కాలు చేయి ఆడక, అక్క పక్కనే ఉంటే ధైర్యం గా ఉంటుంది అని అమ్మని రమ్మన్నాడు మావయ్య. అదే ఆ ఫోన్ సారాంశం.

మా వారు క్యాంప్ లో ఉండటం తో నేను అమ్మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా చిన్నూ తో.


మావయ్య మా అమ్మ కన్న రెండేళ్లు చిన్నవాడు. కానీ అక్క అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ, అక్క మాట అంటే ఎంతో గౌరవం ఉన్నాయి. అందుకనే ఇప్పటికీ మా అమ్మ ఏం చెప్పిన వింటాడు.


అక్క ఉంటే ఆయనకి కొండంత ధైర్యం. ఆయన భార్య మా అత్త అయిన రమ కూడా ఆయన మీద ఉన్న గౌరవం తో ఆయన మాట జవదాటదు. అందుకని ఆవిడ కూడా వదిన గారి మాటకు ఎంతో విలువ ఇస్తుంది.


మావయ్య తో పాటే ఉంటుంది మా అమ్మమ్మ కూడా.

అందుకనే అడపాదడపా మా అమ్మ కూడా వెళ్లి వాళ్ళకి అది ఇది అన్ని చెప్పి, వాళ్ళ అమ్మని చూసి వస్తూ ఉంటుంది. మావయ్య పెళ్ళి చూపులకి రమ్మని చెప్పేసరికి అమ్మ కి సంతోషం ఆగలేదు.

నాకు ఇంట్లో పని ఉందని రాను అన్నాను నేను. వెంటనే నా కొడుకు చిన్నూ గాడిని తీసుకొని వెళ్ళింది.


పెళ్ళి చూపుల్లో అబ్బాయి నచ్చాడు, అబ్బాయి వాళ్లకి అమ్మాయి నచ్చింది. మిగతా విషయాలు అన్ని మాట్లాడుకున్నాక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకుందాం అనుకున్నారు.

అమ్మ మర్నాడు బయలుదేరి వచ్చేసింది.


నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇంకో పది రోజుల్లో నిశ్చితార్థం అని తెలిసి, ఆ పనుల్లో పడిపోయారు మావయ్య వాళ్ళు. రెండ్రోజుల ముందే అమ్మని రమ్మని గోల. సరే వస్తాం అంది అమ్మ.


రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది మావయ్య దగ్గర నుంచీ, అబ్బాయి వాళ్లకి అంతకన్నా మంచి సంబంధం ఏదో దొరికిందట మావయ్య వాళ్ళతో పెళ్ళి కేన్సిల్ చేసుకున్నారు.

అమ్మకి ఫోన్ చేసి చాలా బాధ పడ్డాడు మావయ్య. అమ్మ ఊరుకోపెట్టింది, ఇది కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుంది అని.


ఇంకో వారం రోజులకీ మావయ్య దగ్గరి నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది.

ఫోన్ లో మావయ్య

"అక్కా, ఎందుకు అక్క ఇలా జరుగుతుంది, నాకేదో భయంగా ఉంది. మొన్నేమో దాని పెళ్ళి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు నిన్నేమో అలా అమ్మ చీకట్లో చూసుకోకుండా బకెట్ తన్నేసిందీ. నువు ఒకసారి రా అక్కా" అని అన్నాడు.


ఫోన్ ఎత్తిన చిన్నూ గాడు వెంటనే ఫోన్ పెట్టేసి, అమ్మా! బామ్మ బాల్చ తన్నేసింది అంట, మీ మావయ్యా అమ్మమ్మని రమ్మని అన్నాడు. అని చెప్పేసి గబగబా బయటకి వెళ్ళిపోయాడు.


ఆ వార్త విన్న అమ్మ శోకండాలు పెట్టేస్తోంది. అయ్యో అమ్మా, ఏమైందీ అమ్మా, మా అమ్మో అంటూ...

అప్పు ఆఫీస్ నుంచి వచ్చిన నాన్న ఏం ఏడుస్తూ ఉంటే చూసి, ఏమైందీ అని అడిగారు,

ఏమండీ, మా అమ్మ, నిన్న రాత్రే బాల్చి తన్నేసిందట, ఇప్పుడు చెప్తున్నాడు మా తమ్ముడు తీరిగ్గా, నన్ను రమ్మని, తొందరగా పదండి వెళ్దాం. అని కంగారు పెట్టేసింది.


ఇప్పుడా అసలు ఏమైందో నేను ఒకసారి మీ తమ్ముడికి ఫోన్ చేసి కనుక్కుంటా కదా అన్నారు.

నాన్న మాట వింటే కదా అమ్మ, మా అమ్మ పోయి అసలే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు మళ్లీ ఇప్పుడా అప్పుడా అంటూ ఫోన్లు చేస్తూ కూర్చుంటారా, అని ఏడుస్తుంది.


బయటకి వెళ్ళిన చిన్నూ గాడు, ఫ్రెండ్స్ అందరితోనూ చెప్తున్నాడు మా బామ్మ బకెట్ తన్నేసింది. నేను రేపు స్కూల్ కి రావటం లేదు అని.


అమ్మ ఒకటే గోల, ఏడుపులు రాగాలు తీస్తోంది ఇక్కడ. మా అమ్మ ఏడుపూ గోల చూడలేక వెంటనే మా అందర్నీ బయలుదేరి దీసారు మా నాన్న.

ఎలాగోలా ఏదో బస్ పట్టుకొని మావయ్య ఊరికి వెళ్ళాం. తెల్లారేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము.


లోపలకి వెళ్లి చూస్తిమి కదా, మా అమ్మమ్మ దర్జాగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది.


కాలికి కట్టు కట్టి ఉంది. మా అమ్మ "అమ్మా" అంటూ ఏడుస్తూ లోపలకి పరుగున వెళ్ళి, వాళ్ళ అమ్మని చూసి, నువ్వు ఇంకా బాగానే ఉన్నావు కదా, మరి తమ్ముడెంటి నువ్వు బాల్చీ తన్నేసావని చెప్పాడు.

ఎందుకురా అలా చెప్పావ్, అని మావయ్య వంక గుర్రుగా చూసింది అమ్మ.


మావయ్య నేనేం చేశాను అక్కా, అమ్మ రాత్రి చీకట్లో బకెట్ తన్నేసింది అని చెప్పాను, అంతే కదా అన్నాడు.


అప్పుడు తెలిసింది చిన్నూ గాడు ఏదో తెలిసి తెలియక "అమ్మమ్మ బకెట్ తన్నేసింది" అని చెప్పాడు అని...


ఒరేయ్, ఎంత కంగారు పెట్టేశావు రా నన్ను అంది అమ్మ.


నువ్వు మాత్రం వాడికి ఎమైనా తీసిపోయావా, అంతకన్నా ఎక్కువ కంగారు పెట్టించావ్ నన్ను, అందరినీను అన్నారు నాన్న...


ఓరి భడవా, అలా చెప్పావా? నేను అప్పుడే పోతాను అనుకున్నావా, నీ పెళ్ళి కూడా చూస్తాను, నేనే దగ్గరుండి మరీ చేస్తాను. నీపెళ్ళి...అన్నది మా అమ్మమ్మ.


వాడికి ఇదేమి తెలియక మొహం ముడుచుకున్నడు చిన్నూ గాడు.


అంతే అందరూ నవ్వేశారు....

సమాప్తం...


Rate this content
Log in

Similar telugu story from Comedy