ఉగాది
ఉగాది
నిదురలేవగానే పల్లె తలపు తలుపుతట్టింది
సూర్య కిరణాల తాకిడితో...
పువ్వుల పరిమళాలతో..
అప్పుడే తడచిన పచ్చిక వాసనతో...
లేగ దూడ అరుపులతో...
కల్లాపి చల్లిన ముంగిలితో
రంగ వల్లులతో..
శోభాయమానంగా వెలుగుతోంది... మా పల్లె...
కలలా ఉంది... ఊరి జ్ఞాపకం ...
ఎప్పుడో ఒకసారి చుట్టాలు ఇంటికి వచ్చి వెళ్లినట్లు...
ఊరుకెళ్లి..రావాల్సి వస్తుంది...
అప్పట్లో ముసల, ముతక.. బాగున్నావా అని అడిగేటోళ్ళు..
ఇప్పుడు మనిషికి మనిషికి మధ్యన
డబ్బు చెట్లు మొలచాయి...మహా వృక్షంలా మారి...
నువ్వెంత అంటే... నువ్వెంత అని పోటీపడి...
ఊరి గొప్పతనాన్ని దిబ్బలో కలిపేశారు...
అయినా కూడా... పుట్టిన ఊరంటే...మమకారం...
ఎంత కాదనుకున్నా... సహాయం చేసే నాలుగు చేతులు...
ఉన్నది... మా పల్లె లోనే...
ఇప్పుడు ఇక్కడ ఉంటున్నది మేడల్లో...
మనిషి జాడ మరచిన మర మనుషుల కీకారణ్యంలో...
ఎప్పుడు చూడు వాహనాల జోరు...
మనుషుల గోడు...
గజిబిజి బ్రతుకుల మాయా లోకం...
ఏ ఒక్కరూ... ఎవరి గురించి ఆగరు...
ఆగితే... మనిషిగా మారిపోతానని భయం కాబోలు...
ఇక పండుగ వాతావరణం వస్తే...
అన్ని కల్తీ మయం... మనిషి కల్తీనే గా...
ఈ ఉగాది కి జ్ఞాపకమొస్తుంది మా పల్లె...
ఇంటింటా తోరణాలు...
అందరి మోమునా చిరునవ్వు...
కొత్త బట్టలు...
కొత్త చింతపండు...
కొసరి మామిడిపండు...
కొత్త బెల్లం...
కొత్తగా వేప చిగురు...
అన్నీ కొత్తగా మొదలయ్యే ఉగాది... తెలుగు సంవత్సరాది...
షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి...
మానవ జీవితాన అన్ని రుచులు సరిసమానంగా ఉండాలని తెలియజేసే...పండుగే... ఉగాది...
మా పల్లెకు పోయి వచ్చేద... పండుగ చేసుకుని...
మళ్ళీ ఈ మరమనిషి కీకారణ్యంలోకి..
