Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kamala sri

Drama Horror Inspirational

4  

kamala sri

Drama Horror Inspirational

తిండిబోతు దెయ్యం

తిండిబోతు దెయ్యం

6 mins
329


// తిండిబోతు దెయ్యం//

సుభద్రా పురం లో భూషయ్య గారు భార్య చనిపోయాక, ఊర్లోని ఇంటిని ఎవరికైనా అద్దెకివ్వమని దూరపు బందువు చంద్రానికి చెప్పి కొడుకు వాసు తో పాటే పట్నం వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్య మీద బెంగతో చనిపోయాడు భూషయ్య.

కొన్నాళ్లకు రవి కుటుంబం ఆ ఇంట్లో అద్దెకి దిగింది. కొన్ని రోజులు ఉన్నాక ఏం జరిగిందో ఏమో చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత చాలామంది వచ్చి ఎన్ని రోజులూ ఉండకుండా వెళ్లిపోయేవారు కారణం కూడా చెప్పకుండానే.

ఆ తరువాత ఆ ఇంట్లో అద్దెకు దిగారు ఆ ఊర్లోని స్కూల్లో టీచర్ గా పనిచేసే రాఘవ, అతని కుటుంబం.

“ఇల్లు బాగుంది రాఘవా. తక్కువ అద్దెకు మంచి ఇల్లు దొరికింది రా.”అన్నాడు రాఘవ తండ్రి రామయ్య.

“అవును నాన్నా. ఇల్లు కావాలని చెప్పగానే స్కూల్లో గుమస్తాగా పనిచేసే చంద్రం తమ దూరపు బంధువుల ఇల్లు ఖాళీగా ఉందని చెప్పాడు. చూడగానే ఇల్లు నచ్చి అడ్వాన్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుని వచ్చేశాను. ఏమోయ్ శ్రీమతి గారూ తమరికి నచ్చిందా ఇల్లు?.” అన్నాడు అప్పుడే టీ ఇచ్చిన భార్య వాసవికి.

“చాలా బాగుందండీ. నా కంటే మన పిల్లలకి చాలా నచ్చింది. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలం లో చక్కగా ఆడుకోవచ్చని ఎంత సంబరపడిపోతున్నారో. ఇన్నాళ్ళు ఇరుకిరుకు గదుల్లో ఉండేవాళ్లం, పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ అయ్యింది మంచి ఇల్లు దొరుకుతుందా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో. కానీ అన్ని సధుపాయాలు కలిగిన ఇంత మంచి ఇల్లు దొరుకుతుంది అని అని అస్సలు అనుకోలేదు.” అంది వాసవి.

“అవును రాఘవా ఇంత పెద్దిల్లు మరీ ఐదు వేల బాడుగ కి ఇచ్చారు. దీనివెనుక ఏదైనా కారణం ఉందేమో అనిపిస్తుంది రా.” తన అనుమానం వెళ్లగక్కింది రాఘవ తల్లి లక్ష్మి.

“అమ్మా! నీకన్నీ అనుమానాలేనే. అలాంటిదేమి ఉండి ఉండదు అమ్మా.లేనిపోని భయాలు పెట్టుకోకుండా ఉండు.నాన్నా నేను స్కూల్ కి వెళ్లొస్తాను. పిల్లల్ని కూడా రెడీ చేయు వాసవీ, టైమ్ అవుతుంది.” అని తను రెడీ అవ్వడానికి వెళ్లాడు రాఘవ.

రాఘవా, పిల్లలు స్కూల్ కి వెళ్లాక వాసవి వంట ముగించి సామాన్లు సర్దే పనిలో పడింది. ఆమెకి లక్ష్మి కూడా సహాయం చేస్తుంటే రామారావు మంచం పై నడుం వాల్చారు. మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోవడం తో అత్తయ్యా పదండి భోజనం చేద్దురు, పనిలో పడి సమయం దాటిపోయింది అని చూసుకోలేదు.


"మామయ్య గారు షుగర్ టేబ్లేట్స్ వేసుకోవాలి. పదండి.” అంటూ కాళ్లూ, చేతులూ కడిగి వంట గదిలోకి వెళ్లింది.


అక్కడ వార్పు ఎత్తి ఉండటంతో "ఇదేంటీ వార్పు ఎత్తి ఉంది. ఎవరు ఎత్తారు?. మావయ్య గారికి ఆకలేసి తినేసి ఉంటారా? కానీ మేము వడ్డించకుండా తినరు కదా? నేనే ఎత్తేసి మర్చిపోయి ఉంటాను." అనుకుని రామారావు గారికీ, లక్ష్మి కీ వడ్డించింది. వారి భోజనాలు ముగిశాక తను కూడా తిని పిల్లల బట్టలు, బొమ్మలూ ఓ గదిలో సర్దిపెట్టింది.

************

రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో వండే వంటల్లో అన్నం, కూరలు తగ్గడం, రాత్రి మిగిలిన అన్నం ఉంచి ఉదయం పోపు పెట్టాలని చూస్తుంటే ఆ అన్నం లేకపోవడం గమనించింది వాసవి. అదే విషయాన్ని రాఘవ కి చెప్పింది.

“నీవన్నీ అనవసరమైన అనుమానాలు వాసవీ. రాత్రి అన్నం ఉంచాను అనుకుని మర్చిపోతున్నావేమో?.” అన్నాడు రాఘవ.

“లేదండీ ఒక్కరోజు అయితే మర్చిపోయాను అనుకోవాలి. కానీ రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రీ నేను వండే వంటల్లో కాస్త తగ్గుతుంది. ఎవరో కావాలని తీయడమో లేక ఇంకేదైనా?.” అంది వాసవి.

“అంటే భోజనాన్ని ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని అనుకుంటున్నావా?. అన్నం ఎవరైనా దొంగతనం చేస్తారా?. ఇది చెప్తే ఎవరైనా నవ్విపోతారు.” విసుగ్గా అన్నాడు రాఘవ.

“నేను అంటున్నది ఎవరో దొంగతనం చేశారని కాదండీ. ఇంట్లో ఏదైనా దెయ్యం ఉందేమో, అదే ఇలా తినేస్తుందేమో?.” అని తన అనుమానం వెళ్లగక్కింది వాసవి.

“ఈ కాలం లో కూడా దెయ్యాలు, భూతాలూ అంటావేంటి వాసవీ చదువుకున్న దానివి అయ్యుండి. పోనీ ఉందే అనుకుందాం మనుషుల్ని భయపెట్టడమో, లేక పగతో రగిలిపోయి తన చావుకి కారణం అయిన వారిని చంపేయడమో చేస్తుంది. అంతేకానీ అన్నం తినేయడం చేస్తుందా?. నీదంతా ఉత్తి అనుమానం. ఈ మాట కానీ అమ్మ దగ్గర అన్నావా ఏంటీ? మళ్లీ ఆ పూజలు, ఈ హోమాలు అంటుంది, లేదా ఇళ్లే ఖాళీ చేసెయ్యమంటుంది. ఇప్పటికిప్పుడు ఇంతమంచి ఇల్లు దొరకమన్నా దొరకదు. లేనిపోని ఆలోచనలు మాని ప్రశాంతం గా పడుకో.” అని తను పడుకున్నాడు రాఘవ.

“మీకు ఎన్ని చెప్పినా వినరని నాకు తెలుసు. అందుకే ఈ రోజు కాస్త అన్నం ఉంచాను పొద్దున పోపుపెట్టడానికి. అది ఉదయానికి ఉండదు. అప్పుడు నమ్ముతారు మీరు నా మాటలు.” అని అటు తిరిగి పడుకుంది వాసవి.

అర్ధరాత్రి అవుతుండగా ఏదో చప్పుడు కి మెళుకువ వచ్చింది వాసవికి. “ఏమండీ ఏదో చప్పుడు అవుతుంది. ఆ దెయ్యమే వచ్చుంటుంది.” అంది వాసవి.

“అబ్బా! అర్ధరాత్రి మద్దెల దరువెంటీ వాసవీ. నిద్దట్లో ఏదో కల కనుంటావు. పడుకో.” అన్నాడు కళ్లుతెరవ కుండానే.

“లేదండీ. వచ్చింది దెయ్యమే. వెళితే తెలుస్తుందిగా పదండి.”అని మళ్లీ అనడం తో ఇంక లేవక తప్పలేదు రాఘవకి.


వాళ్లు వంట గది దగ్గరకి వెళ్లేసరికి గిన్నె కింద పడి ఉంది. “చూశారా దెయ్యం వచ్చి తినేసి వెళ్లిపోయింది. ఈ ఇంట్లో దెయ్యం ఉందండీ అని ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు.” అంది భయం గా.

"హే గట్టిగా అరవకు అమ్మవాళ్లు, పిల్లలు లేస్తారు.” అని చుట్టూ చూశాడు.

"వాసవీ ఈ సమయం లో వంట గది దగ్గర ఏం చేస్తున్నారు మీ ఇద్దరూ?.” అంటూ వచ్చారు రామారావు, లక్ష్మి.

“అదీ...అమ్మా మరీ...” అని రాఘవ నసుగుతుంటే, "అత్తయ్యా మనీంట్లో దెయ్యం ఉంది. అది రోజూ వంటగదిలో దూరి భోజనం చేసి మాయం అవుతుంది.”అంది వాసవి భయం గా.

“ఆయ్ తిండిబోతు దెయ్యమా. యూట్యూబ్ లోని కథల్లో లా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? మేమిప్పుడే ఆ దెయ్యాన్ని చూడాలి.” అన్నారు అలికిడికి లేచిన పిల్లలు కూడా.

“రేయ్! దెయ్యం లేదూ, ఏమీ లేదూ, మీరెల్లి పడుకోండి.” అన్నాడు రాఘవ కోపం గా.

“అబ్బా! నాన్నా దెయ్యాన్ని చూసి మేమేం జడుసుకోములే. దెయ్యాన్ని లైవ్ లో చూశామని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాము. పదండి నాన్నా దెయ్యం ఎక్కడ ఉందో చూద్దాం.” అంది కూతురు శశి.


“అసలు అది దెయ్యమో, లేక దొంగో వెళ్లి చూద్దాం.” అని రాఘవ అనడం తో ఇల్లంతా వెతికారు అందరూ.

అలా వెతుకుతున్నప్పుడు స్టోర్ రూమ్ లో ఏదో అలికిడి అవ్వడం తో అటుగా వెళ్ళాడు రాఘవ. అతని వెనుకే వెళ్లారు అందరూ. ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్లి చుట్టూ చూశారు ఎవరూ లేరు.

“రేయ్ అది దెయ్యమేరా. తినేసి మాయం అయిపోయింది. ఇప్పుడు అర్ధం అయ్యింది ఈ ఇల్లు ఎందుకు ఇంత తక్కువ అద్దెకి ఇచ్చారో. దెయ్యాల కొంప కాబట్టి మనకి తక్కువ అద్దెకి ఇచ్చార్రా. ముందు మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోదాం రా. లేదంటే ఆ దెయ్యం మనల్ని చంపినా చంపుతుంది.” అంది లక్ష్మి.

“అబ్బా అమ్మా! ఆపుతావా.” అని అటూ ఇటూ తిరుగుతున్న రాఘవకి ఓ చోట గుల్లగా అనిపించడం తో అదేంటా అని చూస్తే దానికి ఓ కమ్మీ ఉంది. చేత్తో దాన్ని పైకెత్తాడు రాఘవ. కింద మెట్లు కనిపించాయి.

“ఈ ఇంట్లో ఇలా కూడా ఉందా?.”అనుకుంటూ కిందకి దిగిన రాఘవ ఆశ్చర్య పోయాడు. ఓ ప్లేట్లోని అన్నాన్ని గబగబా తింటున్నాడు ఓ ముసలాయన.

“అదిగో దెయ్యం. అక్కడ తిన్నది చాలక ఇక్కడికొచ్చి కూడా మేస్తుంది. ఇదే రోజూ మనింట్లోని అన్నాన్ని తినేస్తుంది.” అంది వాసవి.

“హేయ్ మేము దెయ్యాన్ని చూశామోచ్. ఈ విషయం మా ఫ్రెండ్స్ కి చెప్తామోచ్.” అంటూ అరుస్తున్నారు పిల్లలు.

“రాఘవా చూస్తుంటే తింటున్నది దెయ్యం లా లేదు రా. బ్రతికున్న మనిషిలా కనిపిస్తున్నాడు.” అన్నారు రామారావు.

“అవును నాన్నా. నాకూ అలానే అనిపిస్తుంది” అని నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లాడు రాఘవ. అలికిడికి తలెత్తిన అతను భయం భయం గా "నన్నేమీ అనొద్దు. నన్నేమీ చేయొద్దు.” అని భయం తో వణికి పోతున్నాడు.

కళ్ళు లోతుగా ఉన్నాయి. ఎముకలు వెన్నుకు అంటుకుపోయి చిక్కి శల్యమై పోయి ఉన్నాడు.


“మేము నిన్నేమి చేయము కానీ ఎవరు నువ్వూ? ఇక్కడికి ఎలా వచ్చావు. అసలు ఈ ఇంట్లో ఇలాంటి ఓ గది ఉందని మాకు తెలీదు?.మరి మీకెలా తెలిసింది?.” అన్నాడు రాఘవ.

“ఎందుకంటే నేను ఈ ఇంటి ఓనర్ ని కాబట్టి. ఈ గది కట్టించింది నేను కాబట్టి.” అన్నాడు ఆ ముసలాయన.


“ఏంటీ మీరు ఈ ఇంటి ఓనర్ నా?.” ఆశ్చర్యం గా అడిగారు అందరూ.

“అవును నేనే ఈ ఇంటి ఓనర్ ని. నా పేరు భూషయ్య.” అన్నాడు ఆయన.

“కానీ మీరు చనిపోయారని అన్నారే.” అని రాఘవ ఏదో అనే లోపే “ఇక్కడ కాదు మనం పైకెళ్లి మాట్లాడుదాం.” అని పైకి నడిచారు రామారావు. అతని వెనుకే వెళ్ళారు అంతా.


“ఇప్పుడు చెప్పండి అసలేం జరిగిందో?.” అన్నాడు రాఘవ.


“నా భార్య చనిపోయాక ఒక్కడినే ఇంట్లో ఉండలేకపోతుంటే తనతో తీసుకువెళ్లాడు నా కొడుకు వాసు. వెళ్ళిన తరువాత కొన్ని రోజులు నా కొడుకూ, కోడలు భాగానే చూసుకున్నారు. తర్వాత వాళ్ల అసలు రంగు బయటపడింది. ఊర్లో ఉన్న ఆస్తి ని తమ పేర రాయమని చాలాసార్లు అడిగారు. నేను కాదనేసరికి కొన్ని రోజులు తిండిపెట్టడం మానేశారు. ఆ తర్వాత బలవంతం గా సంతకాలు పెట్టించుకుని హత్యాప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఎలాగో తప్పించుకుని ఊర్లోకి వచ్చేసి మా చంద్రం వాళ్లింటికి వెళ్లాలి అనుకున్నా.


కానీ వాడెక్కడ నా కొడుకూ కోడలికి చెప్పేస్తాడేమో అనే భయం తో ఇంట్లో ఉండేవాళ్లు గమనించకుండా ఈ గదిలోకి చేరుకుని ఎవరూ చూడని సమయం లో, రాత్రి పడుకునే టైమ్ లో వంటగదిలోకి వెళ్లి తినగా మిగిలినవి తినేవాడిని. కొన్ని రోజులకు వాళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.అప్పుడు ఆకలితో అలమటించిపోయేవాడిని. ఆ తరువాత ఇంకొకరు వచ్చేవారు మళ్లీ ఖాళీ చేసి వెళ్లిపోయేవారు. వాళ్లు ఉన్నన్నాళ్లు కడుపు కి కాస్తైనా అన్నం దొరికేది. వెళ్లిపోయాక ఆకలి భాదని తట్టుకోలేకపోయేవాడిని.

ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచాను.అలాంటి వాడికి నేను భారం అయిపోయాను. నా ఆస్తి తీసుకుని నన్ను చంపేయాలి అనుకున్నాడు.” అంటూ ఏడుస్తున్న భూషయ్య ని చూస్తుంటే భాద కలిగింది అందరికీ.

మరుసటి రోజూ చంద్రాన్ని పిలిచి భూషయ్య గారి విషయం చెప్పి ఊరి పెద్దలతో మాట్లాడి వాసుని రప్పించి చీవాట్లు పెట్టారు అంతా.

“కన్నతండ్రిని బ్రతికుండగానే చంపబోయావా. నిన్ను చంపినా పాపం లేదు.” అని చంద్రం కొట్టడానికి వెళ్లబోతే “వదిలే రా. ఎంతైనా వాడు నా కొడుకు కదా. ఇలా నా కళ్లెదుట కొడుతుంటే చూడలేను రా.” అని ఏడుస్తూ భూషయ్య అనేసరికి ఛీ కొట్టి వదిలేశారు.

భూషయ్య భాద్యతలు ఆ ఇంట్లో ఉన్నంత వరకూ రాఘవ కుటుంబం తీసుకుంది. చంద్రం రోజూ వచ్చి అతని బాగోగులు చూసుకునేవాడు. కొన్ని రోజులకు భూషయ్య కాలం చేశాడు...ఈసారి అతను దెయ్యం అవ్వలేదు.

Note:- ముసలితనంలో ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాలనుకోవడం, వృద్ధాశ్రమంలో విడిచి పెట్టాలని కానీ ఆలోచన చేయకండి.

వారి సంధ్యా జీవితమంతా ప్రశాంతంగా గడిచిపోయేలా చూసుకునే బాధ్యత వారి కన్నబిడ్డలదే.

అలాంటి కన్నబిడ్డలు కలిగిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు.

               ...కమల ‘శ్రీ’



Rate this content
Log in

Similar telugu poem from Drama