స్వప్నాల తేరు
స్వప్నాల తేరు
నేను నిశీధిలో విహరించే ఊహని, మనసు మాటున, కనురెప్పల చాటున కలల నావలో విహరిస్తూ కలలకు కాపు కాస్తూ ఉంటాను..
స్వప్నాల తేరులో మనసుకి ఇంద్రధనుస్సు రంగులద్దుతూ స్వప్న విహరం చేస్తూ ఉంటాను..
నేను స్వాప్నిక జగత్తులో స్వర్ణపుష్పాల కోసం సంచరిస్తూ ఉంటాను..
ఎగిరే సీతాకోకచిలుకలతో జోడి కట్టి ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను..
మబ్బుల్లో విహరిస్తూ మంచు మొగ్గలకి మనసిచ్చి
నెలవంక మీద ఊయలూగుతూ ఉంటాను..
ఆ వెన్నెలంతా మనసు నిండా ఒడిసి పట్టుకుని
ఇంద్రధనుస్సులోని రంగులను కలలకు అద్దుకుని కన్నుల్లో దాగిన స్వప్నాలకు అక్షరఅస్త్రాలు సంధింస్తూ నిశీధిలో వెన్నెల నక్షత్రాలు పూయిస్తూ ఉంటాను..
స్వాప్నిక జగత్తులో స్వప్నాల తేరులో సంచరిస్తూ ఉంటాను..
