స్వేచ్ఛ
స్వేచ్ఛ
పూర్తైనాయి, డెబ్బది మూడు సంవత్సరాలు
తెంచుకొని, ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు
నాడు పీల్చుకున్నాము స్వేచ్ఛా వాయువులు
అంబరాన్నంటాయి నాడు ఆనంద సంబరాలు.
ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశారు నాయకులు
ఓటు హక్కుతో ఎన్నుకో బడ్డారు ప్రజాపాలకులు
ఎరగకనే అయ్యారు ప్రజలు, పార్టీలకు బందీలు
వ్యక్తి పూజ చేస్తూ, మరిచారు పార్టీ నియమాలు.
ఈ దేశంలో కొందరు ధనాడ్యులు, ఎందరో పేదలు
ఒక వైపు, గుట్టలుగా పోగైన ధనికుల సంపదలు
మరో వైపు తిండిలేక మాడుతున్న బడుగు జీవులు
మళ్లీ మొదలైనాయి బడుగుల ఆరాట పోరాటాలు
ఎటు చూసినా ప్రబలినాయి ముష్కరుల అరాచకాలు
గాలిలో దీపమై నాయి, ప్రజల ధన, మాన, ప్రాణాలు
ఏం చేయలే కున్నారు వారిని, నాయకులు, పాలకులు
ఎవరో వస్తారు, ఉద్ధరిస్తారని చూస్తున్నారు ప్రజలు.
నేటి బాలలే, రేపటి పౌరులు, కాబోయే నాయకులు
వీరే కావాలి ఆశాదీపాలు, మనకి కానున్న పాలకులు
వీరి అండన మనం మళ్ళీ పొందాలి స్వేచ్ఛానందాలు
ఈ యువకిశోరాలే కావాలి మన దేశమాత రక్షకులు.
