స్మశాన వైరాగ్యం
స్మశాన వైరాగ్యం
జారే కన్నీటి చుక్కలతో
సముద్రంలోని ఉప్పదనం పెరిగింది
నడుస్తూ వెళుతూ ఉంటే
ఇష్టం లేని ప్రయాణానికి నీడ వీడ్కోలు చెప్పేసింది
చేతిలో నుండి సూట్ కేస్ పడిపోయింది
అందులో ఏవో కాగితాలు
కొన్ని నల్లవి కొన్ని తెల్లవి
అవన్నీ గాలికి ఎగిరిపోయాయి
పచ్చ కాగితాలు మాత్రమే పట్టించుకునే వాళ్ళకి
అవి కనిపించలేదు
కాళ్ళు ఇసుకను ముద్దాడుతున్నాయి
చేతులకు గవ్వలు దొరికాయి
మాసిపోయిన బాల్యమేదో
ముసురుపట్టిన మబ్బులా వచ్చింది
దూరంగా
మిక్చర్ అమ్ముతున్న కుర్రాడు
ఫోటోలు తీసుకుంటున్న కొత్త జంట
వీటన్నిటి మధ్య
తర్పణం మధ్య వదిలి వెళ్ళిపోతున్న ఓ కుటుంబం
ఇష్టంగా వెళ్లిపోతున్నారు
అంటే
కష్టాన్ని ఓర్చుకున్నారనా
సహజంగా ఇలా ఉండాలనా
స్మశాన వైరాగ్యం
లాటరీ టికెట్ల ఫలితాల్లోనా
ఉద్యోగం పోయిన రోజుల్లోనా
ఆమె దూరమైన క్షణాల్లోనా
అతనికి అర్థం కాలేదు
గట్టిగా నవ్వాడు
వెంటనే ఏడ్చాడు
అలలు ఆ శబ్దాలను తీసుకెళ్ళిపోయాయి
అక్కడేదో ప్రశాంతత..