సమర్పిత
సమర్పిత
సమర్పిత.....
ఆకాశపు కేన్వాసు పై
మేఘాల చిత్ర మాలికలు
ఇక్కడి నల్లటి మనసు
అక్కడ కురుస్తున్న వర్షం
కుంభివృష్టికి పోలికే లేదు
మూగ రోదన తెర తొలగలేదు
తొంగి చూస్తున్న గతం నిండా
గుర్తుతెలియని ప్రశ్నలు
ఆవేశకావేశాల అర్థాలన్నీ
పాతబడ్డ డిక్షనరీలు
అనుభవం ఒక్కటే పాఠం
ప్రతి రోజూ పలకరించే చుట్టం
దానికెప్పుడూ నిన్ను చూస్తే
మొహం మొత్తదు
నువ్వో ఖరీదైన శిష్యుడివి కదా మరి
జీవితాన్ని సమర్పిస్తూ
రెండో మూడో రాటుదేలిన సారాల్ని
వెనక పక్కగా చెక్కుకుంటావు
అంతం తెలియని బాటలో
అలా నడుస్తూనే ఉంటావు...
సుధామురళి
