శాంతి...
శాంతి...
అది శాంతి వనం అయినా
ఆచట శాంతి ఓ భ్రాంతి !
అచ్చోట భూుజాలున్నాయి కానీ
వసంతం వచ్చినా
కోకిలలు వృక్షాలపై సేద తీరవు
తీరినా కూయవు కుహూ కుహూ మని
కాకులూ లేవు కుక్కలూ లేవు
నక్కల వూళలు ఎముకలు కొరికేలా...
తీతువు స్వనాలు భీతి కోలిపేలా ...
కన్నీళ్లు చెప్పే కధలున్నాయి
సమాధులలో కంకాళాలున్నాయి
నిదురించడం లేదు అవి
నీవడిగితే తన కధ చెబుతాయి
చేదరి చేరిందనుకున్న వరి పంట
చేజారిపోయింది వరదల్లో
పురుగులను చంపలేని మందు
రైతన్న ఉసురు మాత్రం తీయగలిగింది !
ఆనాడు హృదయం పగిలిన హాలికిడు
ఈనాడు శయనించాడు శాంతిగా
ఆ సమాధిలో.....
దేశ రక్షణ తన విధిగా
లేశమైనా ప్రాణం లెక్కించని జవాను
మతోన్మాద ఉగ్రవాదం మట్టు పెడితే
అసహన ఆగ్రహాలు ఇంకా వినిపిస్తూనే వున్నాయ్
ఈ సమాధిలో !
ఆకలి ఎలుకలు
కడుపులో కొరికి కొరికి పుండై
పడుపుగా మారిన పడతి
పాడు రోగాలంటించుకుని
ఆసుపత్రి చూడలేక
శయనించింది సమాధిలో శాంతిగా
ఆ ప్రేమికుల ఆత్మలు సంగమించి
విడివడ లేక పెళ్లి చేసుక వెళ్ళిపోతే
నీచ కులమని అల్లుని వేటాడి వేలార్చిన ఘనుడు ....
ఇంకా సమాధిపై తలనుంచి ఆయువతి
మగనితో మాట్లాడుతూనే ఉంది ....
తరగని ఎన్ని వూసులో !
మగని మంచానికి కట్టివైచి
ఎదురుగానే ప్రియినితో వ్యభిచరిస్తే
భరించ లేని అవమానం
అతడిని చేర్చింది ఈ సమాధికి
తెలియదు నాకు
శాంతిగా ఉన్నాడో ఆశాంతిలో వేగుతున్నాడో
ఇతడు పాపం అగ్రకులమట !
రిజర్వేషన్ సర్పం కాటు వేస్తే
సమాధిలో ఇంకా చదువుతువునే వున్నాడు
ఉద్యోగం ఉద్యోగం అని పలవరస్తూనే వున్నాడు
నవ నాగరికతా భ్రాంతిలో యువతి
స్వర్గమని భావించి కాలాగ్ని గుండంలో కాలి
ఈ సమాధిలో ఇంకా అసహనంగా
అల్లాడుతూనే వుంది అటూ ఇటూ పొర్లుతూ
ఉబికిన కన్నీటితో నా కలం నింపి
ఇదా నా దేశమ్మని
చిన్ని కవిత వ్రాసుకుని నిట్టూర్చా...
