సైన్స్ ఫిక్షన్ కథలా..
సైన్స్ ఫిక్షన్ కథలా..
నక్షత్రాలు చూడ్డం ఆపి
వాటి చుట్టూ తిరగడం
మనం ఉన్న చోటులోనే
మరో విశ్వాన్ని చూడడం
కానీ వ్యక్తిలోని మంచితనాన్ని భరించలేకపోవడం
కాంతివేగంతో ప్రయాణించినా
తెల్లజుట్టు చూసి బాధపడడం
మళ్లీ అవే బంధాల వెనుక అసూయ చెందడం
అబ్బే
మీరు మారరబ్బా
ఎల్లకాలం అవే నిష్టూరాలు నిందలు
చంద్రుడి మీద కాలు మోపాం
అని నేనంటే
మేమెళ్ళమనలేదుగా అనే రకం మీరు
సైన్సు ఫిక్షన్ కథలో
అందరూ అన్ని కాలాల్లోకి ప్రయాణించరు
ఎందుకంటే
ఏ కాలంలోకి వెళ్ళినా
బుద్ధి మార్చుకోరు
మరింక ఎక్కడ ఉంటే ఏంటి
ఆ భ్రమణాలు
ఉల్కలు
ఆమ్ల వర్షాలు
మనకెందుకు
పక్కింట్లో గొడవ జరిగింది అంటే
ఆ రోజు శుభ్రంగా కాస్త ఎక్కువ తిని
హాయిగా పడుకోక
అంతే
మీరంతే
ఈ భూమికి అంతు
మీరే
మాకు అంతు చిక్కని ప్రశ్న మీరే
