రేపటికై నా ఆశలలో..
రేపటికై నా ఆశలలో..


రేపటికై నా ఆశలలో..
నా కలల కొలనులో..
ఉషోదయపు అరుణిమ ఉంది,
విరిజాజుల సోయగముంది..
చివురుటాకుల చివరన మెరిసే
మంచుబిందువు స్వచ్ఛత ఉంది.
అమ్మ పెదవులు నా నుదుటిపై వత్తినప్పటి ..
ఆ మెత్తటి లాలన ఉంది.
పొంగు వచ్చిన పాలనుండి
తొంగిచూసే కమ్మదనముంది.
సెలయేటి గలగలల తమాషా గజల్ ఉంది.
చిక్కటి రంగుల హరివిల్లు వంగిన అబ్బురముంది.
తుమ్మెద రెక్కల అతి పల్చటి సుకుమారముంది.
పండు సంపెంగల అద్భుత పరిమళం ఉంది.
ఆగి ఆగి పడుతున్న వాన జడి కి
ఊగుతున్న చిటారు కొమ్మ ఉంది.
సిందూరపు రంగులో మెరిసే నారింజ మిఠాయి ఉంది.
సాయంత్రపు నీరెండ లో
ముడుచుకుపోయే మందారాలను
తడిమి చూసే ఆర్ద్రత ఉంది.
శిఖరాగ్రాలను అధిరోహించాలనే తహతహ ఉంది.
లోయలలోకి జారిపోతున్నప్పుడు కూడా
అంతు, దరి అంచనా వేయగలిగే సాహసముంది.
శిశిర, వసంతాలను సమానంగా చూడగల భావుకత ఉంది.
అందుకే నేస్తం..
కుదిరితే నాతో కూసింత చెలిమి చెయ్ ..
నా ఆశల అంచ కి ఊపిరి పోయ్.