రేపటి రవి కిరణాలు
రేపటి రవి కిరణాలు
శీర్షిక: రేపటి రవి కిరణాలు
************************
ప్రత్యూష ఉషా కిరణాలమై వెలుగునిస్తాం
మీ ప్రోత్సాహమనే చేయూత ఆసరానిస్తే..
నిత్య చైతన్య దీప్తులమై ప్రకాశిస్తాం
మీ ఉత్సాహమనే ఉత్ప్రేరకం అందిస్తే..
తుషారబిందు సందోహలమై ప్రవహిస్తాం
మీ ఊతమనే ఊపునిచ్చి ప్రోత్సహిస్తే..
రంగుల సీతాకోక చిలుకలమై అలరిస్తాం
స్వేచ్ఛనే రెక్కలు అందించి వదిలేస్తే..
గలగలపారే నదులమై దాహార్తిని తీరుస్తాం
అవకాశమనే నిచ్చెనల మెట్లను అందిస్తే..
ఉమ్మనీటి నుండి ఉద్భవించిన గనులం
ఊహల లోకంలో ఉల్కాపాతంలా దూసుకుపోతాం..
అక్షరాల పసిడి వన్నెలద్ది వెన్ను తట్టి చూడండి
అపారమేధాసంపత్తితో పుడమిలో రేపటి రవి కిరణాలై వెలిగిపోతాం..
