పుస్తక ప్రియుడు
పుస్తక ప్రియుడు
పలుకులు తేనెల ఊటలు కాగా
అక్షరముల ఆనందముతో రమించునాతడు
కిలకిల పక్షుల శబ్దములు
పుటల సంఖ్యలో కనిపించె
శ్రావణ శిఖీంద్ర నర్తనమ్ములు
కాగితము త్రిప్పు సవ్వడులే
సమస్త ప్రకృతి శోభయూ
కర్కశ యుద్ధ ఫలితమూ
గంగా గోదావరుల గమనమూ
ఎడారి ఇసుక మీద ఎంగిలి
ఇంటిలోని స్త్రీ లాలిత్యమూ
సమరములోని పశుత్వమూ
ప్రాసలూ బాసలూ
భాషా ప్రేమికుల రుసరుసలు
రుబాయిలు నానీలు అంటూ ప్రక్రియలు
నిమిషానికో మాట మార్చే వేటగాళ్లు
కష్టాన్ని మరపించే పాటగాళ్లు
ఏ దినమైనా మురిపించే సావాసగాళ్ళు
ప్రతి విషయమూ
అతనికి తెలుసు
అతని భావాలు అక్షరాల మీద పడిన కన్నీటి రాగాలు
అతని ఉద్రేకాలు
సమాజపు కలుపు మొక్కలపై చల్లే విషపు మందులు
ఏం చేస్తున్నావ్ ఒక్కడివే
అనే ప్రశ్నకు అతను సమాధానం చెప్పడు
ప్రపంచం నిదురిస్తున్నా
జీవిత సారాన్ని పుస్తక పఠనంలో ఆస్వాదించే వ్యక్తి
ఎవరికీ అర్థం కాని పుస్తక ప్రియుడు
