ప్రేమ లేదని..
ప్రేమ లేదని..
ఎవరేమన్నా పట్టించుకోని నేను
నిన్ను పట్టింపులా తీసుకున్నాను
నువ్వనే ప్రతి మాటా ప్రామాణికంగా
నన్ను నేను మార్చుకున్నాను
తప్పెక్కడ జరిగింది
నేను నేనులా లేకుండా
నీలా మారిపోయినందుకా
అంటే నీకు నువ్వు అద్దంలో నచ్చడం లేదా
ప్రేమ లేదని
ద్వేషం చూపాల్సిన అవసరం లేదు కదా
నన్ను ప్రేమించడం నీలో ఒక లక్షణం కాదా
అది ఒప్పుకోనప్పుడు
నీకు నువ్వు దూరమైనట్లే
బండ రాళ్ల నీడల దగ్గర
పొదరిల్లు కట్టుకున్నట్లు
బలవంతంగా వంచిన చెట్లకు
ఉయ్యాల వేసుకుని ఊగినట్లు
నీ ప్రవర్తన ఇద్దరికీ ప్రమాదమే
నువ్వు ఎదుగుతున్నావ్ అని చెప్పిన ప్రతిసారీ
నిజాయితీలో వెనక్కి వెళుతున్నావ్
అది చెప్పేవారు లేకపోవడంతో
నన్ను చూసి వెక్కిరిస్తున్నావ్
