పోటు (15.9.2019)
పోటు (15.9.2019)


నిశితంగా నిరీక్షిస్తున్నా సాగరాన్ని
ముచ్చటగొలిపే వింతలీల
కనువిందైన దృశ్యకమనీయం
మదిని తాకుతుంది సున్నితంగా...!
అలలు ఎగిసిపడుతున్నాయి
కోపం కట్టలు తెంచుకున్నట్టు
అంతలోనే వెనుతిరుగుతున్నాయి
ఏమీ తెలియని శాంతమూర్తుల్లా...!
నాకర్థమైంది ఆ మహాజలాన్నిచూస్తే
నిండిపోయింది ప్రతినీటిబొట్టూ ఉప్పుతో
సముద్రుడికి పోటెక్కువైతే
అలలెక్కువై ఉరకలేస్తాయని....!
మనిషికి కోపమొచ్చి ఎగిరితే
రక్తపోటు ఎక్కువైందంటారు
ఉప్పు తగ్గించి రుచి చంపుకోమంటారు
నరాలు నాణ్యతగా ఉండాలని...!
సముద్రం ఉప్పులో మిళితమయ్యిందనేమో
తనకు తానే సంభాళించుకోడానికి
ఆటుపోట్లను సమన్వయం చేసుకుంటూ
చిందులేస్తూనే ఉంటుంది మహాసాగరం...!!