పాదాలు పగిలిపోతున్నా....
పాదాలు పగిలిపోతున్నా....
ఆస్వాదించెయ్ మిత్రమా! ఆస్వాదించెయ్!
తెల తెల వారే వేళ
సన్నని మారుతం తగిలెనే..ఇలా!
భానుడి తొలి చూపు
నా గుండె ను గుచ్చెను... భళా!
హ్రృదయమా! ఆస్వాదించెయ్!
కోయిల స్వర మాధుర్యాన్ని..
పక్షుల కిలకిలా రావాలని..
నేలతల్లి కి స్నానమాడించే
మేఘసందేశాన్ని..
కంబళి కౌగిలి ని పలకరించే
శీతలవాయువును..
ఆస్వాదించెయ్!
ఎన్నో యేళ్లు నుండి..
యంత్రపు విసర్జకాలతో
వాహనాల రణగొణ ధ్వనులతో
జన సమూహాలు విడిచే
కార్బన్ డై ఆక్సైడ్..
ప్లాస్టిక్ వ్యర్ధాలు తో...
కాలుష్యపు కోరల్లో చిక్కుకుని
ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక
తను వేదనను..
మనకు విన్నవించలేక
విలపించి..
మానవ సమాజం పై..
విరక్తి చెందిన.. ప్రకృతి!
నేడు..
ప్రతి ఉదయం నిన్ను నన్ను
హాయిగా పలకరించేందుకు
తనకు తానుగా పులకరించేందుకు
ప్రకృతి మన వద్దకే వచ్చింది!
ఆస్వాదించెయ్!
నాకెక్కడది అంత కులాశ అందువా?
నీ కన్నా నా కన్నా
కులాశ లేని వలస పక్షులు
ఎందరో ఉన్నారు అటు చూడు..
పాదాలు పగిలిపోతున్నా
గుండెలు అలిసి పోతున్నా
ఆకలితో పొట్ట అంటుకుపోతున్నా
నెత్తిన మూటతో
భుజాన బరువుతో
చంకన చంటాడితో
అడుగులో అడుగు వేసుకుంటూ
వందల మైళ్ళు వలస పోతున్న..
నిత్య పోరాట యోధులే
మనకు స్ఫూర్తి!
వారి మొక్కవోని దీక్షకు..
బాధ.. బానిస అయ్యింది
ఆవేదన.. ఆత్మవిశ్వాసం అయ్యింది!
మేలుకో
మిత్రమా మేలుకో!తెలుసుకో !
నిర్లక్ష్యము వదులుకో!
........ రాజ్.....