ఓ రైతన్నా!
ఓ రైతన్నా!
ఓ రైతన్నా!
తొలకరి జల్లులు కురవంగా
పులకరించి పుడమి మురియంగా
హలములు పట్టిన సైరికులు
పొలములు దున్నగ నడకలు
చిత్తడిలో నాగలి పోటులు
విత్తనాలు నాటిరి రైతులు
మొలకలు లేవని కృంగిరి
పిలకలు రావని ఏడ్చిరి
నకిలీ సరుకుల మోసము
తెలియని రైతుకు శాపము
అప్పు తెచ్చిన పైసలు
ఆత్మాహుతికై ఖర్చులు
ఆవేశపడకు రైతన్నా!
అర్థనిమిషమాగన్నా!
నీవే జాతికి రత్నము
నీవు లేనిదే శూన్యము
తిండి పెట్టే నాథుడవు
అండనుండే దేవుడవు
నీవేలే మాకు జీవనాధారము
కాదు కాదన్న మాకు మరణము
వదలవోయి నీ నిరాశను
ఎదిరించవోయి!ఈ మోసమును
పదపదవోయి!నీకు తోడుగా
నా కలమును మార్చెద కత్తిగా
నీ వెనుకే నేను నడిచి వత్తును
కవితలతో విశ్వాన్ని చెరిగేస్తాను.
---------------------------------------
