నడవ
నడవ
తడవ తడవకూ అతణ్ణి చూడాలని
అతను నడుస్తుంటే ఎగిరిపడే భుజాలు
అతను వేళ్ళతో దువ్వుకున్న మీసాలు
చూపుల్తో తాకాలని
కళ్ళతో ఒక్కసారి అతణ్ణి ఆపాలని
ఎన్నెన్నో ఆశలతో ఆమె కూర్చుంది
వాలు జడను ముందుకు వేసుకుని
వలపును పళ్ళెంలోని తాంబూలంలా చేసుకుని
అతనితో కలిసి ఆరగించాలని
ప్రతి శిశిరాన్నీ వసంతంలా మార్చివేయాలని
ఇలా ఏవేవో ఊహలు ఎదను ఉక్కిరబిక్కిరి చేస్తున్నాయి
అలా నడవలో కూర్చుని వీధి గడప వైపు చూస్తూ
పెరటి నుండి వచ్చే గాలి వీపును తాకుతుంటే
ఆమె భారంగా నిట్టూర్చింది.