నడుస్తున్న
నడుస్తున్న
తెల్ల కాగితంలా ప్రకాశించే
జీవితం..
నల్లబల్లగా మారిన క్షణం
లెక్కల దురాక్రమణ మొదలయింది...
గణితపు గుర్తుల్లో అణిగిపోయిన మనిషి..
డెబిట్ క్రెడిట్ ఉచ్వాశ నిశ్వాసాల్లో
మానవీయ చివరి అంచున వేలాడుతున్నాడు...
లెక్కలిప్పుడు
అంకెల ఆకారాలు కాదు..
మనిషిని శాసించే
ద్రవ్య రాక్షస ఘీంకారాలు...
మనిషి మనిషిగా కాక
లెక్కల మూటగా మారి
బంధానుబంధాల్ని
జమా ఖర్చులతో బేరీజు వేస్తూ
నడుస్తున్న అంకెలా మారిపోయాడు..
లెక్కల చక్రంలో
చిక్కుకున్న మనిషిప్పుడు..
రెక్కలు తెగిన విహంగం..
