నాలోని అలజడి
నాలోని అలజడి
** నాలోని అలజడి **
ఏడుస్తున్నారెవరో
నాలో...
తల బాదుకుంటూ
గుక్కపట్టి
వెక్కి వెక్కి
హక్కులు త్రోక్కేశారనేమో
వాక్కును నొక్కేశారనేమో
ఇక్కట్ల పాలు చేశారనేమో
ఉక్కు పాదాలతో అణిచేస్తున్నారనేమో
నక్కల్లా టక్కరి మాటలు
వక్కాణిస్తున్నారనేమో
బక్కచిక్కిన తనను
మక్కెలు విరగ తీస్తున్నారనేమో
ఏడుస్తున్నారెవరో
నాలో...!
ఈమూల
ఆమె ఎవరో !
నవ్వుతూంది
నవ్వుకాదది
చెవ్వులు పగిలేలా వికటాట్టహాసం
వికృత రూపంతో
నికృష్ట జటలతో
నోటిలో జ్వాలలతో
ఎర్రని కనుగుడ్లతో
చర్రున చరుస్తూ కొరడాతో
నా వొడలంతా గాయాలు
పంటి నొక్కులే దేహమంతా
పన్నుల చారలేమో
మంటలు మంటలు మంటలు
వంట వాయువుల మంటలు
రాతినూనె గాయాలు
ఈతి బాధలు
నా నాతి సణుగుడూ
కోతి చిందులూ
కొడుతూనే ఉంది కొరివి దయ్యం
కొరడాతో....
అప్రాచ్యపు నవ్వుతో
కొనబోతే కొరివి
కొరివి కారంలా
అమ్మబోతే అడవి
అడవికాదు ఎడారి
బ్రతుకు మృగతృష్ణలో
నా కలం కన్నులు ఎర్రబడ్డాయి
రుధిరంతో నింపుకుంది కడుపు
పాళీ నిప్పులు గ్రక్కుతూంది
గాలిలో ప్రయాణిస్తూంది
ఆగ్నేయాస్త్రంలా....
పన్ను పోటుకు పెన్ను పోటు
నిరంకుశత్వానికి అంకుశం
గెలిచేదెవరో...
... సిరి ✍️❤️
