నా కథ నీ కథ
నా కథ నీ కథ
నా కథ నీతో మొదలవ్వలేదు
నా కథ నీ కథ కంటే ముందే
మూడు వేల సంవత్సరాల ముందుంది
నీ వేదాల కంటే నా నాగరికతే ముందుంది
నా నగరాలు మొహాంజదారో, హారప్పాలు
భూతల స్వర్గ దామాలు
నాగరికతకు నిలయాలు
చక్కని పట్టణ ప్రణాళిక సింధు ప్రవాహిక
కాల్చిన ఇటుకలతో ఇండ్లు అంతస్తులకు మెట్లు
గాలి వెలుతురు రావడానికి కిటికీలు
గచ్చూ వేసిన నేల, విశాలమైన వేదికలు
నా మేధావితనానికి మేటి
ఇంటిముందు పెరడు, స్విమ్మింగ్ పూల్
ఇంటి వెనుకకు వాన నీరు,మురుగు
డ్రైనేజీ, శుచి శుభ్రత నా సొంతం
నా కుటీర పరిశ్రమలు
ఆటబొమ్మలు, పక్షుల బొమ్మలు
రాతితో చెక్కిన తూనికలు, కొలతలు
లోహాలు, మట్టితో అందమైన పాత్రలు
నా పనితనానికే సాటి
కాళ్లకు కడియాలు, చేతులకు గాజులు
వేళ్లకు ఉంగరాలు, సౌందర్యానికి లేపనాలు
కురులకు దంతాలతో చేసిన దువ్వెనలు
నా నేర్పరితనానినికి తార్కాణాలు
నా అపారమైన పశుపోశన
ఆవులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు
పశువుల ఎరువులతో వ్యవసాయం
గోధుమ, వరి, యువధాన్యలు పండించి
స్థిరనివాసం వర్తక వ్యాపారం సాగించి
ఆకలిని హారించి అవని యందు అన్నపూర్ణనైతిని
బంగారు,వెండి, రాగి, మణులు
నగలు,ఆభరణాలతో రత్నగర్భగా
సకల సంపద,సంస్కృతిల నిలయంగా
నా కథ సింధు నాగరికతగా పుడమిపైన
పురుడు పోసుకుని పరిఢవిల్లింది
ఎన్ని లోకాలైన తిరిగిరా
త్రిశంకు స్వర్గమైన పోయిరా
ఇతిహాసాల్లో వర్ణించిన భవనాలైన
అది ఇంద్రసభయిన అది మాయసభయిన
ఉహాలల్లో నీవు కట్టుకున్న మేడలైన
మొహాంజదారో, హారప్పాలు నా నగరాలు
నీ కథకు నా(ఇ)వే మూలాలు
నా కథ హారప్పా నాగరికత
నీ కథ కట్టు కథ
