నా ఆశల అగరవత్తులు
నా ఆశల అగరవత్తులు
నా గుండె గది స్వప్నాలతో నిండిపోయింది,
నా తనువు వాటిని మోయలేక అలసిపోతోంది.
వేడి సూర్యుడు నా వెంట పడుతున్నా,
వెన్నెల రేయి మంచంపై వాలిపోవాలని ఉంది.
ఆశల అగరవత్తులు కరిగిపోతున్నాయి,
ఒంటి నిండా బూడిద గుర్తులు మిగిలిపోయాయి.
యవ్వనం భారంగా నడుస్తున్నా,
అనుభవాలన్నీ జీవిత వృక్షం నీడగా మారిపోతున్నాయి.
ఆశాలతలన్నీ మనసు చుట్టూ చుట్టుకున్నా,
ఎడారిలో వర్షం కోసం ఎదురుచూస్తున్నట్లుగా...
వసంతపు కోకిలని రమ్మని పిలిచేందుకు,
కనిపించని కొమ్మలపై కూనిరాగాలు తీస్తున్నాను.
గర్వపు చొక్కాని ఒంటి నిండా కప్పుకున్నా,
మనసు నిండా పిరికితనాన్ని దాచుకుని...
అతిశయోక్తి మాటల్ని అందంగా మలిచి,
స్వభావోక్తులని కనిపించకుండా కప్పేశాను.
వేకువ కిరణాన్ని వెంటేసుకుని,
బతుకు పయనంలో కొత్త రుచులు వెతికేందుకు...
ఆకాశ పళ్లెం ఖాళీ అవ్వగానే,
నేలపై విందు భోజనాల వేట సాగిస్తున్నాను.
చివరికి మిగిలింది చేతిపైన కాలం గుర్తులు,
నిర్వేదమంతా వేదాంతం కింద చేరిపోయింది.
కన్నీటిలో పన్నీటిని వెతుక్కుంటూ,
భవిష్యత్తుకు ఆశల దారులు వేసుకుంటాను.
