నీ ప్రేమను
నీ ప్రేమను
నీ ప్రేమను పాడుకునే..వేడుకలో ఉండనిమ్ము..!
ఈ మనసును నీ పాటల..సందడిలో తేలనిమ్ము..!
నీవు-నేను మాయమైన..సమయమెలా ఉండేనో..
పరిమళించు కావ్యధార..నీపదముల కడగనిమ్ము..!
నీ సఖిగా ఒక్కక్షణం..బ్రతికి పోవుట భాగ్యమందు..
భావగగన వీధులన్ని..సరిగ మరిగి ఇగరనిమ్ము..!
నీకు గాక ఇంకెవరికి..ఇవ్వగలను ఈ లేఖను..
ప్రతిరాగం రాగాలకు..అతీతముగ వెలగనిమ్ము..!
ప్రవహించే కోరికలకు..కలలుండుట సహజమే..
పయనించే రాచిలుకను..నీ ఎదపై వాలనిమ్ము..!
చిత్తవృత్తి నిరోధమో..విరోధమో ఎందుకటా..
ప్రవృత్తియె నివృత్తిగ..అనవరతం మిగలనిమ్ము..!
