ముక్కలైన మనిషి
ముక్కలైన మనిషి
పైపై మెరుగుల నగిషీల మనిషి ,
మెరిసేదంతా బంగారమని తలంచి
మేడిపండు చందనమైపోయాడు;
లోలోన గాయాల పుండుతో సలుపు,
అంతరంగమంతా అలజడుల కలుపు,;
పైపైకి షుగర్ కోటింగ్ మాటలు
ప్లాస్టిక్ నవ్వుల హారం
దేనికో అంతులేని ఆరాటం
ఈ శతాబ్దాంలో ప్రతి మనిషి
ఓ పోరాట సాధకుడే!
యోగిలా వున్నా ,
భోగిలా వున్నా అన్వేషణ లోతుల్లో
పయనమే! ఇదే తీరు ఎందరిదో!
రంగమేదైనా సరే రణరంగమే!
ప్రేమపూర్వక వచనాలూ లేవు,
ఆదర్శ దాంపత్యమూ లేదు!
అరమరికలు లేని స్నేహ బంధమూ లేదు,
ఇది రోబోల యుగం కదా, మర మనిషిలా
బతకడమే మంచిదని భావిస్తున్నాడు
ఎక్కడ చూసినా పగలు, ప్రతీకారాలే!
సొంత బంధాల్లో సైతం మినహాయింపు లేదు,
ఒకరిని మించి ఎదగాలనే ధన కాంక్షే !అందం
వయసు ఆకర్షణలకు లోబడి, కాసులకై ఎగబడి ,
చదువు సంస్కారం విడనాడి నిత్యం ముక్కలైన
మనిషి ఒంటరిగా సంచరిస్తున్నాడు
