మొక్కవోని ఆత్మవిశ్వాసం
మొక్కవోని ఆత్మవిశ్వాసం


ఆశలన్నీ అవిరైపోతున్నాయి
అవకాశాల్ని అడుగంటిపోతున్నాయి
దిక్కులన్నీ వెక్కిరిస్తున్నాయి
నింగి నేల చేరదీయడం లేదు
గాలీ వెలుతురు సహకరించడం లేదు
పంచభూతాలూ దయ చూపడం లేదు
ఆకాశవాణి అవిరైపోమంటుంది
భూమాత బూడిదైపోమంటుంది
సమస్త లోకాలూ దార్లు మూసేస్తున్నాయి
తోటి ప్రాణులు వదిలిపోయాయి
బంధుమిత్రులు ఆదరించడం లేదు
చుట్టూ చిమ్మ చీకట్లు
ఎటుచూసినా...ఎడారి నేలలే
సాయపడటానికి సూర్యచంద్రులు
వెనుకడుగు వేస్తున్నారు
ఋతువులు ముఖంచాటేస్తున్నాయి
కాలం కనికరించడం లేదు
వెనక్కి తిరిగి చూడకుండా
వేగంగా వెళ్లిపోతూనే ఉంది
శరీరం బలాన్ని నిలుపుకోవడం లేదు
ఆర్ధిక అంగ బలాలు అడుగంటిపోయాయి
నిరాశ ఉత్తేజంగా కౌగలించుకుంటుంది
ఆలోచనలు పరిపరివిధాలు
నా అన్నవారి ఊరడింపులు లేవు
జీవితం వెటకారంగా నవ్వుతుంది
భవిష్యత్ పెదవి విరుస్తుంది
భూతకాలం నిట్టూర్పు విడుస్తుంది
వర్తమానం అయోమయయ్యింది
కనుచూపు మేరలో శూన్యమే...
కనురెప్పలకు నైరాశ్య నిద్రముంచుకు రాగా
శాశ్వతంగా వాలిపోతాయేమో
ఒక్క ఆత్మ విశ్వాసం మాత్రమే
నేనున్నానని భరోసా ఇస్తుంది
కళ్ళు ముయ్యవద్దు కదలమంటుంది
కాలిక్రింద నేల కనికరించింది
అసహజ ఆసరా అభయమిచ్చింది
జీవితాన్ని కాచి వొడపోసిన గూడు
చినుకు చెరువులు నుండి చెదుకున్న
చెమ్మ చేతి చలువ తట్టి లేపింది
నిరాశఎరుగని భానుడి కాంతి స్పర్శ కాస్తా
ఊపిరికి ఊతమిచ్చింది
శిథిలమౌతున్న బాహ్య దేహం
ఆదర్శమై హృదయానికి అమాంతం
హత్తుకుంది భుజానికెత్తుకుంది
ఆత్మబలం ఆయువుపెంచింది
విత్తు నిలువెత్తు సత్తువ తెచ్చుకొని
మొక్క అయ్యింది మొలిచి నిలిచింది.
ఇప్పుడు చూడండి విమర్శకుల
పెదవులపై వేలు పడుతున్నాయి
లోకాలన్నీ బంధత్వం కలుపుతున్నాయి
ఋతువులు విజయం మాదే అంటే
ప్రకృతి ఫలితం నావల్లే అంటుంది
పంచభూతాలూ ఫ్రెండ్స్ అవుతున్నాయి
విత్తు విస్తుపోతుంది లోకం తీరుతో...
చిరునవ్వుతో ఆత్మవిశ్వాసానికి
ఆత్మప్రదక్షణ చేసి దండమెట్టింది
మెట్టు మెట్టు ఎదిగి మట్టి మీద
తన ఉనికితో చరిత్ర సృష్టించి
శాశ్వతం చేయడానికి సిద్ధమౌతోంది
నిబ్బరంగా... నిండు నమ్మకంతో
గుండె ధైర్యంతో...ముందుకెళ్తూ..విత్తు
మొలకై రేపటి మహావృక్ష లక్షణాలుతో