మల్లెపూల వాన
మల్లెపూల వాన
మల్లెపూల వాన మౌనమే ఎపుడైన..
చల్లనైన చూపు శాంతిమధువు..
జరుగుచున్న క్రీడ సాక్షిగా మిగులగ..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
కలను దాచలేవు కనురెప్పలింటిలో..
కాల్చవచ్చు పట్టి కల్ల కాదు..
"శ్వాస మీద ధ్యాస" చక్కగా నిల్పగ..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
అలుక లెఱుగ నట్టి అందాల మహరాజు
అలసటసలు లేని అమృత వరుడు..
సకల రూపధరుడు శ్వాసాంత రంగుడే..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
ఆకుపచ్చ ధనమె అద్భుత సంపద..
పుడమిలోన నిలుప పుణ్య ఫలము..
పసిడిపూల వనము భా'వనమే సుమా..!
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
అందమున్నదోయి ఆకాశ దీపమై..
అంతమవ్వదోయ అందమసలు..
అందచందములవి అల్పమే కొలువగా.!
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
లెక్కలెన్ని కట్టి లేదులే లాభమ్ము..
గతములోన మునుగ కల్ల సుఖము..
ఏమి చేయవలయు ఇప్పుడీ నిముషాన..!
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
కణము కణములోన కలల సామ్రాజ్యమ్ము
తెలిసి ఏలుకొనుట ధీరగుణము
జన్మలేల వేయి జ్ఞానము నందగన్..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
మట్టినుండి పుట్టి మట్టిలోన కలియు
చినుకుయొక్క గుణము చిత్తమయ్యె.!
మేఘమందు చేరు మెఱుపులే కోరికల్..
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!
నీదు మనసె నీకు నిజమైన మిత్రుడు..
కలలు నిజముచేయు..కలత మాన్పు..
మాటవరుసకైన మరచి తిట్టకెపుడు..!
మనసు పెట్టి వినుము మాధవోక్తి..!

